Begin typing your search above and press return to search.

క్యూ ఆర్ కోడ్ తో రోడ్డు బాగోతం బట్ట బయలు

వచ్చినా కానీ రోడ్లు బాగుపడేది ఉండదు. దీనికి ఎవరిని తిట్టుకోవాలి, ఎవరిని నిందించాలి అంటే జావాబు ఇపుడు మీ చేతుల్లనే అంటున్నారు.

By:  Satya P   |   30 Oct 2025 9:26 AM IST
క్యూ ఆర్ కోడ్ తో  రోడ్డు బాగోతం బట్ట బయలు
X
I

ఈ విధానం ఎంతో బాగుంది కదూ... ఊహించుకుంటేనే ఉత్సాహం వస్తోంది కదూ. ఈ దేశంలో రోడ్ల గురించి సగటు ప్రజలు ఎన్ని సార్లు తిట్టుకుని ఉంటారో లెక్క అయితే ఉండదు. పాలకులు పెద్దలు అంతా గగన విహారం చేస్తారు కాబట్టి వారికి రోడ్ల ఇబ్బందులు ఏవీ పెద్దగా తెలియవు. ప్రజల కోసం కోట్లు ఖర్చు పెట్టి రోడ్డేశామని అంటారు. కానీ తీరా ఒక్క భారీ వానకే అవి గుంతలు పడి జనాలను ఆ గుంతలోకి దింపుతాయి. మళ్లీ పుష్కరాలు వచ్చినా కానీ రోడ్లు బాగుపడేది ఉండదు. దీనికి ఎవరిని తిట్టుకోవాలి, ఎవరిని నిందించాలి అంటే జావాబు ఇపుడు మీ చేతుల్లనే అంటున్నారు.

నన్ను మాత్రం నిందించవద్దు :

ఈ మాటలు అన్నది కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. రోడ్లు బాగు లేకపోతే నన్ను నిందిస్తున్నారు, కానీ అది తప్పు నేనే ఎందుకు నిందలు పడాలి అని ఆయన ఢిల్లీలో జరిగిన స్మార్ట్ రోడ్ల భద్రత అన్న ఒక కార్యక్రమంలో సరదాగా వ్యాఖ్యానించారు. మంచి రోడ్లు కావాలంటే పౌర భాగస్వామ్యమూ అవసరం అని ఆయన అన్నారు. ఇక మీదట దేశంలో అన్ని ప్రధాన రహదారుల లో వేసే రోడ్లకు క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ విధానం ప్రవేశపెట్టాలని ఆయన స్వయంగా ప్రతిపాదించారు. ఈ విధానం వల్ల పౌరులకే ఎక్కువగా మేలు జరుగుతుందని అన్నారు.

వివరాలు అన్నీ ఓపెన్ :

ఈ స్కానింగ్ చేయగానే ఆ రోడ్డు ప్రాజెక్ట్ కోసం పనిచేసిన ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఆ రోడ్డు నిర్మాణానికి మంజూరు చేసిన బడ్జెట్, గడువు, నిర్వహణ వంటి అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయని అన్నారు. అంతే కాదు ఆ రోడ్డుని మంజూరు చేసిన మంత్రి ఎవరు అన్నది కూడా తెలుస్తుంది అన్నారు. ఇలా మొత్తం వారి వివరాలు ఫోన్ నంబర్లు ఫోటోలతో సహా ప్రజలకు మొత్తం తెలుస్తుందని అన్నారు. దాంతో ఆయా రోడ్ల విషయంలో సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా వారికే ఆయా అధికారులను ఇతరులను ప్రశ్నించేందుకు వీలు ఉంటుంది అని అన్నారు.

భలే ఐడియా :

భారత దేశంలోని ఒక రోడ్డు జీవిత కాలం కనీసంగా అయిదేళ్ళు అని చెబుతారు. ఎంతో నాణ్యతగా వేసినా కూడా ఆ గడువు పూర్తి అవగానే అవి చిద్రం అవుతాయి. మళ్ళీ కొత్తగా రోడ్డు వేయాల్సిందే. అయితే ఇటీవల కాలంలో చూస్తే ఒక రోడ్డు వేసి పట్టుమని ఏడాది కూడా పూర్తి కాకుండానే పాడైపోతోంది. ఎటు చూసినా రోడ్లు బీటలు వారుతూ గొయ్యిలు గుంతలతో దర్శనం ఇస్తోంది. దానికి కారణం నాసిరకం పనితనం. మరి ఆ రోడ్డుకు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు, ఎంత బడ్జెట్ కేటాయించి ఉంటారు, ఆ రోడ్డుని వేసిన కాంట్రాక్టర్ ఎవరు, పర్యవేక్షించిన ఇంజనీర్లు అధికారులు ఎవరూ ఇలాంటివి కనుక సగటు ప్రజలకు తెలిస్తే వారు కచ్చితంగా నిలదీసే అవకాశం ఉంటుంది. అంతే కాదు ఈ రకంగా తన ఫోటోలతో సహా వివరాలు అన్నీ బయటకు వస్తాయన్న భయం ఉంటే రోడ్లు వేసే వారూ పర్యవేక్షించేవరూ కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటారు, జాగ్రత్త పడతారు. అపుడే స్మార్ట్ రోడ్లు దేశంలో కనిపిస్తాయి. కేంద్ర మంత్రి గడ్కరీ ఆలోచనలు అయితే భేష్ అని చెప్పాలి, మరి ఇది అమలులోకి తెస్తే ఇంకా మెచ్చి శభాష్ అని జై కొట్టాలి. ఆ రోజు రావాలని అంతా కోరుకోవాల్సిందే.