Begin typing your search above and press return to search.

భారత్‌ను అమెరికా నిజంగానే టార్గెట్ చేసిందా? తెరవెనుక నడుస్తున్న వ్యూహాత్మక రాజకీయాల వెనుక అసలు నిజాలేంటి?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్, అగ్రరాజ్యం అమెరికా మధ్య సంబంధాలు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారాయి.

By:  A.N.Kumar   |   9 Oct 2026 11:02 AM IST
భారత్‌ను అమెరికా నిజంగానే టార్గెట్ చేసిందా? తెరవెనుక నడుస్తున్న వ్యూహాత్మక రాజకీయాల వెనుక అసలు నిజాలేంటి?
X

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్, అగ్రరాజ్యం అమెరికా మధ్య సంబంధాలు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారాయి. ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస పరిణామాలు భారతీయుల్లో తీవ్ర ఆందోళనను, అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఓటర్ల జాబితా వివాదం నుండి స్టార్‌లింక్ ప్రవేశం, హెచ్-1బీ వీసాల రగడ వరకు.. ప్రతి ఒక్క అంశం భారత్‌ను లక్ష్యంగా చేసుకుని జరుగుతోందా? అనే ప్రశ్నలు దేశవ్యాప్తంగా విరుచుకు పడుతున్నాయి. ఇవన్నీ కేవలం విధానపరమైన నిర్ణయాలా? లేక భారత్ పెరుగుతున్న ప్రపంచ ఆధిపత్యాన్ని తొక్కేయడానికి జరుగుతున్న వ్యూహాత్మక కుట్రలా?

ప్రజాస్వామ్యంపై దెబ్బ.. ఓటర్ల తొలగింపు ప్రచారం

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముక వంటి ఎన్నికల ప్రక్రియపై అంతర్జాతీయ మీడియాలో నెగెటివ్ కథనాలు రావడం సామాన్య పౌరుడిని సైతం తీవ్రంగా కలచివేస్తోంది. సుమారు 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారంటూ జరుగుతున్న ప్రచారం వెనుక విదేశీ శక్తుల జోక్యం ఉందా అన్న కోణం కలవరపెడుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఎంత స్పష్టత ఇచ్చినా అంతర్జాతీయ వేదికలపై భారత ప్రజాస్వామ్య పారదర్శకతను ప్రశ్నించేలా కథనాలు వండటం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనేది ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే..

కార్పొరేట్ ఒత్తిళ్లు.. స్టార్‌లింక్ వివాదం

మరోవైపు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన 'స్టార్‌లింక్' డిజిటల్ సామ్రాజ్యాన్ని భారత్‌లో విస్తరించే క్రమంలో భారతీయ వ్యాపారవేత్తలపై చేస్తున్న ఆరోపణలు కాకరేపుతున్నాయి. భారత భద్రత, నియంత్రణ నిబంధనలు, డేటా ప్రైవసీ వంటి కీలక అంశాలను పక్కనపెట్టి తమ వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలనడం అగ్రరాజ్య కార్పొరేట్ అహంకారానికి నిదర్శనమా? దేశీయ వ్యాపార వ్యవస్థలను గుత్తాధిపత్యంగా చిత్రీకరిస్తూ ఒత్తిడి పెంచే ప్రయత్నాలు ఎంతవరకు సమంజసం? అని మస్క్ ను భారతీయ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

భారత ఐటీ రంగానికి వెన్నుపోటు?

అన్నింటికంటే దారుణమైన విషయం మన హెచ్-1బీ వీసా నిపుణుల పరిస్థితి. దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థను, సాంకేతిక విప్లవాన్ని తమ చెమటతో నిర్మించిన భారతీయ ఐటీ నిపుణులను ఇప్పుడు ఉపాధి పరంగా ఇబ్బందులకు గురిచేయడం అత్యంత బాధాకరం. పీఈఆర్ఎం కార్మిక ధ్రువీకరణల్లో జాప్యాలు, వీసా నిబంధనల కఠినతరం వెనుక భారతీయ కంపెనీల ప్రాభవాన్ని తగ్గించే కుట్ర ఉందన్న వార్తలు మన నిరుద్యోగ యువత కలలను కల్లలు చేస్తున్నాయి.

భారత్ ముందడుగు.. దౌత్యపరమైన సవాలు

ఈ మూడు పరిణామాలు వేర్వేరు రంగాలకు చెందినవే అయినప్పటికీ ఇవన్నీ ఒకే సమయంలో తెరపైకి రావడం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. దీనిని ఒకే ఉమ్మడి దాడిగా భావించలేకపోయినా భారత్ ఎదుగుదలను జీర్ణించుకోలేని శక్తులు పెంచుతున్న రాజకీయ, వాణిజ్య ఒత్తిడిగా పరిగణించక తప్పదు.

ఈ సంక్షోభ సమయంలో భారత్ తన జాతీయ భద్రత, ప్రజాస్వామ్య సార్వభౌమత్వం, కోట్లాది మంది పౌరుల ప్రయోజనాల విషయంలో ఇసుమంతైనా రాజీపడకూడదు. అమెరికాతో సంబంధాలను కాపాడుకుంటూనే మన స్వయం సమృద్ధిని, సార్వభౌమత్వాన్ని చాటిచెప్పేలా బలమైన దౌత్య సమాధానం ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది.