మైనస్ 45 డిగ్రీల చలిలో.. ఎవరీ 'శౌర్య కమాండోలు'..చైనాకు ఎందుకు చుక్కలు చూపిస్తున్నారు.?
అత్యంత ప్రతికూల వాతావరణం... ఊపిరి తీసుకోవడమే కష్టమయ్యే 19 వేల అడుగుల ఎత్తు... హిమపాతాలు, శూన్యానికి పడిపోయే ఉష్ణోగ్రతలు... ఒకవైపు ప్రకృతే శత్రువులా దాడి చేస్తుంటే మరోవైపు సరిహద్దు వెంబడి చైనా కుతంత్రాలు..
By: A.N.Kumar | 25 Oct 2026 2:48 PM ISTఅత్యంత ప్రతికూల వాతావరణం... ఊపిరి తీసుకోవడమే కష్టమయ్యే 19 వేల అడుగుల ఎత్తు... హిమపాతాలు, శూన్యానికి పడిపోయే ఉష్ణోగ్రతలు... ఒకవైపు ప్రకృతే శత్రువులా దాడి చేస్తుంటే మరోవైపు సరిహద్దు వెంబడి చైనా కుతంత్రాలు.. ఇలాంటి నరకప్రాయమైన పరిస్థితులలోనూ రక్తం గడ్డకట్టే మైనస్ 45 డిగ్రీల చలిలో శత్రువు గుండెల్లో నిద్రపోతున్న వీరులే ‘శౌర్య కమాండోలు’.
ఇటీవల ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) చీఫ్ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో ఈ కమాండోలు చూపుతున్న ప్రతాపాన్ని చైనాకు వారు చూపిస్తున్న చుక్కలను వెల్లడించడంతో దేశమంతటా ఇప్పుడు "ఎవరీ శౌర్య కమాండోలు?" అనే చర్చ ఆసక్తికరంగా మారింది.
గల్వాన్ ఘర్షణే ఈ ‘శౌర్య’ విభాగానికి మూలం
2020లో గల్వాన్ లోయలో చైనా సైనికుల దురాక్రమణ యత్నాలు, తదనంతర పరిణామాల తర్వాత భారత సరిహద్దు భద్రతలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఎత్తైన పర్వత ప్రాంతాలు, విపరీతమైన మంచు కురిసే ప్రదేశాలలో చైనా బలగాల అకస్మిక దాడులను తక్షణమే తిప్పికొట్టేందుకు ఒక ప్రత్యేక శక్తివంతమైన దళం అవసరమని భారత భద్రతా సంస్థలు భావించాయి. అందులోంచి రూపుదిద్దుకున్నదే ఐటీబీపీకి చెందిన ఈ ప్రత్యేక విభాగం ‘శౌర్య కమాండో దళం’.
మైనస్ 45 డిగ్రీల చలిలో గడ్డకట్టే వీరత్వం
సముద్ర మట్టానికి 9,000 అడుగుల నుండి 19,000 అడుగుల ఎత్తులోని అత్యంత ప్రమాదకరమైన శిఖరాలపై వీరు నిరంతరం గస్తీ కాస్తారు. కొండలు ఎక్కడం , మంచులో మార్షల్ ఆర్ట్స్ , అత్యంత వేగంగా వ్యూహాత్మక దాడులు చేయడం, మైనస్ 45 డిగ్రీల చలి వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేసుకోవడం వంటి కఠినమైన ట్రైనింగ్‌ను వీరు పూర్తి చేస్తారు. అత్యాధునిక రాత్రి వేళ చూసే నైట్-విజన్ పరికరాలు, కఠిన శీతల వాతావరణానికి తట్టుకునే తేలికపాటి ఆయుధాలు వీరి సొంతం.
చైనాకు శౌర్య కమాండోలు ఎందుకు చుక్కలు చూపిస్తున్నారు?
ఒకప్పుడు ప్రతికూల వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని చైనా సైన్యం (పీఎల్ఏ) సరిహద్దుల్లో చొరబాట్లకు యత్నించేది. కానీ శౌర్య కమాండోల రాకతో ఆ పరిస్థితి తలకిందులైంది. ఎలాంటి మంచు తుఫానులోనైనా ఈ కమాండోలు పహారా కాస్తుండడంతో చైనా బలగాలు వెనక్కి తగ్గక తప్పడం లేదు. చైనా సరిహద్దుల్లో చిన్నపాటి కదలిక కనిపించినా కొద్ది నిమిషాల్లోనే కౌంటర్ అటాక్ ఇచ్చే సామర్థ్యం శౌర్య కమాండోల సొంతం. ప్రతికూల వాతావరణం తట్టుకోలేక చైనా సైనికులు తరచూ ఇబ్బందులు పడుతుంటే.. శౌర్య కమాండోలు మాత్రం మైనస్ డిగ్రీలలోనూ సింహాల్లా కదలాడడం చైనా బలగాలలో మానసిక భయాన్ని కలిగిస్తోంది.
సరిహద్దుకు తిరుగులేని ‘ఉక్కు గోడ’
హిమాలయాల మంచు చలిలో దేశ ప్రజలందరూ హాయిగా నిద్రపోతున్న వేళ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సరిహద్దును కాపాడుతున్న శౌర్య కమాండోలు భారత రక్షణ రంగానికి కొండంత అండ. అరుణాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు సరిహద్దు వెంబడి శౌర్య కమాండోలు నిలబడి ఉన్నంత కాలం... చైనా ఆటలు ఇక సాగవనేది స్పష్టమవుతోంది.
