ఈ బెదిరింపులకు బెదిరిపోవాలా? భారత జెన్ జీ ధర్మాగ్రహం
ఏ దేశమైనా.. ఆ దేశాన్ని పాలించే పెద్ద మనిషికి ఉండే లక్షణం.. తాను పాలించే దేశం సుభిక్షంగా ఉండాలి.
By: Garuda Media | 8 Aug 2025 10:26 AM ISTఏ దేశమైనా.. ఆ దేశాన్ని పాలించే పెద్ద మనిషికి ఉండే లక్షణం.. తాను పాలించే దేశం సుభిక్షంగా ఉండాలి. వీలైతే సూపర్ పవర్ లా ఉండాలనుకోవటం. అందుకోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటారు. మరి.. సూపర్ పవర్ దేశానికి అధినేతగా ఉన్న వ్యక్తి ఆలోచనలు ఎలా ఉండాలి? సూపర్ పవర్ ఇమేజ్ ను కాపాడుకోవటంతో పాటు.. భవిష్యత్తులోనూ ఆ ఇమేజ్ కు.. ఆ దేశానికి ఉన్న బలమైన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని.
కానీ.. అగ్రరాజ్య అధినేత ట్రంప్ ఇప్పుడు చేస్తున్నదేంటి? సూపర్ పవర్ గా ఉన్న అమెరికాకు.. రైజింగ్ ఎగైన్ అమెరికా అన్న ఒక దిక్కుమాలిన నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి ప్రపంచ దేశాల మీద తనకున్న బలాన్ని ప్రదర్శించే అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రపంచం ఎంతమంది నియంతల్ని చూసింది. ఎంతటి తోపు పాలకుడైనా.. అతడికి పరిమితమైన జీవితకాలం ఉంటుందన్నది మర్చిపోకూడదు. వందల ఏళ్ల క్రితం ప్రపంచాన్ని ఏలిన ఇంగ్లాండ్ నేటి పరిస్థితి ఏమిటి?
కాలంతో పాటు మార్పు అనివార్యం. తనకు మించిన తోపు లేదని విర్రవీగిన ప్రతిసారీ.. ఒక కొత్త శక్తి తెర మీదకు రావటం.. అహంకారాన్ని ప్రదర్శించే వాడికి చుక్కలు చూపించటం జరుగుతూనే ఉంది. ప్రపంచంలో శాశ్వతంగా తిరుగులేని శక్తి అనే భావన తప్పు అన్న విషయాన్ని చరిత్ర ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. అహంకారానికి ప్రత్యుత్తరంగా ప్రజల ఆత్మగౌరవం, దేశాల స్వాభిమానం ఎలా స్పందించాలో భారత్ ఇప్పటికే చూపిస్తోంది. ఇది ప్రపంచ దేశాలకు కొత్త స్ఫూర్తిని ఇస్తుందని చెప్పక తప్పదు.
ఇప్పుడు ట్రంప్ కు.. అతడ్ని అభిమానించి.. నెత్తిన పెట్టుకునే అమెరికాకు రోజులు దాపురించాయా? అన్నది ఇప్పుడు చర్చ. ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచంలో తిరుగులేని శక్తి అమెరికా. దాన్ని కాదనే ప్రసక్తే లేదు. అలా అని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం.. మా మాట వినని వారి సంగతి చూస్తామని బెదిరింపులకు దిగితే.. తగిన సమాధానం ఇవ్వాల్సిందే. ఆ సందర్భంగా కొంత నష్టాన్ని భరించటానికి సైతం సిద్ధంగా ఉండాల్సిందే.
ఇక్కడే కొన్ని గణాంకాల్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. భారత్ - అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 191 బిలియన్ డాలర్లు. అమెరికాకు భారత్ ఎగుమతులు 118 బిలియన్ డాలర్లు. అదే సమయంలో అమెరికా నుంచి భారత్ కు దిగుమతులు 73 బిలియన్ డాలర్లు. ఈ అంకెలు ట్రంప్ కు ఆసూయ కలిగించొచ్చు. దీనికి తోడు.. తాను చెప్పిన రీతిలో డైరీ ఉత్పత్తులతో పాటు.. ఆయుధ ఒప్పందాలకు నో చెప్పటం కోపం తెప్పించింది.
