యాప్ డౌన్ లోడ్స్ లో టాప్ 5 దేశాలివే..భారత్ స్థానం ఇదే
ప్రపంచ వ్యాప్తంగా సరాసరిన నెలకు వినియోగిస్తున్న యాప్స్ 34గా లెక్కేశారు. యాప్స్ కోసం వినియోగదారులు చేసిన ఖర్చు కూడా మామూలుగా లేదు. అక్షరాల 15.29వేల కోట్ల రూపాయి.
By: Garuda Media | 27 Jan 2026 10:18 AM ISTఅరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ మనిషి జీవితాన్ని ఎంతలా మార్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజున మొబైల్ ఉంటే చాలు.. అన్నీ చెక్కబెట్టేయొచ్చు. అంతలా మనిషి జీవనాన్ని మార్చిన మొబైల్ ఫోన్ లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి యాప్స్. వినోదం దగ్గరి నుంచి విద్య.. ఈ కామర్స్.. అది కాదు ఇది కాదు.. ఏదైనా సరే ఇట్టే దొరికేలా చేసే యాప్స్ కు సంబంధించిన కొన్ని గణాంకాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రపంచాన్ని యాప్స్ ఎంత ప్రభావితం చేస్తున్నాయో చెప్పే ఈ గణాంకాలు ఆద్యంతం ఆసక్తికరమని చెప్పాలి.
మనిషి జీవితం యాప్స్ చుట్టూనే ముడిపడి ఉందన్నది మర్చిపోకూడదు. గత ఏడాది (2025)లో 14,900 కోట్ల యాప్ డౌన్ లోడ్స్ నమోదైనట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మొబైల్ యాప్స్ డౌన్ లోడ్స్ తో పాటు వినియోగంలోనూ భారత్ అగ్రస్థానంలో ఉంది. గత ఏడాదిలో యాప్ డౌన్ లోడ్స్ లో ప్రపంచంలో టాప్ 5 దేశాల జాబితా చూస్తే.. భారత్ మొదటిస్థానంలో.. అమెరికా రెండో స్థానంలో.. బ్రెజిల్ మూడో స్థానంలో. ఇండోనేషియా నాలుగో స్థానంలో.. చైనా ఐదో స్థానంలో నిలిచింది.
అయితే.. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. యాప్స డౌన్ లోడ్ లో మొదటిస్థానంలో ఉన్న భారత్ కు రెండో స్థానంలో ఉన్న అమెరికాకు మధ్య వ్యత్యాసం యాభై శాతం కంటే ఎక్కువగా ఉండటం. 2025లో భారత్ లో 2550 కోట్ల యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుంటే.. అమెరికాలోని ప్రజల డౌన్ లోడ్స్ 1260 కోట్లు మాత్రమే. ఐదో స్థానంలో నిలిచిన చైనీయుల డౌన్ లోడ్స్ 615 కోట్లు మాత్రమే. 2025లో యాప్స్ కోసం ప్రపంచం వెచ్చించిన సమయం 5.3 లక్షల కోట్ల గంటలు. సగటున ఒక్కో యూజర్ 3.6 గంటలు వినియోగిస్తున్నట్లుగా లెక్క తేల్చారు.
ప్రపంచ వ్యాప్తంగా సరాసరిన నెలకు వినియోగిస్తున్న యాప్స్ 34గా లెక్కేశారు. యాప్స్ కోసం వినియోగదారులు చేసిన ఖర్చు కూడా మామూలుగా లేదు. అక్షరాల 15.29వేల కోట్ల రూపాయి.
అదే సమయంలో యాప్స్ కు అధికంగా ఖర్చు చేస్తున్న టాప్ 10 దేశాల జాబితాలో భారత్ లేకపోవటం గమనార్హం టాప్ 10 దేశాల జాబితాలో.
1. అమెరికా
2. చైనా
3. జపాన్
4. దక్షిణ కొరియా
5. యూకే
6. జర్మనీ
7. ఫ్రాన్స్
8. కెనడా
9. తైవాన్
10. ఆస్ట్రేలియా
2025లో గూగుల్ ప్లే.. ఐఓఎస్ ప్లే స్టోర్ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది నిమిషానికి 2.84 లక్షల యాప్స్ డౌన్ లోడ్ అయ్యాయి. తొలిసారి ఆటల కంటే గేమస్ మీద అధికంగా వ్యయం చేసినట్లుగా చెబుతున్నారు. ఫీచర్స్.. కంటెంట్.. సేవల కోసం మొబైల్ యూజర్లు నిమిషానికి రూ.2.9 కోట్లు ఖర్చు చేసినట్లుగా లెక్కేశారు. గత ఏడాది మన దేశంలో టాప్ డౌన్స్ పొందిన యాప్ లు చూస్తే.. ఇన్ స్టా మొదటి స్థానంలో నిలిస్తే.. మాస్ట్ రెండో స్థానంలో రెమిని మూడో స్థానంలో. మీషో నాలుగో స్థానంలో.. జియో హాట్ స్టార్ ఐదో స్థానంలో నిలిచింది.
యాప్స్ డౌన్ లోడ్స్ లో సోషల్ మీడియా అగ్రస్థానంలో నిలిచింది. 89.6 కోట్ల యాప్స్ ను డౌన్ లోడ్ చేయగా.. రెండు.. మూడో స్థానాల్లో వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ యాప్స్ నిలిచాయి. నాలుగో స్థానంలో షాపింగ్ యాప్స్.. ఐదో స్థానంలో ఓటీటీ యాప్స్ డౌన్ లోడ్ అయ్యాయి.
