Begin typing your search above and press return to search.

'సెవన్ సిస్టర్స్' ఇష్యూ సీరియస్... భారత్ కీలక స్టెప్!

గత ఏడాది షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పాలన పతనం తర్వాత న్యూఢిల్లీతో బంగ్లాకు సంబంధాలు దెబ్బతిన్నాయనే చెప్పాలి.

By:  Raja Ch   |   17 Dec 2025 10:00 PM IST
సెవన్  సిస్టర్స్ ఇష్యూ సీరియస్... భారత్  కీలక స్టెప్!
X

ఇటీవల ఢాకాలోని భారత హైకమిషన్ కు బెదిరింపులు అందడం.. మరో వైపు ఈశాన్య రాష్ట్రాలను ప్రస్తావిస్తూ సెవెన్ సిస్టర్స్ ను కట్ చేస్తామంటూ ఒక నాయకుడు అవాకులు చెవాకులు పేలడం వంటి పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం ఒకటి తీసుకుంది. ఇందులో భాగంగా... తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్ ఎం రియాజ్ హమీదుల్లాకు భారత్ సమన్లు పంపింది.

అవును... బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లాకు భారత్ సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసిన 1971 పాకిస్థాన్ తో విముక్తి యుద్ధం 54వ వార్షికోత్సవం సందర్భంగా భారత్ మంగళవారం విజయ్ దివాస్ ను జరుపుకోగా.. బుధవారం ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు బంగ్లాదేశ్ లో ఎన్నికలకు ముందు భారత వ్యతిరేక వ్యాఖ్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమన్లు రావడం గమనార్హం.

పెరుగుతున్న భారత వ్యతిరేక వ్యాఖ్యలు!:

గత ఏడాది షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పాలన పతనం తర్వాత న్యూఢిల్లీతో బంగ్లాకు సంబంధాలు దెబ్బతిన్నాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో భారత్ పై వ్యతిరేక వ్యాఖ్యలు బంగ్లాలో రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీనికి హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

వాస్తవానికి ఇంకిలాబ్ మంచా తీవ్రవాద నాయకుడు, షేక్ హసీనా వ్యతిరేకి అయిన షరీఫ్ ఉస్మాన్ హదిపై గత వారం హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో భారత్ తో పాటు అవామీ లీగ్ కు సంబంధం ఉండవచ్చని ఆ సంస్థ ఆరోపిస్తోంది. ఈ సమయంలో జరిగిన ర్యాలీలోనే నేషనల్ సిటిజన్ పార్టీ నాయకుడు హస్నాత్ అబ్దుల్లా భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... బంగ్లాదేశ్ ను అస్థిరపరిస్తే సెవెన్ సిస్టర్స్ ను ఒంటరిగా చేసి, వేర్పాటువాదులకు ఆశ్రయం కల్పిస్తామని బెదిరించారు. బంగ్లాదేశ్ అస్థిరమైతే దాని ప్రతిఘటన అగ్ని సరిహద్దులు దాటి వ్యాపిస్తుందని చెప్పుకొచ్చారు. భారత్ పేరు చెప్పకుండానే.. 54 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా బంగ్లాదేశ్ తనపై నిత్యంత్రణ సాధించడానికి రాబంధులు చేసే ప్రయత్నాలను ఎదుర్కొంటోందని అన్నారు.

కాగా... ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మాట్లాడుతూ.. భారత్ ను ముక్కలు ముక్కలు చేయకపోతే ఢాకా పూర్తి శాంతిని చూడదని సూచించిన తర్వాత దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. మరోవైపు మాజీ చీఫ్ గులాం అజాం కుమారుడు రిటైర్డ్ జనరల్ అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ కూడా.. బంగ్లా లోపల భారత్ ఎల్లప్పుడూ అశాంతిని సజీవంగా ఉంచుతుందని ఆరోపించారు!

ఇటువంటి హాట్ హాట్ పరిణామాల నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్ ఎం రియాజ్ హమీదుల్లాకు భారత్ సమన్లు పంపింది. ఈ నేపథ్యంలో.. వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తిగా మారింది.