భారత్ కు రష్యా సహజ స్నేహితుడు.. ఇది చరిత్ర చెప్పే సాక్ష్యం
స్నేహాల్లో అనేక రకాలు.. బాల్య స్నేహం.. విద్యార్థి స్నేహం.. ఉద్యోగ స్నేహం.. అవసరం కోసం స్నేహం...! వ్యక్తుల మధ్య అయితే ఇలా చెప్పుకొంటాం..! ఇక దేశల మధ్య సహజ స్నేహం ఉంటుంది.
By: Tupaki Political Desk | 5 Dec 2025 2:06 PM ISTస్నేహాల్లో అనేక రకాలు.. బాల్య స్నేహం.. విద్యార్థి స్నేహం.. ఉద్యోగ స్నేహం.. అవసరం కోసం స్నేహం...! వ్యక్తుల మధ్య అయితే ఇలా చెప్పుకొంటాం..! ఇక దేశల మధ్య సహజ స్నేహం ఉంటుంది. లేదంటే అవసరం కోసం స్నేహం ఏర్పడుతుంది. ఇలా చరిత్రలో సహజ మిత్రులు అంటే.. భారత్-రష్యా అనిచెప్పొచ్చు. అందుకే ఇరు దేశాల స్నేహాన్ని కాల పరీక్షలకు నిలిచినదిగా చెబుతుంటారు. ఒకప్పటి సోవియట్ యూనియన్ కాని.. ఇప్పటి రష్యా కాని.. భారత కు విడదీయరాని సంబంధం. చరిత్రలో ఎన్ని మార్పులు జరిగినా, ఎందరు మధ్యలో వచ్చి పుల్లలు పెట్టాలని చూసినా.. భారత్-రష్యా బంధం మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది.
శ్రీశ్రీ కవిత్వం.. రాజ్ కపూర్ రూసీ టోపీ
గర్జించు రష్యా గాండ్రించు రష్యా.. ఓ రష్యా నా రష్యా అంటూ మహా కవి శ్రీశ్రీ కలం నుంచి వెలువడిన కవిత్వం రష్యాతో భారత్ కు ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని చాటుతుంది. అంతేకాదు.. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ సినిమాలకు రష్యాలో విపరీతమైన ఆరాధన. ఆయన సినిమా శ్రీ420లోనూ శిర్ పే లాల్ టోపీ (నా తలపై ఎర్రటి రష్యా టోపీ) అంటూ పాటలో ఉంటుంది. కమ్యూనిస్టు దేశమైన నాటి సోవియట్ యూనియన్ సాహిత్యం భారత్ లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇక భారతీయులు అన్నా రష్యన్లకు ప్రత్యేకమైన అభిమానం ఉందని చెబుతుంటారు.
పుతిన్ కు ముందు.. పుతిన్ సమయంలో..
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు భారత్ లో ఉన్నారు. ఈయనకు ముందు లెనిన్, స్టాలిన్, గోర్బచెవ్ వంటి వారు (సోవియట్ రష్యా) అధ్యక్షులుగా ఉన్నారు. నాడు భారత్ తో ఏర్పడిన స్నేహం పుతిన్ హయాంలోనూ కొనసాగుతోంది. అయితే, 2000 సంవత్సరం సమయానికి కొంత స్తబ్ధత నెలకొంది. రష్యా బలహీనపడడం, అమెరికాతో టెక్ సంబంధాలు ఏర్పడడమే దీనికి కారణం. మధ్యలో రష్యాకు పాకిస్థాన్ దగ్గరైంది. అయినా అది ఎక్కువ కాలం సాగలేదు. మళ్లీ ఇప్పుడు భారత్-రష్యా సంబంధాలు గాడినపడ్డాయి. డొనాల్డ్ ట్రంప్ పుణ్యమాని భారత్-రష్యా మరింత దగ్గరవుతున్నాయి.
సబ్ మెరైన్ ను పంపి.. భారత్ ను గెలిపించి..
భారత్ అత్యధికంగా ఆయుధాలు కొనేది రష్యా నుంచే. భారత్ -పాక్ మధ్య జరిగిన 1971 యుద్ధంలో పాక్ కు అమెరికా మద్దతుగా నిలిచింది. చైనా కూడా ఇంతే వ్యవహరించింది. కానీ, అప్పటి సోవియట్ యూనియన్ మాత్రం భారత్ కు అండగా నిలిచింది. ఏకంగా బంగాళాఖాతంలో సబ్ మెరైన్ ను మోహరించింది. దీంతో అమెరికా బలం చూసుకుని భారత్ పైకి కాలుదువ్వుతున్న పాక్ తో పాటు అమెరికా కూడా తోకముడిచాయి. అయితే, రష్యాకు చైనా కూడా చాలా దగ్గర. పైగా ఆ రెండు దేశాలకు సుదీర్ఘ సరిహద్దు ఉంది. కానీ, పుతిన్ మాత్రం 25 ఏళ్లలో భారత్ కు ఎన్నడూ వ్యతిరేకంగా లేరు. 2012లో ఆయనను అప్పటి ప్రధాని మన్మోహన్.. భారత్ కు నిజమైన మిత్రుడిగా అభివర్ణించారు.
