అవినీతి రేసులో... మనమే టాప్...
ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలోని 180 దేశాలలో అవినీతి రహిత విషయంగా భారత్ 96వ స్థానంలో ఉంది.
By: Tupaki Political Desk | 10 Dec 2025 4:00 AM ISTఅవినీతి భారత కథా చిత్రమ్ గురించి మీకు తెలుసా...అవినీతిలో మనం దూసుకెళుతున్నాం. ఔను మీరు విన్నది నిజమే...ఇదేదో గొప్పగా చంకలుగుద్దుకోవాల్సిన విషయం కానే కాదు. కానీ ఆసక్తికలిగించే అంశం. దేశంలో అవినీతి రాకెట్ లా దూసుకెళుతోంది. ఇపుడు దేశంలో వ్యవస్థీకృత అవినీతే రాజ్యమేలుతోంది. అవినీతి చేసేవారు ఇక్కడ దోషులుగా కనిపించరు. పైగా ప్రజలే దాందేముంది ఇది మామూలే కదా అనుకునే స్థితికి వచ్చేసింది. పైసల్ ఇవ్వందే పనికాదు అనే స్థితి వెళ్ళి పైసలిచ్చినా పనిఅవుతోంది కదా అదే పదివేలు అని సగటు భారతీయుడు అనుకుంటున్నాడంటే...సిట్యుయేషన్ ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోండి.
రాజకీయనేతలు అవినీతికి పాల్పడ్డా, సర్కారు కొలువు చేసేవారు అవినీతికి పాల్పడ్డా అదేం పెద్ద నేరంగా ప్రజలు పరిగణించడంలేదు. అవినీతి నేతల్ని ఎన్నకుంటున్నారు. మేత కొద్ది నేత అనే కొత్త నానుడి వచ్చేసింది. ప్రపవంచ వ్యాప్తంగా డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఆచరిస్తారు. ఈ సందర్భంగా ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం గత దశాబ్ద కాలంగా ఇండియాలో అవినీతి అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది. ఈ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ దేశఆల అవినీతిపై నివేదిక విడుదల చేస్తోంది. డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాలు చాలా ఏళ్లుగా అవినీతి రహిత దేశాలుగా కొనసాగుతుంటే...ఇండియా ర్యాంకు మాత్రం నానాటికీ తీసికట్టు నాగంబొట్లు చందంగా పడిపోతూ వస్తోంది.
ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలోని 180 దేశాలలో అవినీతి రహిత విషయంగా భారత్ 96వ స్థానంలో ఉంది. అయితే గత అయిదేళ్ళలో 85వ స్థానంలో ఉన్న మనం 2023 లో 93కు, 2024లో అంతకన్నా కిందికిదిగి 96వ స్థానానికి చేరుకుంది. మనమే అనుకుంటే మన దాయాది దేశం పాకిస్తాన్ మనల్ని మించింది. గత పదేళ్ళలో పాకిస్తాన్ అవినీతిలో తిరుగులేని దేశంగా నిలుస్తోంది. 2015లో 117వ స్థానంలో ఉంటే 2021లో 140 స్థానానికి పడిపోయింది. గత పదేళ్ళలో పాకిస్థాన్ లోనూ అవినీతి గణనీయంగా పెరిగిందనే నివేదిక చెబుతోంది.
అయితే చైనా రూటు వేరుగా ఉంది. భారత్ , పాక్ లు అవినీతిలో మేమంటే మేమంటూ పోటీ పడుతుంటే...పొరుగు దేశం చైనా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అవినీతి రహిత దేశంగా ర్యాంకింగ్ లో పురోగతి కనిపిస్తోంది. 2015లో 83వ స్థానంలో ఉంటే...2024 నాటికి 76వ స్థానం చేరుకోగలిగింది. అవినీతి నియంత్రణలో మనదేశం కంటే మెరుగుదలను ప్రదర్శిస్తోంది. జనాభా రీత్యా ఇరుదేశాల పరిస్థితి ఒకేలా ఉంటున్నా....దేశ ప్రగతి కావచ్చు...అవినీతి నియంత్రణ కావచ్చు ఈ రెండు విషయాల్లో చైనా మెరుగ్గా ఉందనే చెప్పాలి. సో ఇదండీ మన అవినీతి భారత కథా చిత్రమ్.
