దేశంలో కొత్త 'ఇన్‌కం ట్యాక్స్' బిల్లు.. ఎవరికి లాభం?
అయితే.. అదేసమయంలో ఎన్నికల సంఘం అవకతవకలపై పోరాటం పేరుతో విపక్ష ఎంపీలు సభను వదిలి బయటకు వచ్చారు. ఈసమయంలోనే ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును ఆమోదించారు.
By: Garuda Media | 12 Aug 2025 12:05 AM ISTదేశంలో ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను (ఇన్ కం ట్యాక్స్) బిల్లు స్థానంలో కొత్త ఆదాయపన్ను బిల్లును తీసుకువస్తూ.. కేంద్రం తెచ్చిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. సోమవారం ఈ బిల్లును లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. అయితే.. అదేసమయంలో ఎన్నికల సంఘం అవకతవకలపై పోరాటం పేరుతో విపక్ష ఎంపీలు సభను వదిలి బయటకు వచ్చారు. ఈసమయంలోనే ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును ఆమోదించారు.
వాస్తవానికి ఈ బిల్లును ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టారు. అయితే.. అప్ప ట్లో విపక్షాలు కొన్ని సూచనలు, మార్పులు సూచించాయి. దీంతో దీనిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపించారు. అనంతరం.. మార్పులు చేర్పులతో తాజాగా బిల్లును తీసుకువచ్చారు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీనిపై మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 1961 నాటి చట్టాన్ని మార్పు చేస్తూ.. ఉద్యోగులకు మేలు చేసేలా ఈ బిల్లు ఉంటుందన్నారు.
అనంతరం రాజ్యసభకు ఈ బిల్లు చేరనుంది. మంగళవారం దీనిపై పెద్దలసభలో చర్చ అనంతరం.. బిల్లును ఆమోదించనున్నారు. ఆ తర్వాత.. రాష్ట్రపతి ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారనుంది. దీనిపై సుదీర్ఘ కసరత్తు చేసినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. వారి కష్టానికి మరింత విలువ పెరుగుతుందని.. ప్రతి రూపాయినీ భద్రంగా చూసుకునే వెసులుబాటు ఈ బిల్లు కల్పిస్తుందన్నారు.
ఎవరికి లాభం?
+ పాత ఆదాయపన్నులో వివిధ ట్యాక్స్ డిడిక్షన్లను చూపించారు. దీనిలో అన్నీ ఒకేచోట ఉన్నాయి.
+ గతంలో 80సీ, 80డీ కింద.. పలు ఎగ్జంప్షన్లను ఇచ్చారు. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒకే ఎగ్జంప్షన్ పరిధిలోకి తెచ్చారు.
+ అందరికీ సామూహికంగా 750000 రూపాయల వరకు ఎగ్జంప్షన్ లభిస్తుంది.
+ గతంలో 250000 వరకు మినహాయింపు ఉంటే.. దీనిలో వివిధ రకాల రాయితీలు ఇచ్చేవారు.
+ పన్ను శ్లాబుల్లో తొలుత మార్పులు సూచించారు. కానీ, అభ్యంతరం తర్వాత.. వాటిని తొలగించారు.
+ ఒకరకంగా కొత్త బిల్లులో ఏకమొత్తంగా మినహాయింపులు ఇచ్చారు తప్ప.. ప్రత్యేకంగా మినహాయింపులు లేవు.
