Begin typing your search above and press return to search.

పాక్ కొత్త వాటర్ వార్ వాదన... ఆ దేశ జీవానికి జీలం ఎఫెక్ట్!

ఈ సందర్భంగా స్పందించిన సింధూ జలాలపై పాకిస్థాన్ కమిషనర్... జీలం, నీలం నదులలో నీటి ప్రవాహం 3,000 క్యూసెక్కులకు పడిపోయిందని.. వాస్తవానికి ఇది 5,000 క్యూసెక్కులకు పైగా ఉందని అన్నట్లు పాక్ మీడియా తెలిపింది.

By:  Raja Ch   |   24 Dec 2025 5:00 AM IST
పాక్  కొత్త వాటర్  వార్  వాదన... ఆ దేశ జీవానికి జీలం ఎఫెక్ట్!
X

ఈ ఏడాది ఏప్రిల్ లో పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత సైనిక చర్యకు ముందు భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. సుమారు 65 ఏళ్ల నాటి సింధు జల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. నీరు, రక్తం కలిసి ప్రవేశించలేవని ఒక్క మాటతో చెప్పాల్సింది చెప్పింది. అప్పటి నుంచి పాక్ విలవిల కొట్టుకుంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జీలం, నీలం నదీ జలాలపై ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది.

అవును... 1960లో జరిగిన చర్చలు, సింధు జలాల ఒప్పందం ద్వారా బేసిన్ లోని ఆరు కీలక నదులను భారత్, పాక్ మధ్య విభజించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ లను పాకిస్థాన్ కు కేటాయించగా.. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లేజ్ నదులను భారత్ కు ఇచ్చారు. ఈ క్రమంలో జీలం, నీలం నదుల్లో (జీలం నదికి ప్రధాన ఉపనది) నీటి ప్రవాహం తగ్గుతుందంటూ పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇటీవల చీనాబ్ నదీ ప్రవాహంలో ఆందోళనకరమైన నీటి తగ్గుదల గురించి పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని రోజుల తర్వాత తాజాగా జీలం, నీలం నదుల్లో నీటి సరఫారా తగ్గిందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశం జీలం నీటిని అకస్మాత్తుగా నిలుపుకోవడం, విడుదల చేయడం తీవ్రమైన, ఆందోళనకరమైన సమస్య అని పాక్ ఆరోపించింది. ఇస్లామాబాద్ కు సమీపంలో ఉన్న మీర్పూర్ లో ఉన్న మంగ్లా ఆనకట్టకు జీలం నది నుంచి నీటి ప్రవాహం తగ్గిందని తెలిపింది.

ఈ సందర్భంగా స్పందించిన సింధూ జలాలపై పాకిస్థాన్ కమిషనర్... జీలం, నీలం నదులలో నీటి ప్రవాహం 3,000 క్యూసెక్కులకు పడిపోయిందని.. వాస్తవానికి ఇది 5,000 క్యూసెక్కులకు పైగా ఉందని అన్నట్లు పాక్ మీడియా తెలిపింది. అగ్రికల్చర్ సైకిల్ లో.. కీలకమైన సమయంలో.. రబీ విత్తనాల సీజన్ లో ఎదురవుతున్న ఈ పరిణామం దాని 24 కోట్ల ప్రజల జీవితాలకు, జీవనోపాధికి ప్రత్యక్షంగా పెను ముప్పు కలిస్తుందని పాక్ పేర్కొంది.

ఇదే సమయంలో... ఇది నిజంగా తీవ్రమైన విషయమని.. ఆందోళనకరమైనదని.. ఎందుకంటే వివిధ కాలువల ద్వారా సాగునీరు పొందుతున్న మొత్తం 2.5 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమిలో సుమారు 1.5 కోట్లకు నేడు పూర్తి స్థాయిలో నీరు అందండం లేదని పాకిస్థాన్ నీటిపారుదల శాఖ అధికారి ఒకరు అన్నారు. కాగా నీటి ప్రవాహాన్ని ఆపే ఏ చర్యనైనా "యుద్ధ చర్య"గా చూస్తామని పాకిస్థాన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!

కాగా ఈ ఏడాది మే నెలలో.. పాకిస్థాన్ హక్కులు ఉన్న నదులలో ఒకటైన చీనాబ్ పై ఉన్న బగ్లిహార్, సలాల్ ఆనకట్టల నుంచి ప్రవాహాలను భారత్ పరిమితం చేసింది! ఈ ఎఫెక్ట్ తో దిగువ ప్రాంతాల నివాసితులు తొలిసారిగా నదీగర్భంలో నడవగలిగారు. ఈ చర్య.. పాకిస్థాన్ పంజాబ్ రైతులు.. వరి, చెరకు, మొక్కజొన్న, పత్తి వంటి ప్రధాన పంటలను నాటగల సామర్థ్యాన్ని దెబ్బతీసింది.