Begin typing your search above and press return to search.

అమెరికాతో వివాదం : భారత్ కు తలుపులు బార్లా తెరిచిన చైనా శత్రువు

మరోవైపు తైవాన్ వద్ద సెమికండక్టర్స్, మాగ్నెట్ ఉత్పత్తిలో అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానం ఉంది. కానీ వారికి ఈ విలువైన ఖనిజాల నిల్వలు లేవు.

By:  A.N.Kumar   |   21 Sept 2025 4:00 AM IST
అమెరికాతో వివాదం : భారత్ కు తలుపులు బార్లా తెరిచిన చైనా శత్రువు
X

భారత్, తైవాన్ దేశాల మధ్య ఒక వినూత్నమైన, వ్యూహాత్మక భాగస్వామ్యం ఊపందుకుంటోంది. ఈ కొత్త ఒప్పందం చైనాకు గట్టి పోటీనిచ్చేలా రేర్ ఎర్త్ మినరల్స్, సెమికండక్టర్స్ రంగాల్లో ఇరు దేశాలకూ లాభాలను చేకూరుస్తుంది. ఈ ఒప్పందం ప్రధానంగా తైవాన్ టెక్నాలజీ , భారతదేశ ఖనిజ సంపదల కలయికపై ఆధారపడి ఉంది.

*రేర్ ఎర్త్ మినరల్స్‌లో విజయం-విజయ్ పరిస్థితి

రేర్ ఎర్త్ మినరల్స్ ఆధునిక ఎలక్ట్రానిక్స్, శాశ్వత మాగ్నెట్ల తయారీలో అత్యంత కీలకమైనవి. ఈ మాగ్నెట్లు స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్‌లు వంటి కీలక రంగాలలో ఉపయోగపడతాయి. ప్రపంచంలో చైనా, బ్రెజిల్ తర్వాత మూడవ అతిపెద్ద రేర్ ఎర్త్ నిల్వలు భారత్‌లో ఉన్నాయి. అయితే ఈ ఖనిజాలను శుద్ధి చేసి, ఉత్పత్తి చేయడంలో భారతదేశానికి అవసరమైన సాంకేతికత లేదు.

మరోవైపు తైవాన్ వద్ద సెమికండక్టర్స్, మాగ్నెట్ ఉత్పత్తిలో అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానం ఉంది. కానీ వారికి ఈ విలువైన ఖనిజాల నిల్వలు లేవు. ఈ నేపథ్యంలోనే తైవాన్ రేర్ ఎర్త్ మినరల్స్‌ను భారతదేశం నుండి దిగుమతి చేసుకోవడానికి, అందుకు ప్రతిఫలంగా తమ ఉత్పత్తి సాంకేతికతను భారత్‌లో పెట్టుబడిగా పెట్టడానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ద్వారా భారత్ తన ఖనిజ సంపదను పూర్తిస్థాయిలో వినియోగించుకుని రేర్ ఎర్త్ మాగ్నెట్ల ఉత్పత్తిలో స్వావలంబన సాధిస్తుంది. తైవాన్ తన సరఫరా గొలుసులో చైనాపై ఆధారపడకుండా స్థిరత్వాన్ని పొందుతుంది.

* సెమికండక్టర్స్ రంగంలో పెట్టుబడులు

తైవాన్ తన రేర్ ఎర్త్ ఆఫర్‌తో పాటు, సెమికండక్టర్ రంగంలో కూడా భారత్‌కు ప్రత్యేక అవకాశాలను అందిస్తోంది. ప్రపంచ సెమికండక్టర్ ఉత్పత్తిలో 60 శాతం వాటా తైవాన్ దే.. అయితే చైనాతో వాణిజ్యపరమైన, భద్రతాపరమైన ఉద్రిక్తతల కారణంగా తైవాన్ తమ ఉత్పత్తి కేంద్రాలను ఇతర దేశాలకు విస్తరించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది.

ప్రముఖ తైవాన్ కంపెనీ పవర్‌చిప్ సెమికండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్, టాటా గ్రూప్‌తో కలిసి త్వరలో భారతదేశంలో చిప్‌ల తయారీని ప్రారంభించనుంది. తైవాన్ కంపెనీలు ఇప్పటికే భారతదేశంలో ఉన్న డిమాండ్, అలాగే నైపుణ్యం కలిగిన మానవ వనరుల పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి.

*చైనాకు వ్యూహాత్మక సవాల్

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి, శుద్ధిలో చైనా దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ రంగంలో చైనా తన గుత్తాధిపత్యాన్ని ఉపయోగించి గతంలో అనేక దేశాలకు సవాలు విసిరింది. అయితే ఇప్పుడు భారత్, తైవాన్ల మధ్య కుదురుతున్న ఈ ఒప్పందం ఆ గుత్తాధిపత్యాన్ని సవాల్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఇది రెండు దేశాలకు ఆర్థికంగానే కాకుండా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా కూడా అత్యంత కీలకమైనది.

భారత్-తైవాన్ భాగస్వామ్యం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శక్తి సమతుల్యం మారే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలూ తమ భద్రతను పటిష్టం చేసుకుంటూ, సాంకేతికతలో పురోగతి సాధించే అవకాశాన్ని పొందుతున్నాయి. విశ్లేషకుల ప్రకారం.. ఇది భారత్‌కు తన ఖనిజ సంపదను సాంకేతిక శక్తిగా మార్చుకునే సువర్ణావకాశం. అదే సమయంలో, తైవాన్‌కు చైనా ఒత్తిడికి ప్రత్యామ్నాయంగా సుస్థిరమైన మార్కెట్ లభిస్తుంది.