మనకున్న సమస్య ఏమంటే.. అమెరికాకు మనం ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నాం. అంటే.. అమెరికా మనతో పోలిస్తే.. మనమే అమెరికాకు వస్తువుల్ని అమ్ముతున్నాం. అంటే.. మన కస్టమర్ల జాబితాలో అమెరికా కూడా కీలకం. అందునా ఆ దేశానికి అమ్మే వస్తువులతో మనకు వచ్చే డాలర్ ఆదాయం అధికంగా ఉంటుంది. దీన్ని పరిమితం చేయటం కోసం సుంకాలు విధించే ప్రయత్నం చేశారు ట్రంప్.
సుంకాల మోతతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల్ని మన దేశం నుంచి కాకుండా.. ఆయా ఉత్పత్తుల్ని ఇతర దేశాల నుంచి తెప్పించుకునే వీలుంది.అలాంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తుసేవల్ని ఇతర దేశాల వైపు చూడటం.. అదే సమయంలో అమెరికాకు ఎగుమతులు చేసే వాటికి సంబంధించి ఇతర దేశాల్లో కొత్త మార్కెట్లను అన్వేషించే ప్రయత్నం చేస్తే.. అమెరికా మీద ఆధారపడటం తగ్గుతుంది. అయితే.. ఇక్కడ చెప్పినంత తెలిక కాకున్నా.. కొత్త మార్కెట్లను క్రియేట్ చేసుకోవటం తప్పేం కాదు. ఇప్పుడు ఆ దిశగా భారత్ అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ డిజిటల్ ప్రపంచంలో తాను మాత్రమే తోపునని.. మిగిలిన దేశాలు తన బానిస దేశాలుగా భావించటం.. తాను చెప్పింది ‘ఎస్ బాస్’ అనకపోతే చాలు.. సుంకాల షాక్ ఇస్తామని బెదిరించటం దేనికి నిదర్శనం? మాటలు మాత్రమే కాదు.. చేతల్లోనూ సుంకాల షాకిస్తున్న ట్రంప్ తీరు ఇప్పటి ప్రపంచం ఒప్పుకునేదే లేదు. అలాంటి తీరుకు చెక్ పెట్టేందుకు సరైన రీతిలో సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఎంతటి అగ్రరాజ్యమైనప్పటికీ.. ఆ దేశంలోని ప్రజల అవసరాలు ఉండవా? ఎంతటి కోటీశ్వరుడైనా.. మూడు పూటలు.. కాదంటే రెండు పూటలు తినాల్సిందే తప్పించి.. తన దగ్గర ఉన్న సంపదను చూసుకుంటూ ఉండిపోడు కదా? అలానే.. అమెరికా ఎంతటి సంపన్న దేశమైనప్పటికి.. దానికి ఉండే బలహీనతలు దానికి లేకపోలేవు. తన అదిలింపులతో ప్రపంచ దేశాల్ని దారికి తెచ్చుకోవాలన్న ట్రంప్ దరిద్రపుగొట్టు ఆలోచనలకు చెక్ పెట్టాల్సిందే. అందుకు కాస్త ఇబ్బందైనా దేశ ప్రజలు భరించటం ముఖ్యం.
ఈ రోజున ఒక అంశానికి తలవంచితే.. రేపొద్దున మరో అంశానికి తగ్గాల్సి ఉంటుంది. ఇందుకు మారిన భారత్ సిద్ధంగా లేదన్న సంకేతాన్ని స్పష్టం చేయటం తప్పేం కాదు. ఎవరు అవునన్నా.. కాదన్నా ఈ రోజున భారత్ పలు రంగాల్లో తన సత్తా చాటుతోంది. ప్రపంచంలోని టాప్ 5 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి.
ఇలాంటి వేళ.. భారత్ ను అస్థిరపరిచేందుకు ట్రంప్ మాదిరి ఎవరైనా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే.. వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంతటోడు అయినా సరే.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే వేళ.. తల ఎగరేసి.. అయితే ఏంటి? నీ గొప్పను అంగీకరించనంటే.. పోయేదేముంది? మహా అయితే ఆర్థికంగా కాస్త భారం కావొచ్చు. అంతకు మించి ప్రాణాలు అయితే పోవు కదా? ఆ మాత్రం ఆర్థిక భారాన్ని భరించలేని దీనస్థితిలో భారత్ లేదన్న విషయాన్ని అగ్రరాజ్యాధిపతి ట్రంప్ కు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
