సర్వంసహా చక్రవర్తులా?.. ఖాకీల వెనుక అసుల కథ!
''రక్షక భట నిలయాలు.. నేరనమోదు కేంద్రాలే తప్ప.. శిక్షక భట నిలయాలు కాదు. పోలీసులకు అపరిమిత అధికారాలు ఉన్నాయని ఎవరైనా భావిస్తే.. తక్షణమే వదులుకోండి.
By: Garuda Media | 19 Jun 2026 4:00 PM IST''రక్షక భట నిలయాలు.. నేరనమోదు కేంద్రాలే తప్ప.. శిక్షక భట నిలయాలు కాదు. పోలీసులకు అపరిమిత అధికారాలు ఉన్నాయని ఎవరైనా భావిస్తే.. తక్షణమే వదులుకోండి. లాకప్‌డెత్‌లకు నిలయాలుగా మారడాన్ని స్టేషన్లను ఏర్పాటు చేయలేదు. మీరు(పోలీసులు) సర్వంసహా చక్రవర్తులా?'' - ఏపీలో చెలరేగిన.. సాయి కృష్ణ అనే యువకుడి మిస్టరీ కేసు వివాదం రోజునే(గురువారం).. యాదృచ్ఛికంగా.. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి.
మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో దేవా పర్ధీ అనే 24 ఏళ్ల గిరిజన యువకుడు లాకప్‌లో అనుమానాస్పదంగా మరణించిన ఘటన సంచలనం సృష్టించింది. దీనిపై దర్యాప్తును సుప్రీంకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. రాష్ట్ర పోలీసులు, సీబీఐ వ్యవహారశైలిపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టుకు చేరగా.. గురువారం నాటి విచారణలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
దేశవ్యాప్తంగా.. కేంద్ర ప్రభుత్వం ఐపీఎస్ సహా.. సీఆర్‌పీసీ వంటి బ్రిటీష్ కాలం నాటి చట్టాలను మార్చింది. జైళ్లను పరివర్తన కేంద్రాలుగా.. పోలీసు స్టేషన్లను నేరనమోదు, దర్యాప్తు కేంద్రాలుగా.. ఈ చట్టాల్లో మార్పులు చేశారు. కానీ, దేశ వ్యాప్తంగా పోలీసుల తీరు మాత్రం మారకపోవడం గమనార్హం. సర్వంసహా చక్రవర్తుల మనే ధోరణి కొనసాగుతూనే ఉంది. అయితే.. ఇది ఒక్క పోలీసుల తప్పేనా? అంటే... ముమ్మాటికీ కాదు!.
''రాజకీయ ప్రాపకం లేకుండా.. బదిలీలు జరగడం లేదా?'' అని గత నెలలో రాజస్థాన్ హోం శాఖను సుప్రీంకోర్టు ప్రశ్నించిన తీరు.. సర్వంసహా చక్రవర్తులుగా పోలీసులు వ్యవహరించేందుకు కారణభూత మెవరో స్పష్టం చేస్తోంది. కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ కావాలన్నా.. రాజకీయ అనుకూల వ్యక్తులుగా ముద్ర పడకపోతే సాధ్యం కావడం లేదన్న పిటిషనర్ తరఫు న్యాయవాది బహిరంగ వ్యాఖ్యలు దేశంలో పోలీసులకు-రాజకీయ నేతలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని పట్టి చూపుతాయి.
అదే.. పోలీసులపై ఒత్తిళ్లు పెంచి.. వారే సర్వం.. అనుకునేలా.. అనేలా చేస్తోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న పార్టీల అడుగులకు మడుగు లొత్తడమే పోలీసుల విధి.. అన్నట్టుగా మారిపోయింది. ఈ పరిణామమే.. రక్షక భట నిలయాలను శిక్షక భట నిలయాలుగా మారుస్తున్నాయన్న వాదన దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. దీనికి విరుగుడు.. ఎవరి పనిని వారు చేసుకుంటే సరిపోతుంది.. అయినా ఎవరూ మారరు.. ఏదీ మారదు!. అందుకే.. ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థ.. ప్రజలకు దూరం అవుతూనే ఉంది. ప్రజాస్వామ్యంలో చర్చనీయాంశంగా మిగులుతూనే ఉంది.
