అమెరికా నుంచే భారత్‌కు అత్యధిక విదేశీ పర్యాటకులు..
ఇక మన దేశంలో విదేశీయులు ఎక్కడ ఎక్కువగా వాలారంటే.. మన ఉత్తరప్రదేశ్ లో.. ఏకంగా 45.08 లక్షల మంది విదేశీయులు యూపీలో ల్యాండ్ అయ్యారు.
By: A.N.Kumar | 14 Aug 2026 8:15 AM ISTపర్యాటక రంగం గురించి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో కొండంత డేటాను మోసుకొచ్చి పెట్టింది. 2025 లెక్కలు చూస్తుంటే... మన ఊరి బస్సుల్లో కంటే భారత్ వస్తున్న విదేశీ విమానాల్లోనే రద్దీ ఎక్కువగా ఉన్నట్లుంది. పర్యాటకుల రాకలో 'అమెరికా అంకుల్' గారే మళ్ళీ టాప్ లేపారు. ఎంత లేదన్నా మనోళ్లు డాలర్లలో లెక్కలేస్తారు కాబట్టి 18.41 లక్షల మంది అమెరికన్లు ఇండియాకి వచ్చి “వావ్.. స్పైసీ!” అంటూ రీల్స్ చేసుకున్నారు. 2023, 2024 నుంచి పెరిగిన ఈ గ్రాఫ్ చూస్తుంటే.. అమెరికాలో ఉండాల్సిన సగం మంది తాతలు, బామ్మలు ఇక్కడే పానీపూరి తింటున్నారనిపిస్తోంది.
ఇక రెండో స్థానంలో మనల్ని కొన్ని వందల ఏళ్లు పాలించిన బ్రిటన్ 10.84 లక్షలతో ఉంది. "పోయిన మన పాత సామ్రాజ్యాన్ని ఒకసారి చూసొద్దాం" అని వచ్చారో లేక ఇక్కడి బిర్యానీ రుచికి పడిపోయారో తెలియదు కానీ వారి రాక బాగానే ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, కెనడాలు డిపాజిట్లు కాపాడుకున్నాయి.
బంగ్లాదేశ్.. ఏమైంది సామీ నీకు?
ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే... మన పక్కంటి బంగ్లాదేశ్.. 2023లో ఏకంగా 21 లక్షల మందితో ‘ఫస్ట్ ర్యాంకు’ కొట్టి ఇండియాను సొంతిల్లులా భావించిన బంగ్లా పర్యాటకులు.. 2025కి వచ్చేసరికి ఏకంగా 73 శాతం ఖాళీ అయిపోయారు.. కేవలం 4.68 లక్షల మందే వచ్చారట. అంతగా ఏమొచ్చిందో ఏమో కానీ బోర్డర్ దాటడానికి వీసా దొరకలేదో లేక ఇక్కడి గాలి పడలేదో గానీ.. ఐదో స్థానానికి పచ్ మని పడిపోయారు.
యూపీ.. ది రియల్ టూరిజం హాట్‌స్పాట్
ఇక మన దేశంలో విదేశీయులు ఎక్కడ ఎక్కువగా వాలారంటే.. మన ఉత్తరప్రదేశ్ లో.. ఏకంగా 45.08 లక్షల మంది విదేశీయులు యూపీలో ల్యాండ్ అయ్యారు. బహుశా కాశీ విశ్వనాథుడి దర్శనం, తాజ్ మహల్ చూసేందుకు క్యూ కట్టినట్టున్నారు. మహారాష్ట్ర కొద్ది తేడాతో రెండో స్థానానికి పరిమితమైంది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ టాప్-5 లిస్టు వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేకపోయాయి. మన దగ్గర కేవలం "బిర్యానీ తిని, బాహుబలి షూటింగ్ స్పాట్ చూసి వెళ్లిపోతున్నారు" తప్ప ఫారిన్ నాటింగ్‌హ్యామ్ టూరిస్టులను ఆకట్టుకోవడంలో వెనకబడ్డామని అర్ధమవుతోంది.
మొత్తానికి 2025లో 2 కోట్లకు పైగా అంతర్జాతీయ ప్రయాణికులు ఇండియాను తాకారు. కేంద్రం మాత్రం ప్రశాద్ , స్వదేశ్ దర్శన్ అంటూ స్కీములు ప్రకటిస్తూనే ఉంది. పర్యాటకులు వస్తున్నారు, చూస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు... మరి మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కళ్ళు తెరుస్తాయో ఆ దేవుడికే తెలియాలి.
