Begin typing your search above and press return to search.

మరణ శిక్ష రద్దుకు భారత్ వ్యతిరేకం...రీజన్ ఇదే !

మరణశిక్షపై తాత్కాలిక నిషేధం విధించాలన్న ఐక్యరాజ్యసమితి ముసాయిదా తీర్మానానికి భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది. మెక్సికో ప్రతిపాదించిన ఈ తీర్మానానికి 133 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, భారత్ సహా 33 దేశాలు వ్యతిరేకించాయి. మరో 16 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. భారత్‌లో అరుదైన కేసుల్లో మాత్రమే మరణశిక్ష విధిస్తామని ఐరాసలో స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో 545 నుంచి 564 మంది ఖైదీలు మరణశిక్ష కోసం ఎదురుచూస్తున్నారు.

By:  Satya P   |   16 Nov 2026 9:50 AM IST
మరణ శిక్ష రద్దుకు భారత్ వ్యతిరేకం...రీజన్ ఇదే !
X

భారత దేశంలో మరణ శిక్ష అన్నది అత్యంత కఠినమైన శిక్షగా ఉంటుంది. అంతే కాదు అదే అంతిమ శిక్ష కూడా అవుతుంది. అయితే భారత్ లో మరణ శిక్ష 1860 నుంచి అమలు చేస్తున్నారు . దేశంలో ఆధునిక న్యాయ వ్యవస్థ ప్రకారం మరణ శిక్ష బ్రిటిష్ వారు రూపొందించిన భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 53 సెక్షన్ 302 ప్రకారం హత్య రాజద్రోహం వంటి తీవ్రమైన నేరాలకు మరణశిక్షను చట్టబద్ధం చేశారు. అయితే పురాతన కాలం నుంచే భారత్ లో రాజుల పాలనలో మరణ శిక్ష అమలులో ఉంది. దేశానికి స్వాతంత్రం తర్వాత కొనసాగిస్తూ వస్తున్నారు

అదే మొదటి ఉరి :

ఇక స్వతంత్ర భారతదేశంలో మొదటి ఉరిశిక్ష 1947 సెప్టెంబర్ 9న జబల్‌పూర్ జైలులో రఘురాజ్ సింగ్ అనే వ్యక్తికి అమలు చేశారు. అలాగే 1949 నవంబర్ 15న మహాత్మా గాంధీ హత్య కేసులో నాథూరాం గాడ్సే నారాయణ్ ఆప్టేలను ఉరితీశారు. ఆ తరువాత 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 21 ప్రకారం మరణశిక్షను కొనసాగించారు. 1980లో సుప్రీంకోర్టు బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో తీర్పునిస్తూ, కేవలం అరుదులో అరుదైన కేసులలో మాత్రమే మరణశిక్ష విధించాలని స్పష్టం చేసింది. మోడీ ప్రభుత్వ హయాంలో పాత ఐపీఎస్ స్థానంలో తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత- 2023 భారతీయ నాగరిక్ సురక్షా సంహిత -2023 చట్టాలలో కూడా మరణశిక్షను కొనసాగించారు. దీని ప్రకారం అత్యంత తీవ్రమైన నేరాలకు ఉరితీత ద్వారా మరణశిక్ష అమలు చేస్తారు.

వ్యతిరేకంగా ఓటు :

ఇదిలా ఉంటే మరణ శిక్షల మీద ప్రపంచవ్యాప్తంగా తాత్కాలికంగా నిషేధానికి ఐక్యరాజ్య సమితి ముసాయిదా తీర్మానం తాజాగా ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానానికి భారత్ వ్యతిరేకంగా ఓటు వేయడం విశేషం. అలాగే భారత్ తో పాటు అమెరికా చైనాతో సహా 33 దేశాలు మరణ శిక్షను రద్దు చేయమని స్పష్టం చేశాయి. మెక్సికో ప్రతిపాదించిన ఈ తీర్మానానికి అనుకూలంగా 133 దేశాలు ఓటు వేస్తే మరో 16 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఇక మరణ శిక్ష అమలు అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఏకాభిప్రాయం లేదని ఈ సందర్భంగా భారత్ స్పష్టం చేసింది.

