Begin typing your search above and press return to search.

మోదీ సీషెల్స్ ఎందుకు వెళ్లినట్టు.? దీని వెనుక ప్లాన్ ఏంటి?

1981లో ఇందిరా గాంధీ పర్యటన ద్వారా పడిన బలమైన పునాది, 2015 ప్రస్తుత మోదీ పర్యటనలతో మరింత విస్తృతమైంది. అయితే అంతర్జాతీయ వ్యూహాలు నిరంతరం మారుతుంటాయి.

By:  A.N.Kumar   |   28 Jun 2026 11:02 AM IST
మోదీ సీషెల్స్ ఎందుకు వెళ్లినట్టు.? దీని వెనుక ప్లాన్ ఏంటి?
X

ప్రపంచ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతున్న వేళ, హిందూ మహాసముద్రం అంతర్జాతీయ అగ్రరాజ్యాల వ్యూహాత్మక పోటీకి ప్రధాన వేదికగా మారింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ద్వీప దేశమైన సీ షెల్స్‌లో జరుపుతున్న మూడు రోజుల పర్యటన కేవలం ఒక దౌత్యపరమైన ముందడుగు మాత్రమే కాదు.. అది హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత వ్యూహాత్మక సార్వభౌమత్వాన్ని చాటిచెప్పే బలమైన సంకేతం. సీ షెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు, అలాగే భారత్-సీ షెల్స్ దౌత్య సంబంధాల సువర్ణోత్సవానికి ఈ పర్యటన వేదిక కావడం భౌగోళిక రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

భౌగోళికంగా సీ షెల్స్ కేవలం లక్షా నలభై వేల జనాభా కలిగిన చిన్న దేశమే కావచ్చు, కానీ దాని వ్యూహాత్మక స్థానం అపారమైనది. 115 ద్వీపాల సమూహంతో దాదాపు 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక సముద్ర ప్రాంతాన్ని కలిగి ఉన్న ఈ దేశం, ఆఫ్రికా సముద్ర వాణిజ్య మార్గాలకు ఒక ప్రధాన ద్వారంగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో చైనా తన ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ వ్యూహంతోనూ వివిధ రేవుల నిర్మాణాల ద్వారా హిందూ మహాసముద్రంలో భారత్‌ను చుట్టుముట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో ఇలాంటి పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా చైనా ప్రాబల్యానికి సమర్థవంతమైన ‘చెక్’ పెట్టడం న్యూఢిల్లీకి అత్యంత అవసరం.

‘సాగర్’ విజన్.. పరస్పర నమ్మకం

భారతదేశం ఎల్లప్పుడూ తన సముద్ర సరిహద్దు దేశాల భద్రత ప్రగతిని కాంక్షిస్తూ సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ ) , 'మహాసాగర్' వంటి దార్శనిక విధానాలను అమలు చేస్తోంది. ప్రధాని మోదీ ప్రస్తుత పర్యటన ఈ విధానాలకు మరింత ఊతాన్ని ఇస్తుంది. రక్షణ, సముద్ర భద్రత, బ్లూ ఎకానమీ సముద్ర వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ మౌలిక వసతుల రంగాల్లో కుదురుతున్న ఒప్పందాలు ఇరు దేశాల బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లనున్నాయి. ముఖ్యంగా సీ షెల్స్ రక్షణ సామర్థ్యాన్ని పెంచేందుకు భారత్ అందించనున్న అత్యాధునిక గస్తీ నౌక, సముద్రపు దొంగల నిరోధానికి, ఉమ్మడి నిఘా వ్యవస్థకు ఎంతో దోహదపడుతుంది.

సవాళ్లు - భవిష్యత్తు కార్యాచరణ

1981లో ఇందిరా గాంధీ పర్యటన ద్వారా పడిన బలమైన పునాది, 2015 ప్రస్తుత మోదీ పర్యటనలతో మరింత విస్తృతమైంది. అయితే అంతర్జాతీయ వ్యూహాలు నిరంతరం మారుతుంటాయి. చిన్న ద్వీప దేశాలు అగ్రరాజ్యాల పోటీలో చిక్కుకోకుండా తమ స్వతంత్ర ఆర్థిక ప్రయోజనాలను ఆశిస్తాయి. కాబట్టి భారత్ కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా.. సీ షెల్స్‌లో సాంకేతిక విప్లవానికి సహకరించడం... పర్యావరణ మార్పుల వల్ల మునిగిపోయే ప్రమాదమున్న ద్వీప దేశాలకు అండగా నిలవడం... చిన్నతరహా పరిశ్రమలు, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను పెంచడం..

హిందూ మహాసముద్రం ఎవరి అత్తసొమ్మూ కాదు, అది శాంతికి, అంతర్జాతీయ వాణిజ్యానికి ఉమ్మడి వేదిక కావాలనేది భారత్ ఆకాంక్ష. సీ షెల్స్‌తో భారత్ బలోపేతం చేసుకుంటున్న ఈ బంధం, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. హిందూ మహాసముద్రంలో భారత్ కేవలం ‘రక్షకుడు’ మాత్రమే కాదు.. నమ్మకమైన భాగస్వామి అని ఈ పర్యటన మరోసారి నిరూపిస్తోంది.