భారత అమ్ములపొదిలోకి సరికొత్త అస్త్రం.. దీని లెక్కే వేరు!
ఈ మేరకు తాజాగా భారత్ - యూకే మధ్య కీలకమైన ఒప్పందం జరిగింది. దీని ప్రకారం... తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ 'మార్ట్ లెట్'లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది.
By: Raja Ch | 10 Oct 2025 3:52 PM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో మన వద్ద ఉన్న ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బ్రహ్మోస్ క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ సిస్టం లు హాట్ టాపిక్ లు మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో అధునాతన అస్త్రం భారత అమ్ముల పొదిలో చేరనుంది.
అవును... ఇటివల హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్.జీ.వీ) "ధ్వని" పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీ.ఆర్.డీ.ఓ) ప్రయత్నిస్తున్నట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. బ్రహ్మోస్ క్షిపణి కంటే భీకరంగా పని చేస్తాయని వీటిపై అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'మార్ట్ లెట్' లు ఆర్మీ చేతికి చేరనున్నాయి.
ఈ మేరకు తాజాగా భారత్ - యూకే మధ్య కీలకమైన ఒప్పందం జరిగింది. దీని ప్రకారం... తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ 'మార్ట్ లెట్'లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందంతో భారత గగనతల రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుందని కేంద్రం తమ తాజా ప్రకటనలో వెల్లడించింది.
ఈ ఒప్పందం విలువ 468 మిలియన్ డాలర్లు కాగా... ముంబైలో జరిగిన సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ.. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తో సమావేశమైన తర్వాత ఈ పరిణామం జరిగింది. ఈ ఒప్పందం భారతదేశానికే కాకుండా, నార్తర్న్ ఐలాండ్ లో 700 ఉద్యోగాలను సృష్టించడంలో తమ రక్షణ పరిశ్రమకు కూడా సహాయపడుతుందని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఏమిటీ మార్ట్ లెట్ క్షిపణుల ప్రత్యేకత?:
తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ 'మార్ట్ లెట్'లను ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్ కు చెందిన 'థేల్స్ ఎయిర్ డిఫెన్స్' అనే రక్షణరంగ సంస్థ అభివృద్ధి చేస్తోంది. పురాణాలు, ఇతిహాసాల్లో ఉండే ‘మార్ట్ లెట్’ అనే పక్షి పేరు మీదుగా ఈ క్షిపణులకు పేరు పెట్టారు. ఎప్పుడూ విశ్రాంతి తీసుకోని, అలుపెరగని పక్షి అని దీని అర్థం.
ఈ క్షిపణుల బరువు 13 కిలోలు అయినప్పటికీ వాటి వేగం ధ్వని వేగం కంటే 1.5 ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇవి భూమిపైనా, గాలిలోనూ 6 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలవు. థేల్స్ ఎయిర్ డిఫెన్స్ ప్రత్యేకంగా రాయల్ బ్రిటిష్ నేవీ కోసం ఈ క్షిపణిని రూపొందించింది.
లేజర్ బీమ్ గైడెన్స్ ఆధారంగా రూపొందించిన ఈ క్షిపణిని సైనికులు భుజంపై ఉంచుకొని ప్రయోగించే వీలు ఉంటుంది. సాయుధ వాహనాలకు అనుసంధానం చేసి హెలీకాప్టర్లు, నౌకల నుంచి కూడా వీటిని ప్రయోగించొచ్చు. ఇవే క్షిపణులను ప్రస్తుతం రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ వినియోగిస్తోంది.
ఈ ఒప్పందం భారతదేశ వాయు రక్షణ సామర్థ్యాలకు మరింత తోడ్పడుతుందని, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను తీరుస్తుందని.. రెండు దేశాల మధ్య సంక్లిష్ట ఆయుధాలపై దీర్ఘకాలిక సహకారానికి మద్దతు ఇస్తుందని యూకే, భారత్ లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
