గంగా-కావేరి అనుసంధానంతో భారత్ అన్ స్టాపబుల్
అదే తరహాలో గోదావరి కావేరి అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరతాయని చంద్రబాబు అన్నారు.
By: Satya P | 26 Jun 2026 12:11 AM ISTఉత్తరాన గంగ దక్షిణాన కావేరి. ఈ రెండు నదుల కలయిక అన్నది ఒక అద్భుతం. నిజంగా ఇది ప్రకృతి కాంత పరవశించే సందర్భం అవుతుంది. నేల తల్లి దాహార్తిని తీర్చేందుకు పుట్టినవి నదులు. అవి పరచుకున్నంత మేర పచ్చగా భూమి చీర కడుతుంది. దుర్భిక్షం అన్న మాటకు తావు ఉండదు. ప్రజలు కూడా హాయిగా ఉంటారు. సాగు తాగు నీరుకు కొరత ఉండదు, ఆకాశం వైపు వాన చినుకు కోసం చూడాల్సిన అవసరం అంతకంటే లేదు. భారత్ స్వభావరీత్యా వ్యవసాయిక దేశం. పారిశ్రామిక అభివృద్ధి సాంకేతికత భారత్ కి అదనపు హంగులు, సరికొత్త ఆదాయ మార్గాలు. కానీ అవి పురోగమించే దశలో ఎక్కడైనా ఇబ్బందులు వచ్చి పాత వెనకకు పోయి ఏఐ లాంటి విప్లవాలు రావచ్చు. కానీ ఎప్పటికి క్షేమంగా ఉండేది మాత్రం జై కిసాన్ నినాదమే.
కావలసినంత నీరు :
ఈ దేశంలో కావలసినంత నీరు ఉంది. జీవనదులుగా గంగా గోదావరి క్రిష్ణ, కావేరి తుంగబధ్ర వంటివి ఉన్నాయి. ఈ నదులను అనుసంధానం చేయడం అన్నది దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వినిపిస్తున్న మాట. మరి ఆచరణలో ఎందుకో అమలు కావడం లేదు. పారే నదికి అడ్డుకట్ట వేయరాదు. ప్రాంతీయత సంకుచితత్వం నదులకు లేదు, అవి అందరివిగా ఉంటాయి. అలాంటి జీవ జలాలను ఇంతకు ఇంత పోగు చేసి కలిపి కట్టి దేశమంతా పారిస్తే భారత్ అభివృద్ధిలో అగ్ర తాంబూలం అందుకుంటుంది అనడంలో సందేహం అయితే లేదు. అందుకే దేశంలో అనేక సార్లు నదుల అనుసంధానం అన్న మాట గట్టిగా వినిపించింది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఈ మాట మీద చర్చ జరిగింది.
మరోసారి బాబు నోట :
ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నదుల అనుసంధానం గురించి ఘనంగా ప్రస్తావించారు. ఆయన భారత్ ప్రగతి దారుల గురించి మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో తుంగభద్ర నది గేట్ల పునరుద్ధరణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోసపేట బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్‌కు నదుల అనుసంధానం అవసరం అని గట్టిగా చెప్పారు. కెన్–బేత్వా ప్రాజెక్టు ద్వారా ఉత్తర భారతదేశంలో నదుల అనుసంధానం విజయవంతంగా అమలవుతోందని గుర్తు చేశారు.
గోదావరి కావేరీ :
అదే తరహాలో గోదావరి కావేరి అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరతాయని చంద్రబాబు అన్నారు. 1983లో అప్పటి ప్రధానితో పాటు నలుగురు ముఖ్యమంత్రులు కలిసి తమిళనాడుకు అయిదు టీఎంసీల నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారని బాబు తెలిపారు. ఆ విధంగా ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర అంగీకారంతో చెన్నైకి 15 టీఎంసీల తాగు నీటిని అందించామని గుర్తు చేశారు. అంతే కాదు దేశంలోనూ గంగా- కావేరీ నదుల అనుసంధానం జరిగితే భారత్ అభివృద్ధి అన్ స్టాపబుల్ అని చంద్రబాబు వ్యాఖ్యానించచడం విశేషం.
రైతుల సంక్షేమం కోసం :
ఇదిలా ఉంటే రాష్ట్రాలు వేరైనా దేశంగా మనమంతా ఒక్కటేనని చంద్రబాబు చెప్పారు. రైతుల సంక్షేమం కోసం అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల రైతులకు సాగునీటిని ప్రజలకు తాగు నీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యామ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని చంద్రబాబు చెప్పారు. తుంగభద్ర నది చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను గుర్తుచేశారు. విజయనగర సామ్రాజ్యానికి హంపీకి తుంగభద్ర నది సహజ రక్షణ కవచంగా నిలిచిందన్నారు. జోగులాంబ ఆలయం హంపీ విరూపాక్ష ఆలయం, మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం వంటి పుణ్యక్షేత్రాలు ఈ నదీ తీరానే వెలిశాయని చంద్రబాబు చెప్పారు.
నీటి వనరుల్ని పొదుపుగానే :
దేశంలో ఎల్‌నినో ప్రభావంతో జలాశయాలకు నీటి ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ముందుగా రాష్ట్రాలు అంతర్గతంగా నదుల అనుసంధానం చేపట్టి ఆ తర్వాత రాష్ట్రాల మధ్య అనుసంధానానికి అడుగులు వేయాలని కూడా బాబు సూచించడం విశేషం.
