Begin typing your search above and press return to search.

అమెరికా 'మొక్కజొన్న'పై ఒత్తిడి.. భారత్‌ తలవంచాలా?

భారతదేశం ప్రపంచ టాప్‌-10లో మొక్కజొన్న ఉత్పత్తిలో ఉన్నా, తన అవసరాలను బేరీజు వేసుకుంటూ మయన్మార్‌, ఉక్రెయిన్‌ వంటి దేశాల నుంచి మాత్రమే కొద్దిపాటి దిగుమతులు చేస్తుంది.

By:  A.N.Kumar   |   16 Sept 2025 7:31 PM IST
అమెరికా మొక్కజొన్నపై ఒత్తిడి.. భారత్‌ తలవంచాలా?
X

భారత్‌–అమెరికా వాణిజ్య చర్చలకు ముందు మళ్లీ ఒక పాత అంశం పెద్దది అయింది. అది మొక్కజొన్న. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు “140 కోట్ల జనాభా ఉన్న భారత్‌ ఒక్క బుట్టెడు అమెరికా మొక్కజొన్న కూడా కొనదు” అన్న ఆవేదన, కేవలం వాణిజ్య సమస్య కాదని, అమెరికా అంతర్గత సంక్షోభాన్ని ప్రతిబింబిస్తుందని అనుకోవాలి.

*అమెరికా అసహనం వెనుక నిజం

ప్రపంచంలోనే మొక్కజొన్న అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న అమెరికా, దానిపైనే భారీ ఎగుమతులకు ఆధారపడుతోంది. కానీ చైనా వంటి దేశాలు కొనుగోళ్లు తగ్గించుకోవడం వల్ల వాషింగ్టన్‌కు పెద్ద షాక్‌ తగిలింది. ట్రంప్‌ వాణిజ్య యుద్ధపు నిర్ణయాలు అమెరికా వ్యవసాయరంగంపై దెబ్బ కొట్టాయి. ఇప్పుడు అదనపు ఉత్పత్తిని ఎక్కడ అమ్మాలని ఆరాటపడుతున్న అమెరికా దృష్టి నేరుగా భారత్‌పైనే పడింది.

*భారత్‌ పరిస్థితి ఎందుకు భిన్నం?

భారతదేశం ప్రపంచ టాప్‌-10లో మొక్కజొన్న ఉత్పత్తిలో ఉన్నా, తన అవసరాలను బేరీజు వేసుకుంటూ మయన్మార్‌, ఉక్రెయిన్‌ వంటి దేశాల నుంచి మాత్రమే కొద్దిపాటి దిగుమతులు చేస్తుంది. అమెరికా వాటా మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే రెండు పెద్ద అడ్డంకులు ఉన్నాయి.

భారత్‌లో ఇప్పటికే స్థానిక రైతులు ఉన్నారు. వారిని పోటీ నుండి కాపాడుకోవడం ప్రభుత్వ కర్తవ్యం. అమెరికా మొక్కజొన్నలో 94% జన్యుమార్పిడి పంట. భారత పాలసీలు ఇప్పటివరకు ఆహార వినియోగానికి అలాంటి దిగుమతులను అంగీకరించలేదు.

*ధరల సవాలు

భారత రైతులు కిలోకు రూ.22-23 ఖర్చు పెట్టి మొక్కజొన్న పండిస్తున్నప్పుడు, అమెరికా నుంచి డంపింగ్ ధరలు వస్తుంటే స్థానిక వ్యవసాయం కూలిపోయే ప్రమాదం ఉంది. ఇది కేవలం వాణిజ్యం కాదు, కోట్లాది రైతుల జీవనాధారానికి సంబంధించిన అంశం. దేశంలోని సున్నిత పరిస్థితుల్లో ఈ అలాంటి నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ ఆత్మహత్య వంటిదే.

*భవిష్యత్తుపై లెక్కలు

భారత్‌లో మొక్కజొన్న వినియోగం 2050 నాటికి రెండింతలకిపైగా పెరగబోతుందనే అంచనాలు ఉన్నా, దాని పరిష్కారం అమెరికా ఆయుధం పట్టుకోవడం కాదు. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడం, వ్యవసాయ సాంకేతికతకు పెట్టుబడులు పెట్టడం దీర్ఘకాలిక వ్యూహం. ఒకవేళ దిగుమతులు తప్పవు అనుకున్నా, అవి ఆహార అవసరానికి కాకుండా, ఇథనాల్‌ ఉత్పత్తికి మాత్రమే పరిమితం కావాలని ఇప్పటికే నీతిఆయోగ్ సూచించింది.

అమెరికా ఒత్తిడికి భారత్‌ తలవంచడం కష్టం. ఒకవైపు రైతుల ప్రయోజనాలు, మరోవైపు ఆహార భద్రత అనే జాతీయ ప్రయోజనం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య మంత్రి వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితుల కంటే ఎక్కువగా నిరాశ.. అసంతృప్తిని ప్రతిఫలిస్తున్నవి. భారత్ తన స్వార్థప్రధాన నిర్ణయాలతో ముందుకు సాగడమే వివాద ముగింపుగా నిలుస్తుంది.