Begin typing your search above and press return to search.

భారత్ ను కోల్పోవడం అమెరికాకే నష్టం

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక, రాజకీయ రంగాల్లో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు, అమెరికా-భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

By:  A.N.Kumar   |   21 Aug 2025 12:27 PM IST
భారత్ ను కోల్పోవడం అమెరికాకే నష్టం
X

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక, రాజకీయ రంగాల్లో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు, అమెరికా-భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు పెంచుకోవడంపై భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు విధించడం, ఈ వ్యాపార వివాదానికి దారి తీసింది. ఈ పరిణామం కేవలం వ్యాపారపరమైనది మాత్రమే కాదు, ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఈ క్రమంలో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ కొత్త దేశాలతో ముఖ్యంగా చైనాతో, సంబంధాలను మెరుగుపరుచుకోవడం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది.

- అమెరికా ద్వంద్వ విధానంపై విమర్శలు

రష్యా నుంచి చైనా కూడా పెద్ద ఎత్తున ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నా, అమెరికా ఆ దేశంపై ఎటువంటి ఆంక్షలు విధించకపోవడం, కేవలం భారత్‌పై మాత్రమే ఒత్తిడి తేవడం ద్వంద్వ వైఖరిగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ వైఖరితో భారత్-చైనా మరింత దగ్గరైతే అది అమెరికా వ్యూహాత్మక ప్రణాళికలకు పెను ముప్పుగా మారుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చైనాను నియంత్రించాలని కోరుకునే అమెరికా తమకు ఒక కీలక భాగస్వామిగా ఉన్న భారత్‌ను ఇలా దూరం చేసుకోవడం వ్యూహాత్మక తప్పిదమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

-భారత్‌ను 'స్వేచ్ఛాయుత భాగస్వామిగా' చూడాలి

అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఈ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో వైరం అమెరికాకే నష్టమని, ఇది ఒక వ్యూహాత్మక పరాజయమని ఆమె అన్నారు. చైనాను నియంత్రించే లక్ష్యంలో భాగంగా అమెరికా భారతదేశాన్ని ఒక 'స్వేచ్ఛాయుత భాగస్వామిగా' గుర్తించాలని ఆమె సూచించారు. గతంలో భారత్‌ను "డెడ్ ఎకానమీ" గా పేర్కొనడం సరికాదని, వాస్తవానికి భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని ఆమె స్పష్టం చేశారు. విస్తరిస్తున్న మార్కెట్‌తో, వృద్ధి చెందుతున్న శక్తిగా భారత్ ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేస్తోందని ఆమె అన్నారు.

పెరుగుతున్న భారత ప్రాధాన్యం

ప్రస్తుత ప్రపంచంలో భారతదేశ ప్రాధాన్యం అనేక విధాలుగా పెరుగుతోంది. ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. వస్త్రాలు, మొబైల్ ఫోన్లు, సౌర ప్యానెల్లు వంటి ఉత్పత్తుల తయారీలో భారత్ చైనాకు ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. భూ-రాజకీయ వ్యూహాల్లో కీలకంగా ఉంది. అమెరికా మిత్రదేశాలతో భారతదేశం సైనిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిని, స్థిరత్వాన్ని కాపాడటంలో భారత్ పాత్ర కీలకమైనది. ప్రపంచ శక్తిగా ఎదిగుతోంది. మధ్యప్రాచ్యంలోనూ భారత్‌ ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా.. భారతదేశం భవిష్యత్తులో గ్లోబల్ వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించగలదు.

వ్యాపార మనస్పర్థలు ఉన్నప్పటికీ, భవిష్యత్తు ప్రపంచ శక్తి సమీకరణల్లో భారత్ ఒక ప్రధాన పాత్ర పోషించబోతోంది. భారతదేశాన్ని దూరం చేసుకోవడం అమెరికాకు ఒక వ్యూహాత్మక లోటుగా మారుతుంది. తమ ప్రయోజనాలను కాపాడుకోవాలంటే.. అమెరికా భారతదేశాన్ని కేవలం ఒక వ్యాపార భాగస్వామిగా కాకుండా.. ఒక నమ్మకమైన మిత్రుడిగా చూడాలి. లేకపోతే ఈ వైరం రెండు దేశాలకే కాకుండా.. మొత్తం ప్రపంచ శాంతి, ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపగలదు.