Begin typing your search above and press return to search.

'మిషన్ సుదర్శన్ చక్ర'.. భారత్ కు రష్యా అదిరిపోయే ఆఫర్.. ఇక మన గగనతరం శత్రు భీకరం

ఈ మెగా డీల్ విలువ సుమారు రూ.50 వేల కోట్లు ఉండొచ్చని అంచనా.

By:  A.N.Kumar   |   31 Aug 2026 10:33 AM IST
మిషన్ సుదర్శన్ చక్ర.. భారత్ కు రష్యా అదిరిపోయే ఆఫర్.. ఇక మన గగనతరం శత్రు భీకరం
X

భారత రక్షణ రంగంలో మరో భారీ అడుగు పడుతోంది. ఇప్పటికే భారత గగనతల రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రష్యా తయారీ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు సంబంధించి మరిన్ని యూనిట్ల కొనుగోలుపై చర్చలు వేగం పుంజుకున్నాయి. భారత వైమానిక దళం అవసరాల కోసం అదనంగా ఐదు ఎస్-400 స్క్వాడ్రన్లను సమకూర్చుకునే ప్రక్రియలో భాగంగా రష్యా ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు సమాచారం. ఈ మెగా డీల్ విలువ సుమారు రూ.50 వేల కోట్లు ఉండొచ్చని అంచనా. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దేశ గగనతల రక్షణ సామర్థ్యం మరింత పెరగనుంది.

ఆపరేషన్ సింధూర్ తర్వాత మారిన లెక్కలు

భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల చోటుచేసుకున్న సైనిక ఉద్రిక్తతల్లో ఎస్-400 వ్యవస్థ ప్రాధాన్యం మరోసారి చర్చకు వచ్చింది. సుదూర ప్రాంతాల్లో ఉన్న వైమానిక లక్ష్యాలను గుర్తించి, వాటిని అడ్డుకునే సామర్థ్యం కారణంగా ఈ వ్యవస్థను భారత రక్షణ వ్యవస్థలో కీలక కవచంగా పరిగణిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400 పనితీరుపై భారత రక్షణ వర్గాల్లో ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

అయితే ఎస్-400కు సంబంధించి యుద్ధ సమయంలో ఏ లక్ష్యాన్ని ఎంత దూరంలో కూల్చింది, ఏ విమానాన్ని ఈ వ్యవస్థే కూల్చింది వంటి కొన్ని వాదనలను మిలటరీ రహస్యంగా ఉంచింది. అయితే నిపుణులు వీటిని ఇటీవల బహిర్గతం చేయడంతో భారత యుద్ధ సామర్థ్యం ప్రపంచానికి తెలిసివచ్చింది.

ఇప్పటికే ఐదు స్క్వాడ్రన్లు.. ఇప్పుడు మరో ఐదు

2018లో భారత్-రష్యా మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా భారత్‌కు మొత్తం ఐదు ఎస్-400 స్క్వాడ్రన్లు రావాల్సి ఉంది. ఇప్పటికే నాలుగు స్క్వాడ్రన్లు అందుబాటులోకి రాగా చివరి స్క్వాడ్రన్ డెలివరీ కూడా పూర్తికానుంది. ఇప్పుడు మరో ఐదు స్క్వాడ్రన్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ప్రాధాన్యం పెరిగింది.

కొత్త వ్యవస్థలను ప్రధానంగా చైనా, పాకిస్థాన్ సరిహద్దులకు అనుగుణంగా మోహరించడం ద్వారా భారత గగనతల రక్షణను బహుళస్థాయిలో బలోపేతం చేయాలన్నది వ్యూహాత్మక ఆలోచనగా కనిపిస్తోంది. ముఖ్యంగా చైనా వద్ద ఉన్న ఆధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లు వంటి సవాళ్ల నేపథ్యంలో దీర్ఘశ్రేణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు ప్రాధాన్యం పెరిగింది.

ఎస్-400తో పాటు స్వదేశీ కవచం

భారత్ రష్యాపై మాత్రమే ఆధారపడకుండా స్వదేశీ రక్షణ సామర్థ్యాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తోంది. ప్రాజెక్ట్ కుశలో భాగంగా లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ఈ వ్యూహంలో కీలక అంశం. భవిష్యత్తులో దేశ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ వ్యవస్థలు అందుబాటులోకి వస్తే విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశం ఉంది.

ఇదే సమయంలో ఎస్-400 కోసం అదనపు క్షిపణులను సమకూర్చుకోవడం ద్వారా ఇప్పటికే ఉన్న వ్యవస్థల ఆపరేషనల్ సామర్థ్యాన్ని కొనసాగించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అంటే ఒకవైపు తక్షణ రక్షణ అవసరాలను ఎస్-400 వంటి నిరూపిత వ్యవస్థలతో తీర్చుకుంటూనే, మరోవైపు దీర్ఘకాలికంగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడే వ్యూహాన్ని భారత్ అనుసరిస్తోంది.

‘మిషన్ సుదర్శన్ చక్ర’కు మరో అడుగు

భారత గగనతల రక్షణను కేవలం సరిహద్దుల వద్దే కాకుండా దేశంలోని కీలక నగరాలు, సైనిక స్థావరాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల వరకు విస్తరించాలన్న ఆలోచన వేగం పుంజుకుంటోంది. ఎస్-400, స్వదేశీ ప్రాజెక్ట్ కుశతో పాటు ఇతర షార్ట్, మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కలిపి బహుళస్థాయి రక్షణ కవచాన్ని నిర్మించడమే దీని ప్రధాన లక్ష్యం.

మొత్తంగా చూస్తే రూ.50 వేల కోట్ల స్థాయి ఎస్-400 ప్రతిపాదన కేవలం మరో ఆయుధ కొనుగోలు కాదు. చైనా-పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే గగనతల ముప్పులను దృష్టిలో పెట్టుకుని భారత్ తన ఎయిర్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్‌ను మరింత విస్తృతం చేసే వ్యూహంలో ఇది ఒక కీలక భాగం. అయితే భారీ వ్యయంతో కూడిన ఈ కొనుగోలు విషయంలో సాంకేతిక బదిలీ, స్వదేశీకరణ, నిర్వహణ వ్యయం, భవిష్యత్ సరఫరా భద్రత వంటి అంశాలు కూడా నిర్ణయంలో కీలకం కానున్నాయి. ఎస్-400తో తక్షణ రక్షణ బలపడుతుండగా ప్రాజెక్ట్ కుశ వంటి స్వదేశీ కార్యక్రమాలు విజయవంతమైతే దీర్ఘకాలంలో భారత్‌కు మరింత స్వయం సమృద్ధి కలిగిన గగనతల రక్షణ వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంది.