Begin typing your search above and press return to search.

విభేదాలకు చెక్: మోదీ-ట్రంప్ మధ్య కొత్త స్నేహ బంధం, వాణిజ్య వివాదానికి ముగింపు?

రష్యా నుంచి చమురు దిగుమతులు, రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లపై ట్రంప్ గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

By:  A.N.Kumar   |   10 Sept 2025 9:29 AM IST
విభేదాలకు చెక్: మోదీ-ట్రంప్ మధ్య కొత్త స్నేహ బంధం, వాణిజ్య వివాదానికి ముగింపు?
X

భారత్ - అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య సుంకాల వివాదం.. ఇరు దేశాల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఉన్న "క్లోజ్ ఫ్రెండ్ షిప్" ద్వారా పరిష్కార దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ట్రూత్ సోషల్ లో ట్రంప్ చేసిన పోస్ట్.. దానికి మోదీ ఇచ్చిన ప్రతిస్పందన ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, కొత్త సమీకరణాలకు నాంది పలికింది.

* అమెరికా వైఖరిలో మార్పు:

రష్యా నుంచి చమురు దిగుమతులు, రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లపై ట్రంప్ గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ప్రతిస్పందనగా భారత్ పై పలు ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు విధించారు. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. అయితే ఇటీవలి కాలంలో ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో భారత్ తో వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి చర్చలు కొనసాగుతున్నాయని, తన "స్నేహితుడు మోదీతో" మాట్లాడడానికి ఆసక్తిగా ఉన్నానని పేర్కొన్నారు. ఇది భారత్ తో సంబంధాలను పునరుద్ధరించడానికి, భవిష్యత్ లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి ట్రంప్ చూస్తున్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

*మోదీ సంయమనం - ప్రతిస్పందన:

ట్రంప్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కూడా అదే తీరులో స్పందించారు. "భారత్–అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్, వాణిజ్య అడ్డంకులు త్వరలో తొలగిపోతాయి, రెండు దేశాల ప్రజల భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తాం" అని ట్వీట్ చేశారు. ఈ స్పందన ద్వారా అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ, వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా అవసరం అనే నిజాన్ని మోదీ గుర్తించారని స్పష్టమవుతోంది. అందుకే ఆయన ఎప్పుడూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

* పరస్పర ఆధారిత సంబంధం

ఈ వాణిజ్య వివాదం ఎంత ముదిరినా.. ఇరు దేశాలను చర్చల బల్లపైకి తేవడానికి గల ప్రధాన కారణం వాటి మధ్య ఉన్న పరస్పర ఆధారిత సంబంధం. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే భారత్ సహకారం అమెరికాకు కీలకం. అదే సమయంలో భారత్ తన ఆర్థిక శక్తిని పెంచుకోవాలంటే అమెరికా మార్కెట్, సాంకేతికత అవసరం. ఈ కీలకమైన అంశాలు రెండు దేశాలను ఒకరికొకరు దూరం చేసుకోకుండా నివారిస్తున్నాయి.

* భవిష్యత్ లో లాభం ఎవరికి?:

ట్రంప్–మోదీ మధ్య తాజా మాటల మార్పిడి వాణిజ్య సుంకాల వివాదాన్ని పరిష్కరించడానికి మార్గం సుగమం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు నాయకులూ వ్యూహాత్మకంగా ఒకరినొకరు ఇరుకున పెట్టే ప్రయత్నం చేసినా.. చివరికి వారి రాజకీయ లాభాలు, దేశాల ప్రయోజనాలు వారిని మరింత దగ్గర చేస్తాయి. ఈ వివాదం ముగింపు రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశముంది. ఇది కేవలం వాణిజ్య సుంకాల వివాదం పరిష్కారానికి మాత్రమే కాకుండా, ఇరు దేశాల మధ్య బలమైన ఆర్థిక , వ్యూహాత్మక భాగస్వామ్యానికి కూడా దారి తీస్తుంది.