బ్రిక్స్ మద్దతు ఇచ్చినా.. యూఎన్ సైబర్ క్రైమ్ ఒప్పందంపై భారత్ ఎందుకు సంతకం చేయలేదు?
ఈ ఒప్పందం ఎలక్ట్రానిక్ ఆధారాల సేకరణ, నేరస్థుల అప్పగింత, పరస్పర న్యాయ సహాయంలో దేశాల మధ్య వేగవంతమైన సహకారానికి ఒక అంతర్జాతీయ వేదికను కల్పిస్తుంది.
By: A.N.Kumar | 16 Sept 2026 7:00 AM ISTప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ విజృంభిస్తున్న సైబర్ నేరాలను అరికట్టడానికి అంతర్జాతీయ సహకారం అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మారింది. ఒక దేశంలో కూర్చుని మరో దేశంలోని వ్యక్తిని మోసం చేయడం.. విదేశీ సర్వర్లను వాడటం.. నిధులను ఇతర దేశాలకు బదిలీ చేయడం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి 2024 డిసెంబర్‌లో ‘యూఎన్ సైబర్ క్రైమ్ కన్వెన్షన్’ను ఆమోదించింది. ఈ ఒప్పందం ఎలక్ట్రానిక్ ఆధారాల సేకరణ, నేరస్థుల అప్పగింత, పరస్పర న్యాయ సహాయంలో దేశాల మధ్య వేగవంతమైన సహకారానికి ఒక అంతర్జాతీయ వేదికను కల్పిస్తుంది.
2026 సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో సభ్యదేశాలన్నీ ఈ ఒప్పందానికి మద్దతు తెలపడమే కాకుండా ఇతర దేశాలు కూడా దీన్ని ఆమోదించాలని పిలుపునిచ్చాయి. దేశంలో సైబర్ మోసాలు భారీగా పెరుగుతున్న వేళ, బ్రిక్స్ వేదికపై ఉమ్మడి పిలుపునిచ్చిన భారత్.. ఈ ఒప్పందంపై ఇంకా సంతకం చేయకపోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
భారత్ ఎందుకు వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది?
భారత్ ఈ ఒప్పందాన్ని అధికారికంగా తిరస్కరించలేదు. అయితే కొన్ని సాంకేతిక, న్యాయపరమైన సవాళ్ల కారణంగానే ఆచితూచి వ్యవహరిస్తోంది. విదేశీ దర్యాప్తు సంస్థలకు భారతీయ డేటాను యాక్సెస్ చేసే వెసులుబాటు కల్పించడం, దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉంది. పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను కాపాడటం, విదేశీ అభ్యర్థనలను ఏ పరిస్థితుల్లో అంగీకరించాలనే దానిపై స్పష్టమైన న్యాయ నియంత్రణ అవసరం. గతంలో కూడా సరిహద్దు దాటి కంప్యూటర్ డేటాను పొందే నిబంధనల పట్ల ఉన్న అభ్యంతరాల వల్లే భారత్ 'బుడాపెస్ట్ కన్వెన్షన్'కు దూరంగా ఉంది.
ప్రస్తుత ప్రత్యామ్నాయాలు.. భవిష్యత్తు అవకాశం
ఈ ఒప్పందంలో చేరకపోయినా భారత్ ఇంటర్‌పోల్, ద్వైపాక్షిక ఒప్పందాలు , పోలీస్-టు-పోలీస్ సహకారం ద్వారా అంతర్జాతీయ దర్యాప్తును కొనసాగిస్తోంది. అయితే ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్‌లో భాగస్వామి అయితే డిజిటల్ ఆధారాలను మరింత వేగంగా పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి 40 దేశాల ఆమోదం అవసరం కాగా 2026 డిసెంబర్ 31 వరకు సంతకం చేసేందుకు గడువు ఉంది. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారం ఎంత ముఖ్యమో పౌరుల గోప్యత , దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కూడా భారత్‌కు అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యతను సాధించడానికే కేంద్ర ప్రభుత్వం దీనిపై తీవ్రంగా ఆలోచిస్తోంది.