అరుదులో అరుదైన కేసుల్లోనే :

భారత్ లో మరణ శిక్షల అమలు గురించి చట్టంలో ఉన్న అమలులో మాత్రం చాలా ప్రమాణాలు పాటిస్తోంది. అరుదులో అరుదైన కేసులలో మాత్రమే ఈ కఠినమైన శిక్షను అమలు చేస్తోంది. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ భవిక మంగళానందన్ స్పష్టం చేశారు. భారత్ లో సక్రమమైన న్యాయ వ్యవస్థతో పాటు ఎన్నో రక్షణ చర్యలు ఉన్నాయని ఆ దశలు అన్నీ దాటిన మీదటనే మరణ శిక్ష విధింపు అన్నది వస్తుందని ఆమె పేర్కొన్నారు.

భారత్ లో పెండింగులో కేసులు :

భారతదేశంలో పెండింగులో ఉన్న మరణ శిక్షల వివరాలు చూస్తే ప్రస్తుతం సుమారు 545 నుండి 564 మంది వరకు ఖైదీలు మరణశిక్ష పడి జైళ్లలో ఉన్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. మరణశిక్ష పడిన ఖైదీలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నారు. అలాగే భారతదేశంలో చివరిసారిగా 2020 మార్చి 20న ఢిల్లీలోని తీహార్ జైలులో 2012 సామూహిక అత్యాచారం హత్య కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. అంతకుముందు 2015 జూలై 30న ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష విధించారు. మరణశిక్షను అమలు చేయడానికి ఉరితీయడం చట్టబద్ధమైన సరైన పద్ధతి అని పేర్కొంటూ ఇక రాజ్యాంగంలోని 72వ అధికరణం ప్రకారం రాష్ట్రపతికి 161 అధికరణం ప్రకారం గవర్నర్‌కు మరణశిక్షను మార్చడానికి లేదా క్షమాభిక్ష ప్రసాదించడానికి అధికారాలు ఉంటాయి.

చైనా నంబర్ వన్ :

ఇదిలా ఉంటే ప్రపంచంలో అత్యధికంగా మరణశిక్షలు అమలు చేసే దేశాలలో చైనా మొదటి స్థానంలో ఉంది అని చెబుతారు. కానీ అక్కడి ప్రభుత్వం ఈ గణాంకాలను దేశ రహస్యంగా ఉంచుతుంది. అక్కడ హత్యలు చేసిన డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినా అవినీతి కేసులలో కూడా చైనా ప్రభుత్వం ఏకంగా మరణ శిక్ష విధిస్తుంది. ఇక చైనాలో ప్రధానంగా విషపూరిత ఇంజెక్షన్ లేదా కాల్చి చంపే పద్ధతుల ద్వారా ఈ శిక్షను అమలు చేస్తారు. అదే సమయంలో కొన్ని కేసులలో మాత్రం దోషి రెండేళ్ల పాటు జైలులో సత్ప్రవర్తనతో ఉంటే మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చే ప్రత్యేక నిబంధన చైనా చట్టాలలో ఉంది.

పాకిస్థాన్‌లో మరణశిక్ష విధానం :

ఇక పొరుగున ఉన్న పాకిస్థాన్ లో ఆ దేశ పీనల్ కోడ్ ప్రకారం హత్యలు, ఉగ్రవాదం, దైవదూషణ, సామూహిక అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు మరణ శిక్ష విధిస్తారు. పాకిస్థాన్‌లో మరణశిక్షను కేవలం ఉరితీత ద్వారా మాత్రమే అమలు చేస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్ జైళ్లలో వేలాది మంది ఖైదీలు మరణ శిక్ష ఖరారై తుది తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని నేరాలకు మరణశిక్షను తగ్గించే అంశంపై ఆ దేశ పార్లమెంటులో చర్చలు కూడా జరుగుతూండడం విశేషం.