Begin typing your search above and press return to search.

అమెరికాకు ఫార్మా ఎగుమతిదారుల లిస్ట్ : ఇండియాకు ఏం కాదు.. నష్టం ఎవరికంటే?

భారత్ ప్రధానంగా తక్కువ ధరలో అధిక నాణ్యత గల జెనరిక్ మందులు, యాంటీబయోటిక్స్, వ్యాక్సిన్లు, ఏపీఐలను సరఫరా చేస్తోంది.

By:  A.N.Kumar   |   26 Sept 2025 11:22 AM IST
అమెరికాకు ఫార్మా ఎగుమతిదారుల లిస్ట్ : ఇండియాకు ఏం కాదు.. నష్టం ఎవరికంటే?
X

ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధాల వినియోగదారు మార్కెట్‌గా పేరొందిన అమెరికాకు ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న దేశాల గణాంకాలు తాజాగా వెల్లడయ్యాయి. 2024 ట్రేడ్ డేటా ప్రకారం.. ఐర్లాండ్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, భారత్ 5వ స్థానంలో నిలిచింది. అమెరికా మార్కెట్‌కు అత్యధిక విలువైన ఔషధాలను సరఫరా చేయడంలో ఐర్లాండ్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.

* ఐర్లాండ్ ఆధిపత్యం, భారత్ స్థానం

ప్రపంచ ఫార్మా వాణిజ్యంలో ఐర్లాండ్ తన పట్టును నిరూపించుకుంది. గణాంకాల ప్రకారం, $65.7 బిలియన్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఐర్లాండ్ ఒక్కటే అమెరికాకు ఎగుమతి చేసింది. ఇది మొత్తం ఎగుమతులలో అత్యధిక వాటా కావడం విశేషం. ఈ జాబితాలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. భారత్ నుంచి అమెరికాకు $16.7 బిలియన్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అమెరికా ఫార్మా దిగుమతుల్లో భారత వాటా కేవలం 6 శాతం మాత్రమే కావడం గమనార్హం. సో అమెరికా ఫార్మా ఎగుమతిపై 100 శాతం టారిఫ్ లు భారత్ కంపెనీలపై పెద్దగా ప్రభావం పడవనే చెప్పొచ్చు.

భారత్ ప్రధానంగా తక్కువ ధరలో అధిక నాణ్యత గల జెనరిక్ మందులు, యాంటీబయోటిక్స్, వ్యాక్సిన్లు, ఏపీఐలను సరఫరా చేస్తోంది. ఫార్మా రంగంలో భారత్‌ను ప్రపంచం "ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్" గా పరిగణిస్తుంది. ముఖ్యంగా, అమెరికా మార్కెట్‌కు అవసరమయ్యే జెనరిక్ మందుల్లో దాదాపు 40% వరకు భారత్ నుంచే సరఫరా అవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

* టాప్ 5 ఎగుమతిదారులు (2024)

విలువ పరంగా చూస్తే, టాప్ 10 దేశాల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో యూరోపియన్ దేశాలు ఉన్నాయి . 2024 ఫార్మా ఎగుమతులు (బిలియన్ డాలర్లలో) గణాంకాలు చూస్తే.. ఐర్లాండ్ – 65.7 బిలియన్ డాలర్లతో తొలిస్థానంలో ఉంది. స్విట్జర్లాండ్ – 19.3,జర్మనీ – 17.4,ఇతర యూరోపియన్ దేశం 13.6, భారత్ – 16.7తో ఐదో స్థానంలో ఉంది. ఇతర యూరోపియన్ దేశాలు – 13.6, 12.0, 9.5, యూకే – 7.6, మరొక దేశం 7.4 లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

విశ్లేషకుల ప్రకారం.. ఐర్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ వంటి దేశాలు అధిక విలువ కలిగిన ఇన్నోవేటివ్ డ్రగ్స్, బయోలాజికల్స్ ఎగుమతిపై దృష్టి సారిస్తుండగా.. భారత్ తక్కువ ధరలో నాణ్యమైన జెనరిక్స్ సరఫరా చేయడంలో తన ప్రత్యేక బలాన్ని చాటుకుంటోంది.

* ట్రంప్ టారిఫ్స్ ప్రభావంపై ఆందోళన

ప్రస్తుత పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన 100% టారిఫ్స్ భారత ఫార్మా రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 6% వాటా ఉన్న భారత్, అదనపు సుంకాల కారణంగా ఎగుమతుల్లో మరింత పోటీని ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయినప్పటికీ "టారిఫ్ ఒత్తిడి ఉన్నప్పటికీ, అమెరికా మార్కెట్లో భారత జెనరిక్స్ డిమాండ్ తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే తక్కువ ధరలో అత్యవసర ఔషధాల అవసరం అమెరికాకు ఎప్పుడూ ఉంటుంది" అని ఫార్మా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

మొత్తానికి, అమెరికా ఫార్మా మార్కెట్లో ఐర్లాండ్ మొత్తం విలువ పరంగా నంబర్ 1 గా కొనసాగుతుండగా, భారత్ ప్రపంచంలోని అత్యధిక జెనరిక్ మందుల సరఫరాదారుగా కీలక దేశంగా తన స్థానాన్ని నిలుపుకుంది.