భారత్ కు "మేజర్ పవర్" హోదా... తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు!
ఆసియా పవర్ ఇండెక్స్ అనేది.. ఆసియా అంతటా ఉన్న దేశాల సమగ్ర శక్తిని అంచనా వేసే వార్షిక నివేదిక!
By: Raja Ch | 1 Dec 2025 8:00 PM IST'ఆసియా పవర్ ఇండెక్స్ - 2025'లో భారత్ తన సత్తా చాటింది. ఇందులో భాగంగా ఈ పవర్ ఇండెక్స్ లో తొలిసారిగా మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా "మేజర్ పవర్" హోదాను పొందింది. ఆపరేషన్ సిందూర్ లో దాని పనితీరు ఆధారంగా లోవీ ఇనిస్టిట్యూట్ అధ్యయనంలో భారత్ ఈ ర్యాంకింగ్ ను పొందింది. ఇక "సూపర్ పవర్స్" హోదాలో మొదటి రెండు ర్యాంకులను వరుసగా అమెరికా, చైనా నిలుపుకున్నాయి.
అవును... ఆసియా పవర్ ఇండెక్స్ లో భారత్ తొలిసారిగా మూడో ర్యాంకును సాధించింది.. ఫలితంగా మేజర్ పవర్ హోదాను పొందింది. వాస్తవానికి గత ఏడాది ఈ పవర్ ఇండెక్స్ జాబితాలో 38.1 స్కోరుతో "మిడిల్ పవర్" జాబితాలో నిలిచిన భారత్.. ఈ ఏడాది నివేదికలో 100కి 40 స్కోరు సాధించింది. భారత్ తర్వాత స్థానాల్లో 38.8తో జపాన్, 32.1 స్కోరుతో రష్యా వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలవడం గమనార్హం.
వాస్తవానికి ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచినప్పటికీ.. రెండో స్థానంలో ఉన్న చైనా (73.7 పాయింట్లు)తో పోలిస్తే ఇప్పటికీ పెద్ద అంతరాన్నే చూపిస్తోంది. ఇక అగ్రరాజ్యం అమెరికా ఈ ఇండెక్స్ లో నూటికి 80.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా భారత్ ర్యాంకు ఆర్థిక, సైనిక సామర్థ్యాల పరంగా దాని వృద్ధికి మద్దతు ఇస్తుంది.
ఈ సందర్భంగా భారత భౌగోళిక రాజకీయ ఔచిత్యంలో స్వల్పమైన పురోగతిని అంతర్జాతీయ కనెక్టివిటీ, సాంకేతిక అభివృద్ధి ద్వారా కొలుస్తారని లోవీ ఇనిస్టిట్యూట్ తెలిపింది. ఇదే సమయంలో.. భారతదేశ సైనిక సామర్థ్యాలు పెరుగుతున్నాయని నొక్కి చెప్పింది. ఈ సూచిక ప్రకారం.. అమెరికా తర్వాత అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించే దేశంగా చైనాను భారత్ అధిగమించింది.
ఏమిటీ ఆసియా పవర్ ఇండెక్స్..?:
ఆసియా పవర్ ఇండెక్స్ అనేది.. ఆసియా అంతటా ఉన్న దేశాల సమగ్ర శక్తిని అంచనా వేసే వార్షిక నివేదిక! ఈ క్రమంలో తాజాగా దాని ఏడవ ఎడిషన్ (2025)ను విడుదల చేసింది. ఇందులో ఎనిమిది ప్రధాన కోణాల్లో 131 సూచికల ఆధారంగా 27 దేశాలు, భూభాగాలకు ర్యాంకులు ఇచ్చింది. ఇందులోని ఎనిమిది కోణాలు... ఆర్థిక సామర్థ్యం, సైనిక సామర్థ్యం, స్థితిస్థాపకత భవిష్యత్తు, వనరులు, దౌత్య ప్రభావం, ఆర్థిక సంబంధాలు, రక్షణ నెట్ వర్క్ లు, సాంస్కృతిక ప్రభావం!
ఆసియా పవర్ ఇండెక్స్ - 2025లో టాప్ - 10 దేశాలు!:
అమెరికా - 80.4
చైనా - 73.7
భారత్ - 40.0
జపాన్ - 38.8
రష్యా - 32.1
ఆస్ట్రేలియా - 31.8
సౌత్ కొరియా - 31.5
సింగపూర్ - 26.8
ఇండోనేషియా - 22.4
మలేషియా - 20.5
