Begin typing your search above and press return to search.

మీ తీర్పు మాకొద్దు: పాకిస్థాన్‌కు షాకిచ్చిన భార‌త్‌

భార‌త్‌-పాకిస్థాన్‌ల మ‌ధ్య ఇటీవ‌ల వివాదంగా మారిన సింధు నదీ జ‌లాల విష‌యంపై తాజాగా హేగ్‌లోని అంత‌ర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు న్యాయ స్థానం తీర్పు వెలువ‌రించింది.

By:  Garuda Media   |   1 Sept 2026 1:00 AM IST
మీ తీర్పు మాకొద్దు:  పాకిస్థాన్‌కు షాకిచ్చిన భార‌త్‌
X

భార‌త్‌-పాకిస్థాన్‌ల మ‌ధ్య ఇటీవ‌ల వివాదంగా మారిన సింధు నదీ జ‌లాల విష‌యంపై తాజాగా హేగ్‌లోని అంత‌ర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు న్యాయ స్థానం తీర్పు వెలువ‌రించింది. గ‌తంలో త‌మ నేతృత్వంలో చేసుకున్న‌ సింధు జలాల ఒప్పందం ఇంకా పూర్తిగా అమల్లోనే ఉందని, భారత్ దాన్ని ఏకపక్షంగా సస్పెండ్ చేయడానికి వీలేదని కోర్టు తీర్పు వెలువరించింది. దీనిని పాటించి.. పాక్‌కు నీటిని విడిచి పెట్టాల‌ని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. మీ తీర్పు మాకు అవ‌స‌రం లేదు.. అని భార‌త విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది.

ఏంటీ వివాదం?

గ‌త ఏడాది ఏప్రిల్‌లో జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు చెలరేగిపోయారు. ప‌దుల సంఖ్య‌లో ప‌ర్యాట‌కుల‌ను పొట్టన పెట్టుకున్నారు. వీరిలో మ‌న తెలుగు వారు కూడా ఉ న్నారు. అయితే.. ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషించిన పాకిస్థాన్‌.. ఉగ్ర‌మూక‌ల స్తావ‌రాల‌ను లేకుండా చేయాల‌ని భార‌త్ డిమాండ్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్ర‌స్థావ‌రాలు, ఉగ్ర‌వాదుల‌పై దాడులు చేసి మ‌ట్టుబెట్టింది. ఈ నేప‌థ్యంలోనే సింధు జ‌లాల ఒప్పందాన్ని భార‌త్ గ‌త ఏడాది స‌స్పెండ్ చేసింది. ఫ‌లితంగా ఈ న‌దిపై ఆధార‌ప‌డిన పాకిస్థాన్‌లోని ప‌లు జిల్లాలు సంక్షోభం బారిన ప‌డ్డాయి.

ఫ‌లించ‌ని ప్ర‌య‌త్నం..

దీంతో పాకిస్థాన్ తొలుత భ‌రత్‌పై హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఆ దేశ మంత్రి ఒక‌రు.. సింధు జ‌లాల‌ను ఆపేస్తే.. ఆ న‌దిలో పారేది నీరు కాద‌ని.. ర‌క్త‌మ‌ని బెదిరించే ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌ర్వాత‌.. పాక్‌ ప్ర‌ధాని కూడా ఈ విష‌యంపై హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఆ త‌ర్వాత‌.. భార‌త్‌ను ప‌రోక్షంగా బ్ర‌తిమాలుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఉగ్ర‌వాద స్థావ‌రాలు, సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని అరిక‌ట్ట‌క‌పోతే.. సింధు జ‌లాల‌ను వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పింది.

తోక‌ముడిచి.. కోర్టుకు..

భార‌త్ భీష‌ణ ప్ర‌తిజ్ఞ‌తో గొంతెండుతున్న పాకిస్థాన్‌.. గ‌త ఏడాదే అంత‌ర్జాతీయ మ‌ధ్య‌వ‌ర్తిత్వ కోర్టును ఆశ్ర‌యించింది. అప్ప‌ట్లోనే భార‌త్‌.. ఈ కోర్టుకు త‌మ‌కు సంబంధం లేద‌ని తేల్చి చెప్పింది. అయిన‌ప్ప‌టికీ హేగ్ లోని కోర్టు.. విచార‌ణ చేసి.. తాజాగా 1960లో త‌మ స‌మ‌క్షంలో జ‌రిగిన సింధు జ‌లాల ఒప్పందం ఉనికిలోనే ఉంద‌ని.. దీనిని మీర‌వ‌ద్ద‌ని తీర్పు చెప్పింది. కాగా.. భార‌త్‌.. ఆ అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని స్ప‌ష్టం చేసింది. భార‌త సార్వ‌భౌమాధికారానికి సంబంధించిన విష‌యంలో విచార‌ణ చేయ‌డ‌మే త‌ప్ప‌ని.. పైగా తీర్పును ఎలా వెలువ‌రిస్తార‌ని ప్ర‌శ్నించింది. ఈ తీర్పుతో త‌మ‌కు సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది.