ఊకోవయ్యా ట్రంప్.. షాకిచ్చిన భారత్
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
By: A.N.Kumar | 2 Aug 2025 12:01 PM ISTరష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. భారత్ రష్యా నుంచి చమురు కొనడం నిలిపేసిందని విన్నానని, అది నిజమైతే మంచి నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. "ఇది నిజమా కాదా నాకు తెలియదు. కానీ నిజమైతే అది మంచి నిర్ణయమే. దానివల్ల ఏం జరుగుతుందో చూద్దాం" అని ట్రంప్ అన్నారు.
ఇకపై భారత్ రష్యా ఆయిల్‌ను కొనదన్న వాదనపై ట్రంప్ స్పందించిన వేళ భారత ప్రభుత్వ వర్గాలు ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాయి. ‘‘భారత చమురు సంస్థలు రష్యా సరఫరాదారుల నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి. ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, ఆర్థిక ప్రామాణికత వంటి అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాం. 85 శాతం ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్న భారత్ వంటి దేశానికి అందుబాటు ధరలో లభించే క్రూడ్ ఆయిల్ కీలకం. దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా, గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటాం’’ అని స్పష్టం చేశారు.
-ట్రంప్, అమెరికా అసంతృప్తికి కారణమేంటి?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా, రష్యాపై ఆంక్షలు విధించాయి. అయితే భారత్ ఆ ఆంక్షలకు కట్టుబడి ఉండకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంపై ట్రంప్‌తో పాటు పలువురు అమెరికా నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో సైతం "భారత్ రష్యా చమురును కొనుగోలు చేయడం వల్లే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని కొనసాగించగలుగుతోంది" అంటూ వ్యాఖ్యానించారు.
-భారత్ కౌంటర్ స్పష్టత
అయితే, ఈ విమర్శలకు భారత విదేశాంగ శాఖ సూటిగా స్పందించింది. ‘‘రష్యా నుంచి చమురు కొనుగోలుకు మేము కట్టుబడి ఉన్నాం. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న, అత్యుత్తమమైన ధరలో లభించే వనరులను వినియోగించుకోవడం దేశ ప్రయోజనాలను కాపాడుకునే దిశలో ముఖ్యమైన చర్య. ఇది అంతర్జాతీయ ఇంధన స్థిరత్వానికి కూడా సానుకూలంగా ఉంటుంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు.
రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ తీసుకుంటున్న వైఖరి పూర్తిగా దేశ ప్రయోజనాలకే కట్టుబడి ఉందని కేంద్రం స్పష్టం చేస్తోంది. ట్రంప్ లాంటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలకూ, అమెరికా నేతల విమర్శలకూ తగిన జవాబునిస్తూ... భారత్ తన స్వతంత్ర ప్రతిపత్తిని కొనసాగిస్తోందన్నది స్పష్టమవుతోంది.
