హిందూ కార్మికుడి హత్యపై తీవ్ర నిరసనలు.. బంగ్లాలో ఇప్పుడెలా ఉంది?
గడిచిన కొన్నేళ్లుగా వ్యతిరేకతను ఒక పద్దతి ప్రకారం పెంచి పోషించటం అది కాస్తా ఇప్పుడు పెరిగి పెద్దది కావటమే కాదు.. బంగ్లాలోని హిందువులకు కనీస రక్షణ లేని దుస్థితి నెలకొంది.
By: Garuda Media | 24 Dec 2025 11:30 AM ISTబంగ్లాదేశ్ లో భారత వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. గడిచిన కొన్నేళ్లుగా వ్యతిరేకతను ఒక పద్దతి ప్రకారం పెంచి పోషించటం అది కాస్తా ఇప్పుడు పెరిగి పెద్దది కావటమే కాదు.. బంగ్లాలోని హిందువులకు కనీస రక్షణ లేని దుస్థితి నెలకొంది. ఇటీవల బంగ్లాదేశ్ లోని ఒక కార్మికుడి (దీపూచంద్ర దాస్) ని అల్లరిమూకలు అత్యంత దారుణంగా.. హేయమైన పద్దతిలో హత్య చేసిన తీరు.. అనంతరం వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో షాకింగ్ గా మారింది. భారత్ లోని హిందువుల్లో తీవ్ర ఆవేదనకు గురి చేసింది.
బంగ్లాదేశ్ కార్మికుడి దారుణ హత్యకు నిరసనగా భారత్ లో నిరసనలు మొదలయ్యాయి. రోజు రోజుకు అవి మరింత తీవ్రంగా మారుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో పాటు.. కోల్ కతాలలో భారీ నిరసనలు చోటు చేసుకున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఈ తరహా నిరసనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ను ముట్టడించేందుకు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున సంఘటితం కావటం.. ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. బారికేడ్లను దాటుకొని ముందుకు దూసుకొచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు
పశ్చిమబంగాల్ రాజధాని కోల్ కతాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నాయి. నిరసన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది నిరసనకారులు కాషాయం జెండా చేతపట్టి బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ లో హిందువును చంపిన తీరు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను పలు దేశాలు ఇప్పటికే ఖండించాయి. బంగ్లాదేశ్ లోని మైనార్టీలపై తరచూ జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మౌనార్టీలపై జరుగుతున్న దాడులకు బంగ్లా ప్రభుత్వం చేష్టలుడిగినట్లుగా వ్యవహరించటాన్ని తప్పు పడుతున్నారు.
ఇదిలా ఉంటే.. భారత్ లోని నిరసనలపై బంగ్లా ప్రభుత్వ స్పందన ఎలా ఉందన్న విషయాన్ని చూస్తే.. తమ హైకమిషన్ కార్యాలయాల వద్ద నిర్వహిస్తున్న ఆందోళనలపై ఆ దేశం తీవ్రంగా స్పందించటమే కాదు.. తమ దేశంలోని భారత హైకమిషనర్ కు సమన్లు చేసింది ఇలా చేయటం ఇటీవల కాలంలో ఇది రెండోసారిగా చెబుతున్నారు. భారత్ లో జరుగుతున్న నిరసనలు.. తమ హైకమిషన్ కార్యాలయం వద్ద చోటు చేసుకుంటున్న ఆందోళనలకు సంబంధించి వివరణ అడుగుతున్నారు. పది రోజుల వ్యవధిలో రెండుసార్లు సమన్లు చేయటం గమనార్హం.
ఇదిలా ఉ:టే.. ఇప్పటికి బంగ్లాలోని మైనార్టీలైన హిందువులపై దాడులు ఇప్పటికి కొనసాగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా చట్టోగ్రామ్ లో హిందూ కుటుంబానికి సంబంధించిన ఇంటిని గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. ఈ ఘటనతో అందులో నివసిస్తున్న జయంతి సంఘా.. బాబు షుకుశీల్ ఫ్యామిలీలకు చెందిన వస్తువులు అన్నీ పూర్తిగా కాలిపోయినట్లు చెబుతున్నారు. పెంపుడు కుక్కలు సైతం మరణించాయ. ఈ ఉదంతంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా హిందువులను హెచ్చరిస్తూ ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇస్లామిక్ వ్యతిరేక కార్యకలాపాలు వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అందులో పేర్కొనటం గమనార్హం. మొత్తంగా బంగ్లాలో క్రమపద్దతిలో చోటు చేసుకుంటున్న హింస.. హిందువులపై జరుగుతున్న దాడిపై మోడీ సర్కారు స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు.
