ప్రపంచంలో ఆర్థికంగా దూసుకుపోతున్న భారత్.. ఈ అంకెల మధ్య వ్యత్యాసం ఏంటి?
బిహార్ వంటి రాష్ట్రాల్లో పేదరికం ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు చారిత్రక వెనుకబాటుతనం, పరిశ్రమల కొరత, తక్కువ విద్యా ప్రమాణాలు, నిరుద్యోగం.
By: Tupaki Political Desk | 26 Feb 2026 2:45 PM ISTపెద్ద పెద్ద ఆర్థిక వృద్ధి గణాంకాలు, లక్షల కోట్ల పెట్టుబడులు, ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం కీర్తి దక్కించుకుంటున్న తరుణంలో.. ఒక ప్రశ్న మనసును కుదిపేస్తోంది.. దేశ అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయా? లేక పేదరికం ఇంకా కోట్లాది మంది ప్రజలను వెంటాడుతుందా? బిహార్‌లో 26.6% పేదరికం ఉండగా, కేరళలో అది కేవలం 0.5% మాత్రమే ఉండడం ఈ అసమానతను స్పష్టంగా చూపిస్తోంది. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కాదు.. దేశ అభివృద్ధిలో ఉన్న లోటుపాట్లకు ప్రతిబింబం.
ప్రాంతాల వారీగా అసమానతలు..
దేశంలో పేదరికం ప్రాంతాలవారీగా తీవ్ర అసమానతలను కలిగి ఉంది. బిహార్ 26.6% తో అగ్రస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ 17.4%, రాజస్థాన్ 10.8% తో ముందున్నాయి. మరోవైపు గుజరాత్ 9%, పశ్చిమ బెంగాల్ 8.6%, మహారాష్ట్ర 5.5% వంటి రాష్ట్రాలు మధ్యస్థ స్థాయిలో ఉన్నాయి. పంజాబ్ (4.4%), ఢిల్లీ (3%) తక్కువ స్థాయిలో ఉండగా, తమిళనాడు (1.4%), కేరళ (0.5%) అత్యల్ప పేదరికం నమోదు చేసుకున్నాయి. ఈ వ్యత్యాసాలు రాష్ట్రాల అభివృద్ధి విధానాలు, పాలన, విద్య, ఆరోగ్య వ్యవస్థల మధ్య ఉన్న తేడాలను ప్రతిబింబిస్తున్నాయి.
బిహార్ లో పేదరికానికి కారణం ఇదే..
బిహార్ వంటి రాష్ట్రాల్లో పేదరికం ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు చారిత్రక వెనుకబాటుతనం, పరిశ్రమల కొరత, తక్కువ విద్యా ప్రమాణాలు, నిరుద్యోగం. వ్యవసాయంపై అధిక ఆధారపడడం, మౌలిక సదుపాయాల లోపం కూడా దీనికి కారణం అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కూడా జనాభా ఒత్తిడి, అభివృద్ధి అసమానతలు పేదరికాన్ని పెంచుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ అవి సరైన లక్ష్యాన్ని చేరకపోవడం మరో సమస్య.
మరోవైపు కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు పేదరికాన్ని తగ్గించడంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. కేరళలో ఉన్నత విద్యా ప్రమాణాలు, బలమైన ఆరోగ్య వ్యవస్థ, సామాజిక భద్రత పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి. తమిళనాడులో కూడా సంక్షేమ పథకాలు, పరిశ్రమల అభివృద్ధి పేదరికాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ రాష్ట్రాలు దేశానికి చూపిస్తున్న మార్గం స్పష్టంగా ఉంది. మానవ వనరులపై పెట్టుబడి పెడితే పేదరికం తగ్గుతుంది.
గుజరాత్ లో ఇంకా తొలగిపోని పేదరికం..
గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పేదరికం పూర్తిగా తొలగిపోలేదు. అభివృద్ధి ఉన్నప్పటికీ, అది సమానంగా విస్తరించకపోవడం వల్ల కొన్ని వర్గాలు ఇంకా వెనుకబడినవిగా మిగిలిపోతున్నాయి. నగరాల అభివృద్ధి పెరిగినా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు అంతగా మారలేదన్నది వాస్తవం. ఇది ‘ఇన్‌క్లూజివ్ గ్రోత్’ (సమగ్ర అభివృద్ధి) అవసరాన్ని గుర్తు చేస్తోంది.
పేదరికం కేవలం ఆదాయం లోపం కాదు.. అది విద్యా, ఆరోగ్యం, నివాసం, పోషణ వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వాలు కేవలం ఆర్థికవృద్ధి మీద కాకుండా సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, ఉద్యోగావకాశాలు అందించడమే దీర్ఘకాలిక పరిష్కారం. అలాగే సంక్షేమ పథకాలు నిజంగా అర్హుల వరకు చేరేలా పారదర్శకత పెంచాలి.
మరింత ప్రణాళికగా పేదరికం అరిట్టాలి..
దేశం అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్తున్నప్పటికీ, పేదరికం అనే సవాలు ఇంకా పెద్దదే. బిహార్ నుంచి కేరళ వరకు ఉన్న ఈ వ్యత్యాసం ఒక హెచ్చరిక.. అభివృద్ధి అందరికీ చేరకపోతే అది అసంపూర్ణమే. ‘సమాన అవకాశాలు, సమగ్ర అభివృద్ధి’ అనే లక్ష్యంతో ముందుకు సాగితేనే నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం సాధ్యం అవుతుంది. లేదంటే, ఈ సంఖ్యలు కేవలం గణాంకాలుగా కాకుండా మన అభివృద్ధి లోపాలను ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి.
