భారత్-అమెరికా డీల్ లో కీలక ముందడుగు.. టారిఫ్ లు 15 శాతానికి..
భారత్-అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందం ఇప్పుడు తుది దశకు చేరిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
By: A.N.Kumar | 22 Oct 2025 8:07 PM ISTభారత్-అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందం ఇప్పుడు తుది దశకు చేరిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే.. ప్రస్తుతం అమెరికా భారత ఉత్పత్తులపై విధిస్తున్న 50 శాతం టారిఫ్‌లు 15-16 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
ఇంధనం, వ్యవసాయం రంగాలపై ప్రధానంగా ఈ డీల్ దృష్టి కేంద్రీకరించబడి ఉంది. ముఖ్యంగా ఈ ఒప్పందం అమలులోకి వస్తే భారత్ క్రమంగా రష్యా చమురుపై ఆధారాన్ని తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇరు ప్రభుత్వాలు – భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ గానీ, వైట్‌హౌస్ గానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
* మోదీ–ట్రంప్ చర్చల్లో కీలక అంశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన ప్రకారం.. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. ఆ సంభాషణలో వాణిజ్యం, ఇంధనం, చమురు దిగుమతుల అంశాలపై చర్చించారని చెప్పారు. మోదీ కూడా ఎక్స్ (X)లో స్పందిస్తూ ట్రంప్‌కు దీపావళి శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలుపుతూ రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాన్ని మరోసారి నొక్కిచెప్పారు.
* వాణిజ్య సలహాదారు విశ్లేషణ
కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ
“ట్రేడ్ డీల్ విషయంలో నా వద్ద ప్రత్యక్ష సమాచారం లేకపోయినా, రాబోయే రెండు నెలల్లో లేదా అంతకంటే ముందే ఇరుదేశాలు ఒప్పందంపై ఏకాభిప్రాయానికి రావచ్చు. మొదట అదనంగా విధించిన 25 శాతం టారిఫ్‌లు తొలగించే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రతీకార సుంకాలు కూడా 25 శాతం నుంచి 10-15 శాతానికి తగ్గవచ్చు,” అని అన్నారు.
* రష్యా చమురు దిగుమతులపై ప్రభావం
ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం భారత్ సహా పలు దేశాలపై 25 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తోందని కారణంగా మరో 25 శాతం అదనపు టారిఫ్‌లు విధించడంతో మొత్తం సుంకం 50 శాతానికి చేరింది.
ఇప్పుడు ఈ సుంకాలను తగ్గించే దిశగా ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు క్రమంగా తగ్గించే అంగీకారం భారత పక్షం నుంచి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 34%, అమెరికా వాటా 10%గా ఉంది. ఈ డీల్ తరువాత అమెరికా వాటా మరింత పెరగవచ్చని అంచనా.
* వ్యవసాయ రంగం ప్రధానాంశం
అమెరికా తమ వ్యవసాయ ఉత్పత్తులు.. ముఖ్యంగా మొక్కజొన్న , సోయామీల్ కు భారత మార్కెట్లో ప్రవేశం కల్పించాలని కోరుతోంది.
భారత్ కూడా ఈ సూత్రానికి సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మొక్కజొన్నపై 15% దిగుమతి సుంకం కొనసాగనుందని సమాచారం.
*తుది ప్రకటన ఎప్పుడు?
సూచనల ప్రకారం, ఈ వాణిజ్య ఒప్పందంపై అధికారిక ప్రకటన ఈ నెలాఖరులో జరగనున్న ఆసియాన్ సదస్సు లో వెలువడే అవకాశం ఉంది.
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరితే ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశిస్తాయి. టారిఫ్‌ల తగ్గింపు వల్ల భారత ఎగుమతిదారులకు ఉపశమనం లభిస్తుండగా, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్ తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది.
ఇంధనం, వ్యవసాయం రంగాల్లో పరస్పర లాభాలు సాధించే దిశగా ఈ ఒప్పందం ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశముంది.
