సూపర్ ఎల్ నినో...భారత్ మీద పడగ విప్పింది !
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం లేకపోవడంతో దేశవ్యాప్తంగా భారీగా లోటు వర్షపాతం నమోదైంది.
By: Satya P | 20 Sept 2026 9:13 AM ISTఇప్పటిదాకా ఎల్ నినోని అంతా చూస్తూ వస్తున్నారు. దేశంలో అత్యధిక రాష్ట్రాలు ఎల్ నినో ప్రభావంతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ని ఈ ఎల్ నినో మింగేసింది. అంతే కాదు నైరుతి రుతుపవనాలు కూడా పూర్తిగా నిష్ఫలం అయిపోయాయి. ఏడాదికి సరిపడా వర్షాలు కురిసే పరిస్థితుల నుంచి దారుణంగా వర్షాభావానికి ఎల్ నినో కారణం.
భారీ లోటుగానే :
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం లేకపోవడంతో దేశవ్యాప్తంగా భారీగా లోటు వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా దీర్ఘ కాలిక సగటు కంటే 15 శాతం తక్కువ వర్షపాతం ఈసారి రికార్డైంది. ఇది గత 17 ఏళ్లలోనే అంటే 2009 తరువాత అత్యల్ప వర్షపాతంగా నిలిచింది. బన్గాళాఖాతంలో తగినన్ని బలమైన అల్పపీడన ద్రోణులు ఏర్పడకపోవడం వల్ల మేఘాల కదలికలు తగ్గాయి. వర్షాల మధ్య భారీ అంతరాలు ఏర్పడడంతో దేశంలోని అనేక రాష్ట్రాలలో భూగర్భ జలాలు రిజర్వాయర్ల నిల్వలు పెద్ద ఎత్తున క్షీణించాయి.
ఇంకా పెను ముప్పు :
అయితే ఇది సాధారణ ఎల్ నినో మాత్రమే అని అంటున్నారు. అసలైన ఎల్ నినో ముందు పొంచి ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దాని పేరు సూపర్ ఎల్ నినో అంటున్నారు. ఇది భారత్ మీద పడగ విప్పి ఉందని హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని వల్ల రానున్న రోజులలో దేశమంతా పొడి వాతావరణంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అలాగే ఎక్కడ చూసినా భూగర్భ జలాలు ఇంకా ఇంకిపోయి దారుణమైన నీటి కొరత ఏర్పడుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి అంచనా వేసింది ఒకరిద్దరు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 180 మందికి పైగా సైంటిస్టులు పర్యావరణవేత్తలు కావడంతో సూపర్ ఎల్ నినో మీద ఒక్కసారిగా భయాందోళనలు పెరిగిపోతున్నాయి.
కలవరపెడుతున్న నివేదిక :
సూపర్ ఎల్ నినో విషయంలో ఒక నివేదిక అయితే తీవ్రంగానే కలవరపెడుతోంది. సూపర్ ఎల్ నినో తీవ్రత దాని వల్ల పర్యావరణానికి వాటిల్లే ముప్పుపై శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధన మీద వచ్చిన నివేదిక ప్రముఖ ఓపెన్ యాక్సెస్ రిపోజిటరీ అయిన జెనోడాలో ప్రచురితమైంది. సూపర్ ఎల్ నినోను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని నష్ట నివారణ చర్యలకు తగిన యాక్షన్ ప్లాన్ ని రూపొందించాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ఈ సూపర్ ఎల్ నినో కారణంగా భారతదేశంలోని సముద్ర భూ సంబంధితమైన ప్రాంతాలు అలాగే మంచి నీటి వనరులు, పర్యావరణ వ్యవస్థల మీద అత్యంత తీవ్రమైన ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులు దారుణంగా ఉంటాయని దాంతో విపరీతమైన వేడి అలాగే బలహీనమైన రుతుపవనాలు సంభవించే అవకాశం ఉంది అని చెబుతున్నారు.
చలి కాలం లేనట్లే :
సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఈ సీజన్ లో చలి కాలం గురించి మరచి పోవాల్సిందే అని అంటున్నారు. ఇది ఈ ఏడాది నవంబర్ లో భారత్ లో తన ప్రభావం చూపిస్తుందని 2027 ఫిబ్రవరి దాకా దీని తాకిడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్ నినో ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాలకు చేయాల్సిన నష్టం చేసింది. ఈ సూపర్ ఎల్ నినో ఇంకెంత చేస్తుంది అన్నది అయితే ఆందోళన అందరిలో ఉంది. నీటి కొరత మరింత పెరుగుతుందని నగరాలు పట్టణాలు అధిక వేడితో సతమతం అవుతాయని, వ్యవసాయ రంగం మీద తీవ్ర ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక ఈ అధిక వేడితో అడవులలో కార్చిచ్చు కూడా రాజుకుని వృక్ష సంపదతో పాటు వన్య ప్రాణులకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించవచ్చు అని అంటున్నారు. మొత్తం మీద సూపర్ ఎల్ నినో ప్రభావం గురించిన చర్చ కానీ విషయాలు కానీ చూస్తొంటే ఇబ్బందికరమైన వాతావరణంలోకి దేశం వెళ్ళనుందా అన్న ఆందోళన అయితే ఉందిప్పుడు.
