Begin typing your search above and press return to search.

మద్యం సహా వీటి ధరలు భారీగా తగ్గింపు.. జులై 15 నుంచి పండుగ చేసుకోండి..

ఈ ఒప్పందంలో భాగంగా వైద్య పరికరాలు, ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) ఉత్పత్తులపై కూడా పన్నులను తగ్గించారు.

By:  A.N.Kumar   |   26 Jun 2026 7:00 PM IST
మద్యం సహా వీటి ధరలు  భారీగా తగ్గింపు.. జులై 15 నుంచి పండుగ చేసుకోండి..
X

భారత వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్-యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు సాకారం కానుంది. ఈ చారిత్రాత్మక ఒప్పందం రాబోయే జులై 15వ తేదీ నుంచి అధికారికంగా అమల్లోలోకి రానుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ ఒప్పందం అమల్లోకి రావడంతో బ్రిటన్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే అనేక రకాల వస్తువులపై ప్రస్తుతం విధిస్తున్న సుంకాలు భారీగా తగ్గనున్నాయి.

ఈ అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందం వల్ల కేవలం వ్యాపార వర్గాలకే కాకుండా భారతీయ సామాన్య వినియోగదారులకు కూడా అంతర్జాతీయ నాణ్యత కలిగిన బ్రాండెడ్ ఉత్పత్తులు చాలా తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి. పన్నుల తగ్గింపు సుమారు 30 శాతం నుండి 75 శాతం వరకు ఉండటంతో మార్కెట్లో వీటి ధరలు ఊహించని విధంగా దిగిరానున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

స్కాచ్ విస్కీ ప్రియులకు పండగే.. సగానికి తగ్గనున్న సుంకం

ఈ ట్రేడ్ అగ్రిమెంట్‌లో అత్యంత ప్రధానమైన మార్పు మద్యం దిగుమతులపై కనిపించనుంది. ప్రస్తుతం యూకే నుంచి దిగుమతి అయ్యే ప్రసిద్ధ స్కాచ్ విస్కీ బ్రాండ్లపై భారత్‌లో అత్యధికంగా 150 శాతం దిగుమతి సుంకం అమల్లో ఉంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఈ సుంకాన్ని ఏకంగా 75 శాతానికి తగ్గించనున్నారు. అంటే పన్ను భారం సగానికి సగం తగ్గిపోనుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన ప్రీమియం స్కాచ్ విస్కీ బ్రాండ్లు భారత మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభించనున్నాయి.

లగ్జరీ కార్ల ధరల్లో భారీ ఊరట.. బ్రాండెడ్ కార్లు చౌకగా..

మరోవైపు లగ్జరీ కార్ల విభాగంలోనూ కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీలను ప్రకటించింది. ఇప్పటివరకు యూకే నుంచి దిగుమతి చేసుకునే హై-ఎండ్ కార్లపై భారత్ 110 శాతం భారీ దిగుమతి సుంకాన్ని వసూలు చేసేది. జులై 15 నుండి ఈ సుంకాన్ని కేవలం 30 శాతానికి పరిమితం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల రోల్స్ రాయిస్, బెంట్లీ , ఆస్టన్ మార్టిన్, ల్యాండ్ రోవర్ , జాగ్వార్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రీమియం ఆటోమొబైల్ బ్రాండ్ల కార్ల ధరలు గణనీయంగా లక్షల రూపాయల మేర తగ్గనున్నాయి. ఇది భారతీయ ఆటోమొబైల్ రంగానికి సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

జులై 15 నుండి ధరలు తగ్గే ప్రధాన వస్తువుల జాబితా

స్కాచ్ విస్కీ దిగుమతి సుంకం 150% నుండి 75% కి తగ్గుతుంది. లగ్జరీ కార్లు ఇంపోర్ట్ టారిఫ్ 110% నుండి కేవలం 30% కి తగ్గుతాయి. లైఫ్ స్టైల్ ఉత్పత్తులు అంతర్జాతీయ బ్రాండ్ల కాస్మోటిక్స్ , పర్సనల్ కేర్ వస్తువులు... ప్రీమియం చాక్లెట్లు, స్వీట్ బిస్కెట్లు, సాఫ్ట్ డ్రింక్స్, విదేశీ సాల్మన్ చేపలు తక్కువ ధరకు లభిస్తాయి. వైద్య రంగంలో నాణ్యమైన మెడికల్ పరికరాలు, అత్యాధునిక హెల్త్‌కేర్ వస్తువులు తక్కువకు లభిస్తాయి.

రోజువారీ వినియోగ వస్తువులపై సానుకూల ప్రభావం

కేవలం విలాసవంతమైన వస్తువులే కాకుండా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు రోజువారీ జీవితంలో ఉపయోగించే అనేక ఉత్పత్తులపై కూడా ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపనుంది. ముఖ్యంగా మహిళలు ఉపయోగించే అంతర్జాతీయ కాస్మోటిక్స్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు విదేశీ బ్రాండెడ్ చాక్లెట్లు, స్వీట్ బిస్కెట్లు, ప్రీమియం సాఫ్ట్ డ్రింక్స్ , సముద్ర ఆహార ప్రియులు ఇష్టపడే సాల్మన్ చేపల ధరలు కూడా దిగిరానున్నాయి. దిగుమతి వ్యయం భారీగా తగ్గడం వల్ల ఆయా కంపెనీలు ఈ లబ్ధిని నేరుగా వినియోగదారులకే బదిలీ చేసే అవకాశం ఉంది.

ఆరోగ్య రంగానికి సరికొత్త ఊతం

ఈ ఒప్పందంలో భాగంగా వైద్య పరికరాలు, ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) ఉత్పత్తులపై కూడా పన్నులను తగ్గించారు. దీనివల్ల బ్రిటన్ నుండి వచ్చే అత్యాధునిక వైద్య పరికరాలు తక్కువ ధరకే భారతీయ ఆసుపత్రులకు అందుబాటులోకి వస్తాయి. తద్వారా సామాన్య ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు మరింత తక్కువ ఖర్చుతో లభించే అవకాశం ఉంది.

ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం

భారత్-యూకే సంబంధాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మైలురాయిగా నిలవనుంది. ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. భారతీయ ఐటీ, టెక్స్‌టైల్ రంగానికి కూడా ఈ ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లో మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.

జులై 15 వ తేదీ నుండి ఈ కొత్త ధరల విధానం అమలు కానుంది. మార్కెట్లోకి కొత్త స్టాక్ రాకను బట్టి వినియోగదారులకు ఈ తగ్గింపు ధరలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి.