Begin typing your search above and press return to search.

భారత్ 'దోస్త్' కు వెన్నుపోటు పొడిచిన ఫలితం అనుభవిస్తున్న టర్కీ..!

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిన సమయంలో.. ఉగ్రవాదులు చేసిన పనిని ప్రపంచ దేశాలు ఖండించాయి.

By:  Raja Ch   |   19 Oct 2025 9:00 PM IST
భారత్  దోస్త్ కు వెన్నుపోటు పొడిచిన ఫలితం అనుభవిస్తున్న టర్కీ..!
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిన సమయంలో.. ఉగ్రవాదులు చేసిన పనిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో భారత్ కు తమ మద్దతును ప్రకటించాయి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో భారత సహాయం పొందిన ఓ దేశం మాత్రం పాక్ కు సహకరించింది. తాజాగా ఆ ప్రతిఫలం అనుభవించిన విషయం తెరపైకి వచ్చింది.

అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ వేళ టర్కీ, అజర్‌ బైజన్‌ దేశాలు పాకిస్థాన్ కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆ దేశాల పర్యాటక రంగంపై గట్టిగా ప్రతికూల ప్రభావం పడింది. ఇందులో భాగంగా... భారత్‌ నుంచి ఆయా దేశాలకు వెళ్లే పర్యటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన తాజా గణాంకాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... కొన్నేళ్ల నుంచి అటు టర్కీ, ఇటు అజర్ బైజన్ దేశాలు భారత్‌ లో భారీ ప్రచారం చేసి పర్యటకులను పెద్ద ఎత్తున ఆకర్షించాయి. దీంతో పెద్ద సంఖ్యలో భారతీయులు అక్కడికి వెళ్లడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆ దేశాల ప్రభుత్వ టూరిజం బోర్డులు భారత మార్కెట్‌ ను కీలకంగా గుర్తించాయి. ఈ క్రమంలో... ఈ క్రమంలో పాకిస్థాన్‌ పై భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది.

ఆ కీలక సమయంలో టర్కీ, అజర్‌ బైజన్‌ లు బహిరంగంగానే పాకిస్థాన్ కు మద్దతు తెలిపాయి. దీంతో.. మే నెల నుంచే ఈ రెండు దేశాలకు బుకింగ్స్‌ ను పర్యటకులు రద్దు చేసుకున్నారు. ఈ సమయంలో... భారత్‌ కు చెందిన ట్రావెల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు కూడా ఈ దేశాలకు బుకింగ్స్‌ ను నిలిపేసి నిరసన వ్యక్తం చేశారు. అవసరమైతేనే ఆ దేశాలకు ప్రయాణం చేయాలని పర్యటకులకు బుక్కింగ్ సంస్థలు సూచనలు కూడా చేశాయి.

దీంతో... అప్పటి వరకూ అజర్‌ బైజన్‌ కు వెళ్లే భారతీయుల సంఖ్య ఏటా 33 శాతం వృద్ధి చెందుతూ రాగా.. మే నెల తర్వాత తర్వాత నాలుగు నెలల్లో ఒక్కసారిగా 56 శాతం పతనమైంది. సాధారణంగా ఆ నాలుగు నెలల్లో లక్ష వరకు ఉండాల్సిన పర్యటకుల సంఖ్య 44 వేలకు పడిపోయింది. ఆపరేషన్‌ సిందూర్‌ కు ముందు నాలుగు నెలల్లో ఆ దేశానికి 81 వేల మంది భారతీయులు వెళ్లారు.

ఇక టర్కీ విషయానికొస్తే... మే నుంచి ఆగస్టు వరకు టర్కీకి వెళ్లే భారతీయుల సంఖ్య మూడో వంతు తగ్గింది. ఈ సీజన్‌ లో గతేడాది 1.36లక్షల మంది ఆ దేశాన్ని సందర్శించగా.. ఈ సారి ఆ సంఖ్య 90,400కు పరిమితమైంది. ముందు ముందు ఈ ప్రభావం మరింతగా ఉండొచ్చని అంటున్నారు.

'దోస్తే' మేలు మరిచిన టర్కీ!:

2023 ఫిబ్రవరి 6న భూకంపవల్ల సిరియాతో పాటు టర్కీ అతలాకుతలం అయ్యింది. ఈ సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుగా భారత్ స్పందించింది. టర్కీకి ఆపన్న హస్తం అందించింది. ఆ సమయంలో టర్కీకి భారత ప్రధాని మోడీ సంఘీభావం తెలిపారు. టర్కీ ప్రజలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని చెబుతూ.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

అనంతరం... టర్కీకి సహాయం చేయడానికి భారత్ "ఆపరేషన్ దోస్త్"ను ప్రారంభించింది. ఈ సమయంలో... టర్కీకి తక్షణం సహాయ చర్యలు ఏమి అందించాలనే విషయాన్ని నిర్ణయించడానికి ప్రధాని మోడీ సంబంధిత శాఖలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో 8,45,590 డాలర్ల సహాయ సామాగ్రిని పంపించారు.

ఈ సందర్భంగా స్పందించిన టర్కీ రాయబారి ఫిరత్ సునేల్... భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో నిలబడిన స్నేహితుడే నిజంగా స్నేహితుడని చెప్పుకొచ్చాడు. ఢిల్లీకి ధన్యవాదాలు తెలిపారు. కట్ చేస్తే... ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ కు మద్దతు తెలిపి భారత్ కు వెన్నుపోటు పొడిచే పనికి పూనుకుంది. ఇప్పుడు అనుభవిస్తుంది!