Begin typing your search above and press return to search.

లేటెస్ట్‌: క‌స్ట‌డీ మ‌ర‌ణాల‌పై కేంద్రం లెక్క‌.. ఎవ‌రు బాధ్యులు?

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 2,630 మరణాలతో మొదటి స్థానంలో ఉందని కేంద్ర‌మే వెల్ల‌డించింది.

By:  Garuda Media   |   25 Jun 2026 9:00 PM IST
లేటెస్ట్‌: క‌స్ట‌డీ మ‌ర‌ణాల‌పై కేంద్రం లెక్క‌.. ఎవ‌రు బాధ్యులు?
X

దేశంలో లాకప్ (పోలీసు కస్టడీ) మరణాల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. పార్లమెంటులో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా 2022-24 మధ్య కాలంలో ఏకంగా 11,656 కస్టోడియల్ మరణాలు నమోదయ్యాయి. అయితే వీటిలో అధిక శాతం జ్యుడీషియల్ కస్టడీలో జరిగిన మరణాలుగా లెక్కల్లోకి వస్తాయని కేంద్రం వెల్ల‌డించింది. వివిధ పార్లమెంటరీ నివేదికలు, జాతీయ మానవ హక్కుల సంఘం వెల్లడించిన వివరాలు:అత్యధిక మరణాలు.. ఈ రెండేళ్ల‌లోనే సంభ‌వించాయి.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 2,630 మరణాలతో మొదటి స్థానంలో ఉందని కేంద్ర‌మే వెల్ల‌డించింది. సీఎం యోగి ఆదిత్య‌నాథ్ హ‌యాంలో స‌గ‌టున రోజుకు ఇద్ద‌రు చొప్పున లాక‌ప్‌లో మ‌ర‌ణిస్తున్నార‌ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో అత్యధికంగా 490 కస్టోడియల్ మరణాలు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల ప్రకారం, ప్రతి సంవత్సరం జ్యుడీషియల్ కస్టడీలో వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.

ఇక‌, పోలీసు లాకప్‌లలో ఏటా 100 నుండి 150 వరకు మరణాలు నమోదవుతున్నాయి. లాకప్‌ల్లో సహజ మరణాలతో పాటు, అనారోగ్యం, సరైన సమయంలో వైద్యం అందకపోవడం, పోలీసుల హింస కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఏపీలో లాక‌ప్ మ‌ర‌ణాల‌పై కేంద్ర హోం శాఖ ఆరా తీసిన‌ట్టు రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఈ నెల‌లోనే రెండు ఘ‌ట‌న‌లు వెలుగు చూడ‌డం గ‌మ‌నార్హం.

ఎవ‌రు బాధ్యులు..

లాక‌ప్ మ‌ర‌ణాల‌కు ఎవ‌రు బాధ్యులు అనే ప్ర‌శ్న‌కు కేంద్రం చిత్ర‌మైన స‌మాధానం చెబుతోంది. తాము కేవ‌లం గ‌ణాంకాల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతామ‌ని.. శాంతి భ‌ద్ర‌త‌లు, పోలీసు విభాగాలు వంటివి రాష్ట్రాల ప‌రిధిలోనే ఉంటాయ‌ని పేర్కొంది. కాబ‌ట్టి లాక‌ప్ మ‌ర‌ణాల‌కు కేంద్రానికి ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే.. జ‌వాబుదారీ త‌నం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని వెల్ల‌డించింది. మ‌రోవైపు.. ఇన్నేళ్ల‌లో ఒక్క త‌మిళ‌నాడులో మాత్ర‌మే 9 మంది పోలీసుల‌కు(తండ్రీకొడుకుల లాక‌ప్ డెత్‌) ఉరి శిక్ష ప‌డింది. ఇంత‌కు మించి క‌ఠిన శిక్ష‌లు ప‌డ‌క‌పోవ‌డంపైనా.. కేంద్రం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.