Begin typing your search above and press return to search.

థాంక్స్ అన్న మోడీ... సూపర్ అంటూ కేంద్ర మంత్రులు

అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం సూపర్ అని కేంద్ర కేబినెట్ మంత్రులు అంతా ఒకేసారి ట్వీట్లు చేసి మరీ ఆసక్తిని పెంచారు.

By:  Satya P   |   7 Feb 2026 11:33 PM IST
థాంక్స్ అన్న మోడీ... సూపర్ అంటూ కేంద్ర మంత్రులు
X

అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం సూపర్ అని కేంద్ర కేబినెట్ మంత్రులు అంతా ఒకేసారి ట్వీట్లు చేసి మరీ ఆసక్తిని పెంచారు. ఇంతకు మించి బెస్ట్ డీల్ వేరేది లేదని కూడా కితాబు ఇచ్చారు. ఈ ఒప్పందంతో భారత్ దశ దిశ మారిపోతుందని కూడా స్పష్టం చేశారు. భారత్ లోని అన్ని వర్గాలకు అమెరికాతో డీల్ ఒక దివ్య ఔషధం అని ఇక సమస్యలు అన్నీ పరిష్కారం అయినట్లే అని మంత్రులు అంతా ఒకే గొంతుకతో ప్రశంసించడం విశేషం.

గ్రేట్ అంటూ :

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఒకే రోజున పలువురు కేంద్ర మంత్రులు ప్రశంసించారు. పరస్పర ప్రయోజనకరమైన ఈ ఒప్పందం రెండు దేశాల వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింతగా వృద్ధి చేస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఆయన బాటలోనే మరో కేంద్ర మంత్రి నడిచారు. మేక్ ఇన్ ఇండియాను మరింత ప్రోత్సహించే విధంగా వాణిజ్య ఒప్పందం ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారతదేశ ఆర్థిక ప్రయాణంలో వ్యూహాత్మక మైలురాయిగా ఒప్పందాన్ని ఆయన అభివర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా రైతాంగం తో పాటు వ్యవసాయ రంగానికి మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.

కొత్త దారులు అంటూ :

ఇక దేశంలోని అంకుర పరిశ్రమలు సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలకు మత్స్య రంగానికి కొత్త మార్గాలను ఈ వాణిజ్య ఒప్పందం సృష్టిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వికసిత భారత్ లక్ష్యానికి మరింత బలాన్ని వాణిజ్య ఒప్పందం ఇస్తుందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు వాణిజ్య ఒప్పందం దేశీయ రైతుల ఆదాయం ఆహార భద్రత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. వీరే కాకుండా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా ట్వీట్ వేసి భారత్ కి ఇక అన్నీ మంచి రోజులే అంటూ పొగిడారు. దేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపాధి కల్పనకు ఒప్పందం బాటలు వేస్తుందని చెప్పుకొచ్చారు.

థాంక్స్ ట్రంప్ అంటూ :

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అమెరికా అధ్యక్షుడికి థాంక్స్ అంటూ ట్వీట్ చేయడం విశేషం. భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం రెండు దేశాలకు శుభవార్త అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈ ఒప్పందం భారత్‌-అమెరికా మధ్య బలమైన భాగస్వామ్యం పెరుగుతున్న విశ్వాసాన్ని తెలియచేస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పెట్టిన పోస్టులో ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి వ్యక్తిగతంగా కృషిచేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు అని మోడీ చెప్పారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం భారతీయ రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. దీని వల్ల మేకిన్‌ ఇండియా సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని మోడీ వివరించడం విశేషం.

విపక్షాలే కాదు :

ఇక అమెరికాతో డీల్ మీద విపక్షాలు అయితే మండిపడుతున్నాయి. వారి సంగతి పక్కన పెడితే ఆర్ఎస్ఎస్ కి అనుబంధ విభాగం అయిన భారతీయ కృషి సంఘ్ కూడా విమర్శిస్తోంది. భారతదేశంలోకి జన్యు మార్పిడి పంటలను అమెరికా ఈ డీల్ ద్వారా దొడ్డి దారిన ప్రవేశ పెట్టే ప్రయత్నంగా ఈ ఒప్పందాన్ని ఆరోపిస్తోంది. దీంతో దేశీయ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా దేశీయ సోయాబీన్ రైతులు నష్టపోతారు అని కూడా పేర్కొంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చినా బీకేఎస్ మరింత స్పష్టత కోరుతోంది. మొత్తానికి చూస్తే అమెరికాతో డీల్ మీద అయితే ఎవరి అనుమానాలు వారికి ఉంటే కేంద్ర పెద్దలు మాత్రం భేష్ అంటున్నారు. చూడాలి మరి ఈ ఒప్పందం దేశానికి చేసే మేలు ఎంత ఏమిటి అన్నది.