Begin typing your search above and press return to search.

ఐక్య రాజ్య సమితి సెటప్ మార్చాల్సిందే...భారత్ కి చోటు దక్కాల్సిందే !

ఈ రోజున ప్రపంచం పూర్తిగా అస్థిరతతో ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే గందరగోళంలో ఉంది. యుద్ధాలు ఒక వైపు సాగుతున్నాయి.

By:  Satya P   |   26 Jan 2026 11:00 AM IST
ఐక్య రాజ్య సమితి సెటప్ మార్చాల్సిందే...భారత్ కి చోటు దక్కాల్సిందే !
X

ఈ రోజున ప్రపంచం పూర్తిగా అస్థిరతతో ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే గందరగోళంలో ఉంది. యుద్ధాలు ఒక వైపు సాగుతున్నాయి. మరో వైపు చూస్తే బలవంతుడిదే నీతి అన్న విధానం కొనసాగుతోంది. ఫలితంగా ప్రపంచంలో అశాంతి పెరుగుతోంది. ఎపుడు ఎక్కడ ఏమి జరుగుతుందో అన్నది తెలియడం లేదు, అభద్రతా భావంతో అంతా కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపధ్యంలో ఐక్య రాజ్య సమితిని భద్రతా మండలిని మార్చాలని పూర్తి స్వరూప స్వభావాలను కూడా మార్చాలని డిమాండ్ పెద్ద ఎత్తున పెరుతోంది.

భారత్ కోరింది ఇదే :

ఐక్య రాజ్య సమితి 1945లో ఏర్పాటు అయింది. మరి ఆనాటికి ఈనాటికీ పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి. ఈ రోజున ప్రపంచం వేరుగా ఉంది. ఇంకా పాత నియమాలను పెట్టుకుని నడుపుదామని అనుకుంటే కుదిరే అవకాశాలు లేవు, దానికి ఉదాహరణగా ప్రపంచంలో అనేక యుద్ధాలే ఉన్నాయని అంటున్నారు. దాంతో ఐక్య రాజ్య సమితిని భద్రతా మండలిని సమూలంగా మార్చాలని డిమాండ్ అయితే వస్తోంది. ఇదే రూపంలో కొనసాగించాలని చూస్తే మాత్రం ఇంకా ప్రపంచంలో అశాంతి ఎక్కువ అవుతుందని అలగే యుద్ధాలు సమస్యలు కూడా ఎక్కువ అవుతాయని భారత్ ఇటీవల జరిగిన ఐక్యరాజ్య సమితిలో హెచ్చరించింది. ఐక్య రాజ్య సమితిలో భారత్ రాయబారిగా ఉన్న పి హరీష్ మాట్లాడుతూ భద్రతా మండలిలో మార్పులు చేయాల్సిందే అని స్పష్టం చేశారు.

జీ4 డిమాండ్ ఇదే :

ఇక కేవలం భారత్ మాత్రమే కాదు జీ4 దేశాల డిమాండ్ ఇలాగే ఉంది. భారత్ బ్రెజిల్, జర్మనీ, జపాన్ ఇలా ఉన్న ఈ నాలుగు దేశాలను జీ4 గా పిలుస్తారు. ఈ దేశాలు అన్నీ ఒక్కటే కోరుతున్నాయి. ఐక్య రాజ్య సమితి నిబంధలను మార్చాలని కోరాయి. అలాగే ప్రస్తుతం ఉన్న భద్రతా మండలిలో సభ్య దేశాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం పదిహేను సభ్య దేశాలు ఉన్నాయి. అందులో అయిదు మాత్రమే శాశ్వత సభ్య దేశాలు. అయితే ఈ సభ్య దేశాలను పాతిక దాకా పెంచాలని జీ4 దేశాలు కోరుతున్నాయి. అంతే కాదు శాశ్వత సభ్య దేశాల సంఖ్యను అయిదు నుంచి మరో ఆరు అదనంగా కలిపి 11 దాకా చేయాలని కోరుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం పరిస్థితులు మారాయని అందువల్ల దానికి తగినట్లుగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా వంటి దేశాలను కూడా తగిన ప్రాతినిధ్యం ఉండాలని జీ4 దేశాలు కోరాయి.

కళ్ళెదుట యుద్ధాలు :

ఈ రోజున చూస్తే ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం దాదాపుగా అయిదేళ్ళుగా సాగుతోంది. అలాగే గాజా వంటి చోట్ల యుద్ధాలు అలాగే కొనసాగుతున్నాయి, ఈ సమస్యలను పరిష్కరించడంతో ప్రస్తుతం ఐక్య రాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలు సరిపోవడం లేదని అంటున్నారు. సాధరణ ప్రజలు అంతా ఈ యుద్ధాల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అంతే కాదు పేద దేశాలు ధనిక దేశాల మధ్య అంతరం పెరుగుతోంది, చిన్న దేశాలకు భద్రత ఉండడం లేదు, ఇవన్నీ ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి పరిశీలించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.