ట్రంప్ మావా.. 100% టారిఫా? తగ్గిపోతాం అనుకున్నావా.. తగ్గేదేలే అన్న భారత్
రష్యా నుంచి భారత్ చమురు కొనడం వల్ల అమెరికా పెద్దలకు నిద్ర పట్టడం లేదు. దాంతో "ఆయిల్ కొంటే పన్నుల మోత తప్పదు" అని భయపెట్టాలని చూశారు.
By: A.N.Kumar | 17 Sept 2026 12:10 PM IST"మేం చెప్పినట్లు వినకపోతే మీ వస్తువులపై 100 శాతం పన్నుల బాదుడు బాదుతాం" అంటూ అమెరికా చట్టసభలు ఒక బిల్లును ముందుకు తెచ్చి.. అధ్యక్షుడి సంతకం కోసం రెడీ చేశాయి. ముఖ్యంగా రష్యా దగ్గర చవకగా ముడి చమురు కొంటున్నారనే కోపంతో భారత్ వంటి దేశాలకు గట్టి 'షాక్' ఇవ్వాలని ప్లాన్ చేశాయి. అయితే ఈ బెదిరింపులకు బెదిరిపోయి, చేతులు కట్టేసుకుని కూర్చోవడానికి ఇదేమీ పాత కాలపు భారత్ కాదని మన వాళ్ళు చాలా సాఫ్ట్‌గా.. కానీ స్ట్రాంగ్‌గా క్లారిటీ ఇచ్చేశారు.
"బాబు ట్రంప్.. మీ రాజకీయాలు మీ వద్దే ఉంచుకోండి. మాకు మా 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతే ముఖ్యం" అంటూ కేంద్ర విదేశాంగ శాఖ దౌత్యపరమైన భాషలోనే ఒక గట్టి కౌంటర్ ఇచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే "మీరు పన్నులు 100 శాతం పెంచినా 200 శాతం పెంచినా.. మా జేబులకు.. మా దేశ అవసరాలకు ఏది లాభమో అదే చేస్తాం" అని ముఖం మీదే చెప్పకనే చెప్పేసింది.
అసలు కథేంటంటే..
రష్యా నుంచి భారత్ చమురు కొనడం వల్ల అమెరికా పెద్దలకు నిద్ర పట్టడం లేదు. దాంతో "ఆయిల్ కొంటే పన్నుల మోత తప్పదు" అని భయపెట్టాలని చూశారు. కానీ మన దేశం మాత్రం "అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కడ చవకగా, అనువుగా దొరికితే అక్కడే కొంటాం. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసి సామాన్యుడిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు" అని తేల్చిచెప్పింది. పైగా అమెరికా వేసే ఈ ఆంక్షల వల్ల కేవలం భారత్‌కే కాదు.. మొత్తం ప్రపంచ ఇంధన మార్కెట్‌కే 'మైండ్ బ్లాక్' అయ్యే ప్రమాదం ఉందని పరోక్షంగా హెచ్చరించింది. సరఫరా వ్యవస్థ దెబ్బతింటే అమెరికాలోనూ లీటర్ ఆయిల్ ధర ఆకాశాన్ని తాకుతుందని గుర్తు చేసింది.
పోతే పోయాయి టారిఫ్‌లు.. తగ్గేదేలే
ఒకవేళ ఈ బిల్లుపై సంతకం జరిగి.. భారతీయ ఉత్పత్తులపై 100 శాతం టారిఫ్‌లు పడితే ఎగుమతిదారులకు కాస్త తిప్పలు తప్పవు. కానీ దానికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునే వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయని భారత్ ధీమా వ్యక్తం చేసింది.
మొత్తానికి "మా దారి మాదే.. మా నిర్ణయాలు మా ప్రజల కోసమే" అని భారత్ స్పష్టం చేయడంతో ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉంది. చూడాలి మరి.. ట్రంప్ సార్ సంతకం పెట్టి గెలుస్తారో.. లేక అంతర్జాతీయ మార్కెట్ దెబ్బకు తల పట్టుకుంటారో.. చూడాలి మరీ..
