Begin typing your search above and press return to search.

మీకెవడు భయపడుతాడు.. ఆసిమ్ మునీర్ కు భారత్ కౌంటర్

ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ (MEA) ఒక ప్రకటన విడుదల చేసింది.

By:  A.N.Kumar   |   11 Aug 2025 4:11 PM IST
మీకెవడు భయపడుతాడు.. ఆసిమ్ మునీర్ కు భారత్ కౌంటర్
X

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో భారత్‌పై చేసిన అణు బెదిరింపులకు కేంద్రం తీవ్రంగా స్పందించింది. అణు దాడి చేస్తామన్న ఆయన వ్యాఖ్యలకు భయపడేది లేదని, జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ పరిణామాలను గమనిస్తే పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన ఉన్మాద దేశమని, అమెరికా మద్దతు చూసుకుని రెచ్చిపోవడం ఆ దేశానికి అలవాటుగా మారిందని భారత్ విమర్శించింది.

-పాకిస్తాన్ వైఖరిపై భారత్ స్పందన

ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ (MEA) ఒక ప్రకటన విడుదల చేసింది. అణ్వాయుధాల వినియోగంపై బెదిరింపులు పాక్‌కు కొత్తేమీ కాదని, ఈ వ్యాఖ్యలు ఆ దేశం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అంతర్జాతీయ సమాజానికి అర్థం కావాలని పేర్కొంది. పాకిస్తాన్‌లోని అణ్వాయుధాలపై సైన్యం మరియు ఉగ్ర ముఠాల నియంత్రణ ఉందని, ఇది ఈ ప్రాంతానికి, ప్రపంచానికి ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని భారత్ హెచ్చరించింది.

-అమెరికా గడ్డపై మునీర్ ప్రేలాపనలు

అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్యాధిపతి ఫ్లోరిడాలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత్‌పై అణు బెదిరింపులకు పాల్పడ్డారు. తమది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశమని, భవిష్యత్తులో భారత్ నుంచి తమకు ముప్పు ఎదురైతే, తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. మునీర్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం విచారకరమని భారత్ పేర్కొంది.

-పాకిస్తాన్ సైన్యం నిజస్వరూపం

పాకిస్తాన్ మిలిటరీకి అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా వారు తమ నిజస్వరూపాన్ని బయటపెడతారని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం లేదని, ఆ దేశాన్ని సైన్యమే నియంత్రిస్తోందని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయని తెలిపాయి. పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని, అది జరిగితే ప్రపంచం మొత్తానికి ముప్పు ఎదురవుతుందని కూడా భారత ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి.

-భారత్ వైఖరిలో స్పష్టత

ఆసిమ్ మునీర్ బెదిరింపులకు భారత్ భయపడదని, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గత రెండు నెలల్లో మునీర్ అమెరికాకు వెళ్లడం ఇది రెండోసారి. భారత్‌పై ట్రంప్ సుంకాల భారం మోపుతున్న వేళ మునీర్ అమెరికా పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు పాకిస్తాన్ సైనిక వైఖరిని, అంతర్జాతీయ సంబంధాలపై దాని ప్రభావాన్ని సూచిస్తున్నాయి.