ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ కీలకం ?
తమిళనాడు నుంచి కొత్త ఉప రాష్ట్రపతిని తీసుకుని రావాలని బీజేపీ డిసైడ్ అయి మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ కి చాన్స్ ఇచ్చింది.
By: Satya P | 20 Aug 2025 12:14 AM ISTదేశ రాజకీయాలు ఇపుడు దక్షిణ ద్వారం వైపుగా అడుగులు వేస్తున్నాయి. జాతీయ రాజకీయం అంటే ఎంతసేపూ ఉత్తరాది ఆధిపత్యం అన్న మాటే ఉండేది. ఏ రాజకీయ నిర్ణయం అయినా లేక ఏ పదవులు అయినా ఉత్తరాదితోనే అంతా అన్నట్లుగా ఉండేది. కానీ ఈసారి మాత్రం భారీ మార్పు కనిపిస్తోంది. ఉత్తరాదిన తన బలం సంతుష్ట స్థాయికి చేరి తిరిగి కొంత తగ్గు ముఖం పడుతున్న నేపధ్యాన్ని 2024 ఎన్నికల్లో బీజేపీ చూసింది. దాంతో దక్షిణాది మీద పట్టు బిగించాలని అప్పటి నుంచే ఆలోచనలు చేస్తూ వస్తోంది. దాని ఫలితమే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో దక్షిణాది నుంచే ఎన్డీయే అభ్యర్ధిని నిలబెట్టింది.
ఆ చాన్స్ బీజేపీ వదిలేసిందా :
తమిళనాడు నుంచి కొత్త ఉప రాష్ట్రపతిని తీసుకుని రావాలని బీజేపీ డిసైడ్ అయి మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ కి చాన్స్ ఇచ్చింది. అయితే బీజేపీ ఎత్తుకు ఇండియా కూటమి పై ఎత్తు వేసి తెలుగు స్టేట్స్ నే ఫోకస్ చేసింది. నిజానికి బీజేపీ పరంగా చూసుకుంటే తమిళనాడు కంటే తెలుగు స్టేట్స్ లోనే బలంగా ఉంది. తెలంగాణాలో ఎనిమిది మంది తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. ఏపీ నుంచి చూస్తే సొంతంగా అయిదుగురు ఎంపీలు మిత్రులతో కలిపితే పాతిక పైగా ఉన్నారు. అందువల్ల వైసీపీ బీఆర్ఎస్ లను తమ వైపు తిప్పుకోవాలంటే తెలుగు వారికే చాన్స్ ఇచ్చి ఉండాల్సింది అని అంటున్నారు.
ఇండియా స్ట్రాటజీకి ధీటుగా :
ఎక్కడైతే బీజేపీ వ్యూహం కొంత తడబడిందో దానిని అధిగమిస్తూ ఇండియా కూటమి తెలుగు వారికి చాన్స్ ఇచ్చింది. అలా అనూహ్యంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా బ్లాక్ కి ఉప రాష్ట్రపతి అభ్యర్ధి అయ్యారు. ఇక చూస్తే కాంగ్రెస్ కి సౌత్ స్టేట్స్ లో మంచి బలం ఉంది. కర్ణాటక, తమిళనాడు, కేరళలలో ఇండియా కూటమి ఉంది. తెలంగాణాలోనూ అధికారంలో ఉంది. దాంతో రెండు తటస్థ పార్టీలతో పాటు టీడీపీని ఇబ్బందిలో పెట్టే వ్యూహంతోనే మాజీ న్యాయమూర్తిని బరిలోకి దించారని అంటున్నారు. దీని వెనక తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని అంటున్నారు.
తన పట్టు చాటారా :
కాంగ్రెస్ అగ్ర నాయకత్వం వద్ద తన పట్టు తగ్గిందని తెలంగాణాలో విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ తరచూ చేసే ఆరోపణలకు రేవంత్ రెడ్డి ఈ విధంగా బదులు ఇచ్చారు అని అంటున్నారు. జాతీయ స్థాయిలో నువ్వా నేనా అన్నట్లుగా ఢీ కొడుతున్న ఎన్డీయే ఇండియా కూటమి పార్టీల పోరులో ఉప రాష్ట్రపతి అభ్యర్ధిని తమ స్టేట్ నుంచి ప్రతిపాదించి నెగ్గించుకోవడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదని అంటున్నారు. ఆ విధంగా రేవంత్ రెడ్డి ఒక్కసారిగా జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించారు అని అంటున్నారు.
ఆ ఓట్లు పడితే సూపర్ హిట్టే :
ఇక తెలంగాణాకు చెందిన తెలుగు వాడిగా ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి విషయంలో బీఆర్ స్ వైసీపీలలో ఏ వైపు నుంచి ఓట్లు పడినా రేవంత్ రెడ్డి సూపర్ సక్సెస్ సాధించినట్లే అని అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే తెలంగాణా వాదానికి కట్టుబడి తమ ఓట్లను ఇండియా కూటమి వైపు వేసినట్లు అయితే రేవంత్ రెడ్డికి జాతీయ స్థాయిలో పరపతి బాగానే పెరుగుతుందని కాంగ్రెస్ లో కూడా ఆయన మరింత కీలకం అవుతారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మూడు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న తెలుగు నాట వారిని కార్నర్ చేస్తూ రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన చేయించారని ఇపుడున్న పరిస్థితుల్లో ఇండియా కూటమికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బ్రహ్మాండమైన చాయిస్ అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
