Begin typing your search above and press return to search.

పాకిస్తాన్‌ది దింపుడు కళ్లెం ఆశ.. సింధు జలాలపై భారత్‌ గట్టి షాక్!

అంతేకాదు.. తాము అసలు గుర్తించని చట్టవిరుద్ధంగా ఏర్పాటైన సంస్థగా భావిస్తున్న ఈ కోర్టు తీర్పులు భారత చర్యలపై ఎలాంటి ప్రభావం చూపబోవని తేల్చిచెప్పింది.

By:  A.N.Kumar   |   1 Sept 2026 11:07 AM IST
పాకిస్తాన్‌ది దింపుడు కళ్లెం ఆశ.. సింధు జలాలపై భారత్‌ గట్టి షాక్!
X

సింధు జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్‌కు భారత్‌ మరోసారి గట్టి షాక్‌ ఇచ్చింది. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలంటూ హేగ్‌లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం ( పీసీఏ) ఇచ్చిన తాజా తీర్పును భారత్‌ తీవ్రంగా తిరస్కరించింది. తమ సార్వభౌమ నిర్ణయాలపై తీర్పులు ఇచ్చే అధికారం ఆ న్యాయస్థానానికి లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. తాము అసలు గుర్తించని చట్టవిరుద్ధంగా ఏర్పాటైన సంస్థగా భావిస్తున్న ఈ కోర్టు తీర్పులు భారత చర్యలపై ఎలాంటి ప్రభావం చూపబోవని తేల్చిచెప్పింది.

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత 2025 ఏప్రిల్‌లో భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని ‘అబేయన్స్‌’లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్‌ భూభాగం నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని భారత్‌ అప్పట్లోనే స్పష్టం చేసింది. తాజాగా హేగ్‌ కోర్టు మాత్రం ఈ విధంగా ఏకపక్షంగా ఒప్పందాన్ని నిలిపివేయడం సాధ్యం కాదని ఒప్పందం అమల్లోనే ఉందని పేర్కొంది.

అయితే ఈ తీర్పును భారత్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తూ.. ‘సింధు జలాల ఒప్పందాన్ని అబేయన్స్‌లో ఉంచుతూ భారత్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ అమల్లోనే ఉంది’ అని తెలిపింది. ఈ విషయంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు భారత సార్వభౌమ నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపబోవని స్పష్టం చేసింది.

కోర్టు ఏర్పాటు పైనే భారత్‌ అభ్యంతరం

భారత్‌-పాకిస్తాన్ మధ్య కిషన్‌గంగా, రాట్లే జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో పాకిస్తాన్‌ ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను ఆశ్రయించింది. అయితే మొదటి నుంచే భారత్‌ ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తోంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం సాంకేతిక వివాదాలను ‘న్యూట్రల్‌ ఎక్స్‌పర్ట్‌’ ద్వారా పరిష్కరించాల్సి ఉండగా అదే అంశాలపై మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం ఒప్పందంలోని వివాద పరిష్కార విధానానికి విరుద్ధమని భారత్‌ వాదిస్తోంది.

ఈ కారణంగానే భారత్‌ ఆ మధ్యవర్తిత్వ సంస్థ ముందు హాజరు కాలేదు. కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను కూడా భారత్‌ గుర్తించలేదు. తాజాగా కూడా ఇదే వైఖరిని కొనసాగిస్తూ.. ఈ సంస్థను తాము చట్టబద్ధమైన న్యాయస్థానంగా గుర్తించబోమని కేంద్రం స్పష్టం చేసింది.

రాట్లే ప్రాజెక్టుపైనా ఆదేశాలు

సింధు జలాల ఒప్పందం అమల్లో ఉందని ప్రకటించడంతో పాటు, జమ్మూ కశ్మీర్‌లోని రాట్లే జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని నిర్మాణ పనులపై తాత్కాలిక పరిమితులు విధించాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను కూడా భారత్‌ తిరస్కరించింది. భారత సార్వభౌమ నిర్ణయాలు, దేశంలో చేపడుతున్న ప్రాజెక్టులపై ఈ సంస్థకు అధికారం లేదని స్పష్టం చేసింది.

1960 ఒప్పందం.. ఇప్పుడు ఎందుకు కీలకం?

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య 1960 సెప్టెంబర్‌లో సింధు జలాల ఒప్పందం కుదిరింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో రూపొందిన ఈ ఒప్పందం సింధు నదీ వ్యవస్థకు చెందిన నదుల నీటి వినియోగం, పంపిణీకి సంబంధించి ఇరు దేశాల హక్కులను నిర్దేశించింది. దశాబ్దాలుగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధాలు, తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పటికీ ఈ ఒప్పందం కొనసాగింది.

అయితే పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంతో సాధారణ సంబంధాలను కొనసాగించలేమన్న విధానంలో భాగంగా భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని అబేయన్స్‌లో పెట్టింది. ఇప్పుడు హేగ్‌ కోర్టు తీర్పు వచ్చినప్పటికీ.. భారత్‌ తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేయడం పాకిస్తాన్‌కు గట్టి దెబ్బగా మారింది.

పాకిస్తాన్‌కు ఆశాభంగమేనా?

హేగ్‌ తీర్పుతో సింధు జలాల ఒప్పందం మళ్లీ యథావిధిగా అమల్లోకి వస్తుందని పాకిస్తాన్‌ ఆశించింది. అయితే భారత్‌ తాజా స్పందనతో ఆ ఆశలు నీరుగారినట్లే కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్థ తీర్పు ఒకవైపు ఉండగా.. భారత్‌ మాత్రం తన నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో సింధు జలాల వివాదం మరోసారి భారత్‌-పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కేంద్రంగా మారే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే.. సింధు జలాల ఒప్పందంపై హేగ్‌ కోర్టు తీర్పు ఇచ్చినా దాన్ని అమలు చేసే విషయంలో భారత్‌ వెనక్కి తగ్గడం లేదు. ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ నుంచి విశ్వసనీయమైన, తిరుగులేని చర్యలు వచ్చే వరకు ఒప్పందాన్ని అబేయన్స్‌లోనే కొనసాగిస్తామని భారత్‌ సంకేతం ఇచ్చింది. దీంతో నీటి విషయంలో పాకిస్తాన్‌ పెట్టుకున్న ఆశలకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.