Begin typing your search above and press return to search.

జుట్టు అమ్ముకుని.. ల్యాప్ టాప్‌లు అద్దెకు ఇస్తూ.. పొట్ట పోషించుకోవ‌డ‌మా?!

అహంకార‌పు అగ్ర‌రాజ్యం అమెరికా విధించిన కఠిన ఆంక్షలు, అంతర్జాతీయ ప్రతిబంధకాల వల్ల ఇరాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దుర్భర స్థితికి చేరుకుంది.

By:  Sivaji Kontham   |   4 Aug 2026 11:42 PM IST
జుట్టు అమ్ముకుని.. ల్యాప్ టాప్‌లు అద్దెకు ఇస్తూ.. పొట్ట పోషించుకోవ‌డ‌మా?!
X

అహంకార‌పు అగ్ర‌రాజ్యం అమెరికా విధించిన కఠిన ఆంక్షలు, అంతర్జాతీయ ప్రతిబంధకాల వల్ల ఇరాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దుర్భర స్థితికి చేరుకుంది. జులై నాటికి అక్కడి ద్రవ్యోల్బణం ఏకంగా 66 శాతానికి చేరడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. డబ్బు లేక ఆ దేశ ప్రజలు వాడేసిన పర్ఫ్యూమ్ బాటిళ్లు, సెకండ్ హ్యాండ్ దుస్తులు, చివరకు తమ జుట్టును కూడా అమ్ముకుంటూ... ల్యాప్‌టాప్‌లను అద్దెకు ఇస్తూ పొట్ట నింపుకోవాల్సి వస్తోంది. ప్రపంచంలోనే సంపన్న చమురు నిల్వలు ఉన్న ఒక దేశం ఇలాంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంపై అంతర్జాతీయ సమాజంతో పాటు భారత్ కూడా తీవ్రంగా కలవరపడుతోంది.

ఇరాన్‌తో భారతదేశానికి శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక - వ్యూహాత్మక అనుబంధం ఉంది. భారత్‌కు ఇరాన్ ఎప్పుడూ ఒక నమ్మకమైన మిత్రదేశమే. సెంట్రల్ ఆసియా , రష్యాలకు మార్గం సుగమం చేసే అత్యంత కీలకమైన `ఛాబహార్ పోర్ట్` అభివృద్ధిలో ఇరాన్‌తో భారత్ చురుగ్గా భాగస్వామిగా ఉంది. అయితే అమెరికా విధించిన ఆంక్షల (CAATSA) కారణంగా ఇరాన్ నుండి చమురు దిగుమతులను భారత్ తగ్గించుకోవాల్సి వచ్చింది. అంతమాత్రాన భారత్, అమెరికా ఒత్తిళ్లకు పూర్తిగా తలొగ్గి ఇరాన్‌ను ఒంటరిని చేసిందని చెప్పలేము. తన స్వంత జాతీయ ప్రయోజనాలు..అంతర్జాతీయ దౌత్య సంబంధాల మధ్య సమతుల్యతను పాటిస్తూ భారత్ అడుగులు వేస్తోంది.

ఇరాన్ దుర్భర స్థితిలో ఉన్నప్పుడు భారత్ పూర్తిగా మౌనంగా ఊరుకోలేదు. ఒకవైపు అమెరికా తో ఉన్న ఆర్థిక, సాంకేతిక సంబంధాలను కాపాడుకుంటూనే... మరోవైపు ఇరాన్‌కు మానవీయ కోణంలో సహాయం అందించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఆంక్షల పరిధిలోకి రాని బియ్యం, టీ, చక్కెర, అత్యవసర మందులను ఇరాన్‌కు ఎగుమతి చేస్తూ మద్దతుగా నిలుస్తోంది. అలాగే ఛాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ విషయంలో అమెరికా ఆంక్షల నుండి ప్రత్యేక మినహాయింపులు పొంది... ఆ ప్రాజెక్ట్‌ను నిరంతరం ముందుకు తీసుకెళ్లేలా దౌత్యపరంగా వ్యవహరిస్తోంది.

ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ప్రదర్శిస్తోంది. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కాపాడుకుంటూనే... ఇరాన్‌తో సంబంధాలను తెంచుకోకుండా జాగ్రత్త పడుతోంది. అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిళ్లు ఉన్నా.. ఇరాన్‌తో చర్చలు పునరుద్ధరించాలని, దౌత్య మార్గాల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని భారత్ ఎప్పటికప్పుడు ఐక్యరాజ్యసమితి వేదికగా స్పష్టం చేస్తోంది. ఇరాన్ ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభాన్ని తగ్గించడానికి వీలైనన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

మొత్తానికి ఇరాన్ ఉన్న పరిస్థితిలో భారత్ పూర్తిగా చేతులు ముడుచుకుని కూర్చోలేదు, అలాగని అమెరికాతో సంబంధాలను పణంగా పెట్టలేదు. ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం ఒక నిష్పాక్షికమైన - బాధ్యతాయుతమైన శక్తిగా వ్యవహరిస్తోంది. ఇరాన్ త్వరలోనే ఈ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడాలని.. ప్రాంతీయ స్థిరత్వం ఏర్పడాలని కోరుకుంటూనే... చట్టబద్ధమైన వ్యాపార - మానవీయ సహాయాల ద్వారా ఇరాన్‌కు ఒక నమ్మకమైన స్నేహితుడిగా భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తూనే ఉంది.