Begin typing your search above and press return to search.

నవంబర్ 30 తర్వాత అమెరికా టారిఫ్ లు ఉండవా?

ట్రంప్ ప్రభుత్వం రష్యా చమురు కొనుగోలు కారణంగానే భారత్‌పై సుంకాలు విధించామని చెబుతున్నప్పటికీ, అసలైన కారణం తమ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి భారత్ అడ్డంకులు పెట్టడమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

By:  A.N.Kumar   |   19 Sept 2025 12:23 AM IST
నవంబర్ 30 తర్వాత అమెరికా టారిఫ్ లు ఉండవా?
X

అమెరికా విధించిన భారీ సుంకాలపై భారత్‌కు శుభవార్త రానుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రష్యా నుంచి చౌకగా ముడిచమురు దిగుమతి చేస్తున్నందుకు ప్రతీకార చర్యగా అమెరికా 50 శాతం వరకు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అయితే నవంబర్ 30 తర్వాత ఆ అదనపు సుంకాలను తగ్గించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వెంకట్రామన్‌ అనంత నాగేశ్వరన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కోల్‌కతాలో జరిగిన మర్చంట్స్‌ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ‘‘ప్రారంభంలో విధించిన 25 శాతం ప్రతీకార సుంకాలతో పాటు మరో 25 శాతం అదనపు సుంకాలు అనూహ్యమే. భౌగోళిక పరిస్థితుల వల్లే ఆ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తోంది. అయితే తాజా పరిణామాలను గమనిస్తే నవంబర్ 30 తర్వాత ఆ భారాలు తగ్గే అవకాశముంది’’ అని అన్నారు.

నాగేశ్వరన్ మరింతగా వివరించారు. ‘‘నేను చెబుతున్నది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. రాబోయే రెండు నెలల్లో సుంకాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. అలాగే భారత్‌–అమెరికా మధ్య వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభమవడం సానుకూల పరిణామమని తెలిపారు.

ప్రస్తుతం భారత ఎగుమతుల విలువ 850 బిలియన్ డాలర్లుగా ఉందని, త్వరలోనే ఇది 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుంటుందని నాగేశ్వరన్ విశ్వాసం వ్యక్తం చేశారు. జీడీపీలో 25 శాతం ఎగుమతుల వాటా ఉండటం ఆరోగ్యకరమైన ఆర్థిక పరిస్థితులకు సంకేతమని చెప్పారు.

అమెరికా అసలు ఉద్దేశం..?

ట్రంప్ ప్రభుత్వం రష్యా చమురు కొనుగోలు కారణంగానే భారత్‌పై సుంకాలు విధించామని చెబుతున్నప్పటికీ, అసలైన కారణం తమ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి భారత్ అడ్డంకులు పెట్టడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఒత్తిడి కారణంగానే భారత ప్రభుత్వం ఇటీవల విదేశీ (అమెరికన్) పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాన్ని తొలగించిన విషయం తెలిసిందే.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశంపై స్పష్టమైన వైఖరి ప్రకటించారు. రైతులు, పశుపోషకులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజనాలను కాపాడడంలో రాజీపడబోమని, అమెరికా ఒత్తిడి ఎంత పెరిగినా భారత్ వెనక్కి తగ్గదని ఆయన అన్నారు.

వాణిజ్య చర్చలలో కొత్త దశ

భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు మంగళవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ఇరుపక్షాలు పరస్పర ప్రయోజనకరంగా చర్చలను ముందుకు తీసుకెళ్లాలని అంగీకరించాయి. రాబోయే అక్టోబర్–నవంబర్ నాటికి తొలి దశ ఒప్పందాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వాణిజ్య శాఖ వెల్లడించింది.

మొత్తంగా చూస్తే.. నవంబర్ 30 తర్వాత అమెరికా సుంకాల విషయంలో భారత్‌కు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది రెండు దేశాల వాణిజ్య సంబంధాలకు కొత్త దిశనిచ్చే పరిణామంగా భావించవచ్చు.