భారత్-అమెరికా-రష్యా.. చమురు వివాదంలో తప్పెవరిది?
రష్యా నుండి చమురు కొనుగోలుపై అమెరికా పెడుతున్న ఒత్తిడి, ఆంక్షలను భారత్ గట్టిగా తిప్పికొడుతోంది.
By: A.N.Kumar | 25 Aug 2025 2:00 PM ISTరష్యా నుండి చమురు కొనుగోలుపై అమెరికా పెడుతున్న ఒత్తిడి, ఆంక్షలను భారత్ గట్టిగా తిప్పికొడుతోంది. ఈ అంశంపై భారత రాయబారి వినయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు.. విదేశాంగ మంత్రి జైశంకర్ సంకేతాలు, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తున్నాయి. ఈ వివాదం కేవలం ఆర్థిక అంశమే కాదు, పెరుగుతున్న భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కూడా చాటి చెబుతోంది.
- దేశ ప్రయోజనాలే ప్రథమం
భారత రాయబారి వినయ్ కుమార్.. 140 కోట్ల మంది ప్రజలకు చౌకగా, స్థిరంగా ఇంధనం అందించడం న్యూఢిల్లీ యొక్క మొదటి కర్తవ్యమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ విమర్శల కంటే ప్రజల ఇంధన భద్రతే ముఖ్యమని భారత్ వైఖరి వెల్లడించింది. దీనికి అనుగుణంగా చౌకగా లభించే రష్యా చమురును కొనుగోలు చేయడం భారత్‌కు ఒక ఆచరణాత్మక ఎంపికగా మారింది.
- రష్యా చమురు కొనుగోలు అవసరం
రష్యాతో భారత్ వాణిజ్యం కొనసాగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక స్థాయిలో నిలిచిపోయాయని వినయ్ కుమార్ అన్నారు. ఇది రష్యా-భారత్ సహకారం ప్రపంచ ఇంధన స్థిరత్వానికి కూడా దోహదపడుతోందని న్యూఢిల్లీ వాదన. ఈ చర్య గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో ఒక అనిశ్చితిని నివారించడంలో సహాయపడుతుంది.
- అమెరికా ద్వంద్వ వైఖరిపై విమర్శ
అమెరికా - యూరప్ దేశాలు కూడా రష్యాతో వాణిజ్యం చేస్తూనే ఉన్నాయని, కానీ కేవలం భారత్‌పై మాత్రమే ఒత్తిడి చేయడం "అహేతుకం, అన్యాయం" అని రాయబారి వ్యాఖ్యానించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. "భారత్ చమురు కొనుగోలు చేస్తే మీకు ఇబ్బంది ఉంటే, మా వస్తువులు కూడా మీరు కొనకపోవచ్చు" అన్న ఆయన వ్యాఖ్యలు వాషింగ్టన్‌కు ఒక గట్టి సందేశాన్ని పంపాయి.
- భవిష్యత్తు ప్రభావాలు
ఈ వివాదం భవిష్యత్తులో పలు మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ఈ వివాదం భారత్-రష్యా మధ్య ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగినా, ఇరు దేశాలు పూర్తిగా విడిపోవడం అసాధ్యం. అయితే, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విషయంలో భారత్ తన వైఖరిని కొనసాగించే అవకాశం ఉంది. ఈ సంఘటనలు అంతర్జాతీయ ఇంధన రాజకీయాలలో భారత్ ఒక కీలక పాత్ర పోషించబోతోందని స్పష్టం చేస్తున్నాయి. భారత్ తన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని, సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.
మొత్తానికి "భారత్ ఎక్కడ ఉత్తమమైన ఒప్పందం ఉంటే అక్కడి నుంచే చమురు కొనుగోలు చేస్తుంది" అన్న వినయ్ కుమార్ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలపై రాజీ లేని వైఖరిని స్పష్టంగా చాటి చెబుతున్నాయి.భారత్-అమెరికా-రష్యా.. చమురు వివాదంలో తప్పు ఖచ్చితంగా అమెరికాదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో జేడీ వాన్స్ అమెరికా ప్రభుత్వ పెద్దలు ఎంత కవర్ చేసినా ఆ దేశ మాజీలు, మేధావులు సైతం ట్రంప్ భారత్ పై సుంకాలు వేయడం పెద్ద తప్పు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా ఓ మంచి మిత్రదేశాన్ని కోల్పోయిందని చెబుతున్నారు.
