సింధు జలాలపై పాక్ హెచ్చరికలు.. భారత్ ధీటైన సమాధానం.. వివాదం ఎటు దారి తీస్తుంది?
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సింధూ జలాల ఒప్పందం వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది.
By: A.N.Kumar | 30 Jun 2026 12:58 PM ISTభారత్-పాకిస్థాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సింధూ జలాల ఒప్పందం వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. సరిహద్దు ఉగ్రవాదానికి పాక్ శాశ్వతంగా స్వస్తి పలికే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ సంచలన నిర్ణయం తీసుకోవడం ఇస్లామాబాద్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
దీనికి ప్రతిచర్యగా పాకిస్థాన్ మంత్రులు అత్యంత వివాదాస్పద, ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో పాక్ సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్, పర్యావరణ మంత్రి ముసాదిక్ మాలిక్ మాట్లాడుతూ.. తమకు రావాల్సిన నీటిని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. "పాకిస్థాన్‌కు కేటాయించిన నీటిపై ఎవరైనా చేయి వేస్తే ఆ చేతులను నరికేస్తాం" అంటూ వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే బీజేపీ నేతలు దీనికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఒక్కసారి భారత్ ను టచ్ చేసి చూడండి.. ‘ప్రపంచ పటంలో పాకిస్తాన్ ను లేకుండా చేస్తాం’ అంటూ హెచ్చరికలు పంపుతున్నారు. దీంతో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.
ఆరు దశాబ్దాల చరిత్ర.. ఐతే ఇప్పుడు సీన్ మారింది
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధూ జలాల ఒప్పందం ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఒప్పందాలలో ఒకటిగా నిలిచింది. భారత్ నియంత్రణలోని నదులు రావి, బియాస్, సట్లెజ్ గా.. పాకిస్థాన్ పరిధిలోని నదులు సింధు, జీలం, చెనాబ్ గా వర్గీకరించారు. గడిచిన ఆరు దశాబ్దాలలో ఇరు దేశాల మధ్య మూడు పెద్ద యుద్ధాలు జరిగినప్పటికీ ఈ ఒప్పందానికి ఎలాంటి ఢోకా కలగలేదు. కానీ 2025 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తన వ్యూహాన్ని మార్చింది. "రక్తం, నీరు కలిసి పారలేవు" అనే మోడీ పిలుపుతో భారత్ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఉగ్రవాదానికి మద్దతిస్తూ శాంతి ఒప్పందాల ప్రయోజనాలను ఆశించడం కుదరదని భారత్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో సైతం స్పష్టం చేసింది.
అంతర్జాతీయ చట్టాల సాకుతో పాక్ బుకాయింపులు
మరోవైపు భారత్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పాకిస్థాన్ వాదిస్తోంది. 1960 ఒప్పందాన్ని ఒక దేశం తన ఇష్టానుసారంగా మార్చలేదని.. ఇది ఇప్పటికీ చట్టబద్ధంగా అమలులో ఉందని పేర్కొంటూ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. దీనికోసం అంతర్జాతీయ న్యాయ నిపుణులతో సదస్సులు కూడా నిర్వహిస్తోంది. ఆరు దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితులు, ప్రస్తుత భద్రతా సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాబట్టి ప్రస్తుత భద్రతా అవసరాలకు అనుగుణంగా ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించాల్సిందేనని ఢిల్లీ గట్టిగా చెప్తోంది.
వివాదం ఎటు దారి తీస్తోంది?
ప్రస్తుతం నీరు అనేది కేవలం ఒక సహజ వనరు మాత్రమే కాదు.. అగ్రదేశాల మధ్య ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారుతోంది. వాతావరణ మార్పులు, పెరుగుతున్న నీటి కొరత ఈ వివాదాన్ని మరింత సున్నితంగా మార్చాయి.
ప్రస్తుతానికైతే ఇరు దేశాలు తమ పంతాలను వీడేలా కనిపించడం లేదు. పాక్ యుద్ధ ప్రాతిపదికన హెచ్చరికలు జారీ చేస్తుంటే, భారత్ మాత్రం ఉగ్రవాదంపై తన పంథాను మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. రానున్న రోజుల్లో ఈ జల వివాదం దౌత్యపరమైన చర్చలతో ముగుస్తుందా, లేక ఇరు దేశాల మధ్య మరింత పెద్ద సంక్షోభానికి దారి తీస్తుందా అనేది వేచి చూడాలి.
