సింధూ జలాలపై భారత్ సంచలన ప్రకటన.. పాక్ ఖేల్ ఖతం
భారత్‌పై నిరాధారమైన, కల్పిత ఆరోపణలు చేయడం మానేసి, పాకిస్థాన్ ముందుగా తన సొంత అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని అనుపమ సింగ్ గట్టి చురకలంటించారు.
By: A.N.Kumar | 19 Jun 2026 11:54 AM ISTసింధూ జలాల ఒప్పందం విషయంలో పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి భారత్ చాచి కొట్టినట్లు సమాధానమిచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్.హెచ్.ఆర్.సీ) వేదికగా పాక్ ఆరోపణలను భారత్ తీవ్రంగా తిప్పికొట్టింది. జెనీవాలో జరిగిన యూఎన్.హెచ్.ఆర్.సీ 62వ సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి అనుపమ సింగ్ మాట్లాడుతూ.. 1960 నాటి సింధూ జలాల ఒప్పందం ప్రస్తుత కాలమాన పరిస్థితులకు ఎంతమాత్రం సరిపోదని ఐరాస వేదికగా కుండబద్దలు కొట్టారు.
మారిన పరిస్థితులు.. పాత ఒప్పందాలు కుదరవు!
గడిచిన ఆరు దశాబ్దాల్లో భౌగోళిక, సాంకేతిక, భద్రతా పరమైన సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని భారత్ స్పష్టం చేసింది. 65 ఏళ్ల క్రితం నాటి నిబంధనలను నేటి ఆధునిక కాలంలో యథాతథంగా అమలు చేయడం సాధ్యం కాదని భారత ప్రతినిధి పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్ ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాజానికి వివరించింది.
ఉగ్రవాదం, చర్చలు ఒక్కటేనా?
ఒకవైపు భారత్‌పైకి నిరంతరం ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ.. మరోవైపు సద్భావన, శాంతి, పరస్పర సహకారం ప్రాతిపదికన కుదిరిన ఒప్పందాల ప్రయోజనాలను ఆశించడం పాకిస్థాన్ ద్వంద్వ నీతికి నిదర్శనమని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఉగ్రవాదం, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పటికీ కలిసి ప్రయాణించలేవు. ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మరోవైపు అంతర్జాతీయ ఒప్పందాల గురించి మాట్లాడే హక్కు పాకిస్థాన్‌కు లేదు." అని భారత ప్రతినిధి అనుపమ సింగ్ స్పష్టం చేశారు.
మీ ఇల్లు సరిచేసుకోండి.. పాక్‌కు భారత్ చురకలు
భారత్‌పై నిరాధారమైన, కల్పిత ఆరోపణలు చేయడం మానేసి, పాకిస్థాన్ ముందుగా తన సొంత అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని అనుపమ సింగ్ గట్టి చురకలంటించారు. పాక్ గడ్డపై పెరుగుతున్న తీవ్రవాదాన్ని అరికట్టడంలో అక్కడి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు సురక్షిత ఆశ్రయంగా మారిన పాకిస్థాన్ అసలు రంగు ప్రపంచ దేశాలన్నింటికీ ముందే తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ను నిందించడం వల్ల పాక్‌కు దక్కేదేమీ లేదని భారత్ హెచ్చరించింది.
పునఃసమీక్ష వైపే భారత్ అడుగులు
గత కొంతకాలంగా సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాద చర్యల నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని సవరించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. దీనిపై పాకిస్థాన్ ప్రపంచ దేశాల ముందు గగ్గోలు పెడుతున్నప్పటికీ.. భారత్ మాత్రం తన జాతీయ భద్రత, ప్రస్తుత అవసరాలు, మారిన భౌగోళిక పరిస్థితుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
భారత్ తీసుకున్న ఈ తాజా, అత్యంత దూకుడు వైఖరితో అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ తీవ్రంగా నవ్వులపాలైంది. ఉగ్రవాదాన్ని వీడనంత వరకు ఆ దేశంతో సాధారణ సంబంధాలు గానీ.. ఒప్పందాల కొనసాగింపు గానీ సాధ్యం కాదనే బలమైన సందేశాన్ని భారత్ ప్రపంచానికి చాటిచెప్పింది.
