Begin typing your search above and press return to search.

దేశానికి పెళ్లి కళ.. 2 నెలల్లో 46 లక్షల పెళ్లిళ్లు..ఖర్చు లెక్క తెలిస్తే వావ్ అనేస్తారు

దేశానికి పెళ్లి కళ వచ్చేసింది. ఏడాది చివర్లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది.

By:  Garuda Media   |   1 Nov 2025 9:54 AM IST
దేశానికి పెళ్లి కళ.. 2 నెలల్లో 46 లక్షల పెళ్లిళ్లు..ఖర్చు లెక్క తెలిస్తే వావ్ అనేస్తారు
X

దేశానికి పెళ్లి కళ వచ్చేసింది. ఏడాది చివర్లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. నవంబరు.. డిసెంబరు రెండు నెలల వ్యవధిలో దేశ వ్యాప్తంగా మొత్తం 46 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. పెళ్లిళ్ల సీజం వచ్చేస్తే.. వ్యాపారాలు మాత్రమే కాదు.. దేశ ఆర్థిక పరిస్థితికి మరింత ఉత్సాహాన్ని.. ఊపును తెచ్చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ రెండు నెలల్లో జరిగే పెళ్లిళ్ల సందర్భంగా అయ్యే ఖర్చు ఈసారి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా ప్రకారం ఈ రెండు నెలల్లో భారీగా జరిగే పెళ్లిళ్ల కారణంగా రూ.1.8లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సంస్త దేశంలోని 75 ప్రధాన నగరాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఇందులో ముఖ్యమైంది.. సంపన్నులు చేసుకునే డెస్టినేషన్ పెళ్లిళ్లలో మార్పులు చోటు చేసుకున్న వైనాన్ని గుర్తించారు.

రూ.5 కోట్ల పెట్టుబడి పెట్టుబడి పెటటే ఆస్తులు ఉన్న వారిలో 80 నుంచి 85 శాతం మంది స్వదేశీ డెస్టినేషన్ మ్యారేజ్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా గుర్తించారు. కొంత కాలం క్రితం దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశీ డెస్టినేషన్ పెళ్లిళ్లకు పిలుపునివ్వటం తెలిసిందే. ప్రధాని మోడీ పిలుపు తర్వాత విదేశీ డెస్టినేషన్ మ్యారేజ్ కంటే స్వదేశీ డెస్టినేషన్ మ్యారేజ్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తేల్చారు. స్వదేశీ డెస్టినేషన్ పెళ్లిళ్ల వేదికగా రాజస్థాన్ ప్యాలెస్ లు.. గోవాలోని రిసార్టులతో పాటు కొత్తగా వయనాడ్.. కూర్గ్.. రిషికేష్.. సోలన్.. షిల్లాంగ్ లకు ఎంక్వయిరీలు పెరిగినట్లుగా చెబుతున్నారు

పెళ్లిళ్ల కోసం పెట్టే ఖర్చు విషయంలో భారతీయులు అంతకంతకూ ఎక్కువగా ఖర్చు చేస్తున్న విషయాన్ని ఈ సంస్థ గుర్తించింది. 2022లో 32 లక్షల పెళ్లిళ్లకు రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. 2023లో 38 లక్షల పెళ్లిళ్లకు పెట్టిన ఖర్చు రూ.4.74 లక్షల కోట్లు. 2024 విషయానికి వస్తే.. 48 లక్షల వివాహాలకు పెట్టిన ఖర్చు రూ.5.9 లక్షల కోట్లుగా లెక్కలు తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పెళ్లిళ్ల ఖర్చు భారీగా పెరగటం ఖాయమని చెప్పక తప్పదు.