Begin typing your search above and press return to search.

ఎల‌క్ట్రిక్ విప్ల‌వంతో పెట్రోల్- డీజిల్ వినియోగం త‌గ్గిందా? వాస్త‌వం తెలిస్తే షాకింగే!

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ, భారత్‌లో మరో ఎనిమిదేళ్ల పాటు పెట్రోల్, డీజిల్ డిమాండ్ తగ్గదని బ్లూమ్‌బెర్గ్ ఎన్‌ఈఎఫ్ నివేదిక వెల్లడించింది. 2034 నాటికి రవాణా రంగంలో ఇంధన డిమాండ్ రోజుకు 2.5 మిలియన్ బ్యారెళ్లు దాటుతుందని అంచనా వేసింది. ఈవీ వినియోగం పెరగాలంటే 2040 నాటికి ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం 29 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని పేర్కొంది.

By:  Sivaji Kontham   |   17 Nov 2026 9:38 AM IST
ఎల‌క్ట్రిక్ విప్ల‌వంతో పెట్రోల్- డీజిల్ వినియోగం త‌గ్గిందా? వాస్త‌వం తెలిస్తే షాకింగే!
X

ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం దేశంలో వేగంగా పెరుగుతున్నా.. రానున్న కొన్నేళ్ల‌ పాటు భారతదేశంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్ మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ ఎన్‌ఈఎఫ్ తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో పెరుగుతున్న వాహనాల సంఖ్య, కమర్షియల్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

బ్లూమ్‌బెర్గ్ ఎన్‌ఈఎఫ్ విడుదల చేసిన `ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్‌లుక్ 2026` తాజా రిపోర్ట్ ప్రకారం.. 2034 నాటికి భారతదేశ రోడ్డు ర‌వాణా కోసం ఇంధన డిమాండ్ రోజుకు 2.5 మిలియన్ బ్యారెళ్లను దాటనుంది. ఆ తర్వాత అంటే దాదాపు 8ఏళ్ల త‌ర్వాత క్రమంగా ఈ డిమాండ్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. కాలక్రమేణా ఎలక్ట్రిక్ టూ-వీలర్లు, త్రీ-వీలర్లు.. ప్యాసింజర్ కార్ల వాడకం మరింత పెరిగితేనే మొత్తం ఇంధన వినియోగం తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు గత దశాబ్దంతో పోలిస్తే చాలా నెమ్మదిగా పెరుగుతున్నా కానీ.. చైనా వంటి దేశాలు ఉద్గారాలను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే భారతదేశంలో ఇంధన డిమాండ్ మరో ఎనిమిదేళ్ల పాటు నిలకడగా పెరిగే అవకాశం ఉండటం వల్ల.. ప్రపంచ మార్కెట్లో చైనా ట్రెండ్ కంటే భిన్నంగా చమురు డిమాండ్ కొన్నేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.

దేశంలో గతేడాది ఈవీ విక్రయాలు 2.4 మిలియన్ (24ల‌క్ష‌ల‌) యూనిట్లను దాటినా.. త్రీ-వీలర్లను మినహాయిస్తే మరే ఇతర వాహన విభాగం కూడా 2030 నాటి ఎలక్ట్రిఫికేషన్ లక్ష్యాలను చేరుకునే మార్గంలో లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రాన్స్ పోర్టేష‌న్ లో భారీ మార్పు విజయవంతం కావాలంటే ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2040 నాటికి దాదాపు 29 బిలియన్ డాలర్ల (సుమారు 2.73 ల‌క్ష‌ల కోట్లు) భారీ పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.

ఇంకో ఎనిమిదేళ్ల పాటు పెట్రోల్, డీజిల్ డిమాండ్ త‌గ్గ‌దు. అంతేకాదు ప్ర‌పంచ మార్కెట్లో యుద్ధాల కార‌ణంగా చ‌మురు సంక్షోభం కొన‌సాగుతూనే ఉంది. భ‌విష్య‌త్ లో యుద్ధాలు వ‌చ్చినా డిమాండ్ అమాంతం పెరుగుతుంది. ఇలాంటి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగే ఛాన్సుంద‌ని ఒక అంచ‌నా.