Begin typing your search above and press return to search.

అమెరికా వడ్డింపులు నేపథ్యంలో పీఎంఓ కీలక భేటీ !

అమెరికా భారత్ మీద పగ పట్టినట్లుగా వరసబెట్టి టారిఫ్ లను వడ్డిస్తోంది. మొదట పాతిక శాతం అంది.

By:  Satya P   |   26 Aug 2025 9:05 AM IST
అమెరికా వడ్డింపులు నేపథ్యంలో పీఎంఓ  కీలక భేటీ !
X

అమెరికా భారత్ మీద పగ పట్టినట్లుగా వరసబెట్టి టారిఫ్ లను వడ్డిస్తోంది. మొదట పాతిక శాతం అంది. ఆ తరువాత అది చాలదని మరో పాతిక వడ్డించింది. ఇందంతా న్యాయబద్ధమని సమంజసమని అమెరికా బిగ్గరగా చెప్పుకుంటోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే భారత్ తప్పిదం అన్నట్లుగా అమెరికా తన చర్యలను సమర్థించుకుంటోంది. అయితే చైనా భారత్ కంటే ఎక్కువగా రష్యా నుంచి కొనుగోలు చేస్తూన్నా కిక్కురు మనడంలేదు. ఈ ద్వంద్వ వైఖరి భారత్ ని మరింత ఇబ్బంది పెడుతోంది.

ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు :

తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్ర మోడీ భారత్ ఏరి ఒత్తిడికి తలొగ్గే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దేశంలోని రైతులు చిన్న వ్యాపారులు పాడి రైతులు భారత్ కి అత్యంత ముఖ్యులు అని ఆయన అన్నారు వారి ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కాపాడుకుంటుందని హామీ ఇచ్చారు. ఆర్ధిక స్వార్ధంతో ప్రపంచం ఉందని కూడా మోడీ పరోక్షంగా విమర్శలు చేశారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాధించడానికి మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మోడీ దేశ ప్రజలను కోరారు.

ఒక్క రోజు ముందు వ్యూహం :

ఈ నెల 27 నుంచి అమెరికా భారత్ మీద విధించిన భారీ వడ్డింపులు మోతకు ప్రారంభం జరుగుతుంది. ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం మంగళవారం కీలకమైన ఒక సమావేశం నిర్వహిస్తోంది. ఈ స్మావేశానికి మోడీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఉన్నత అధికారి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో అమెరికా విధించే అధిక సుంకాల మీదనే ప్రధానంగా చర్చిస్తారు అని అంటున్నారు.

ఆయా రంగాల మీద తీవ్ర ప్రభావం :

ఇక అమెరికా విధిస్తున్న అధిక సుంకాలతో భారత్ లోని వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్ వస్తువులు, పలు రకాలైన ప్రత్యేక రసాయనాలు, ఇతర ముఖ్యమైన రంగాలకు ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. ఇక అమెరికా భారత్ మీద మొదటిసారి విధించిన 25 శాతం సుంకాలు ఈ నెల 7 నుంచి అమలులోకి వచ్చాయి. ఇపుడు ఇరవై రోజుల వ్యవధిలో మరో పాతిక శాతం సుంకాలు విధింపు అమలు కానుంది. దీంతో ఏకంగా 50 శాతం సుంకాలు అమెరికా భారత్ మీద విధించినట్లు అవుతుంది.

ఇతర మార్గాల అన్వేషణ :

నిన్నటిదాకా అమెరికా వైపు చూసిన భారత్ ఇపుడు ఇతర దేశాల వైపు చూస్తోంది. ఆసియా ఖండంలోని ఇతర దేశాలలో తన వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడానికి ఇది సరైన తరుణం అని కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో పీఎం లో కీలక భేటీలో ఏ రకమైన నిర్ణయాలు ఉంటాయో చూడాల్సి ఉంది. మొత్తం మీద అమెరికా భారత్ మీద భారీ టారిఫ్ లను వడ్డించడంతో మోడీ ప్రభుత్వం ఏమి చేయబోతోంది అన్న చర్చ అంతటా సాగుతోంది.