భారత్ వర్సెస్ పాక్ క్రికెట్‌పై రాజకీయ దుమారం: ఏం జరిగింది?
భారత్ -పాక్‌ల మధ్య తీవ్ర వివాదాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఎలాంటి వివాదాలు ఉన్నప్పటికీ.. ఇరు దేశాల మధ్య క్రికెట్ మాత్రం కొనసాగుతోంది.
By: Garuda Media | 13 Sept 2025 6:58 PM ISTఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్.. దాయాది దేశాలు ఆదివారం తలపడనున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటలకు దుబా య్ వేదికగా ఈ క్రీడ జరగనుంది. సాధారణంగా భారత్-పాక్ జట్ల మధ్య క్రికెట్ పోరు అంటేనే నరాలు తెగే ఉత్కంఠ నెలకొంటుంది. అలానే.. ఇప్పుడు కూడా ఉత్కంఠ నెలకొంది. కానీ, దీనికి ఇప్పుడు తీవ్రస్థాయిలో రాజకీయం అలుముకుంది. ఈ క్రికెట్ మ్యాచ్‌ను బాయి కాట్ చేయాలంటూ.. రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి. అంతేకాదు.. ఈ క్రికెట్‌కు ఎలా అనుమతి ఇచ్చారంటూ.. ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నాయి. రక్తం-నీరు కలిసి పారదన్న ప్రధాని.. రక్తం-క్రికెట్ కలిసి ఆడతాయని చెబుతున్నారా? అంటూ.. నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏం జరిగింది?
భారత్ -పాక్‌ల మధ్య తీవ్ర వివాదాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఎలాంటి వివాదాలు ఉన్నప్పటికీ.. ఇరు దేశాల మధ్య క్రికెట్ మాత్రం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆసియా కప్‌లోనూ దాయాది దేశాలు తలపడేందుకు రంగం రెడీ అయింది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. విరుచుకుపడిన విషయం తెలిసిందే. పేరు, కులం, మతం అడిగి మరీ కాల్పులు జరిపిన ఉగ్రమూక.. ఈ ఘటనలో మొత్తం 26 మంది(ఒక నేపాలీ)ని పొట్టన పెట్టుకుంది. ఇది ఆయా కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. భార్య కళ్లముందే.. భర్తను, తల్లి కళ్లముందే బిడ్డను ఉగ్రమూక కాల్చి చంపారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారు కూడా ఉన్నారు.
ఈ ఘటన తర్వాత.. భారత్ -పాక్ మధ్య సంబంధాలు మరింత చెడిపోవడమే కాకుండా.. ఉద్రిక్తతలకు కూడా దారితీశాయి. ఈక్రమంలోనే భారత ప్రభుత్వం మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పహల్గాం ఉగ్రదాడిలో తమ సిందూరాన్ని కోల్పోయిన మహిళలకు మద్దతుగా ఉగ్రవాద శిబిరాలు.. ఉగ్రవాదులపై దాడులు చేసింది. ఇది మూడు రోజుల పాటు జరిగింది. ఇరు దేశాల మధ్య భీకరస్థాయిలో(ఒకానొక దశలో) కాల్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా మే 10న ఈ కాల్పులను విరమిస్తున్నట్టు భారత్-పాక్ ప్రకటించాయి. ఇది జరిగి ఐదు మాసాలు అయింది. దీనినే రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్, పహల్గాం దాడులను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, శివసేన సహా పలు పార్టీలు.. కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నాయి. ``మహిళల కన్నీరు ఇంకా ఇంకిపోలేదు. నీరు-రక్తం పారదని ప్రధానిచెప్పారు. కానీ, ఇప్పుడు క్రికెట్ - రక్తం కలిసి ఆడుతాయా?`` అని మహారాష్ట్ర విపక్షం శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే నిప్పులు చెరిగారు. పాక్‌తో భారత్ మ్యాచ్‌ను రద్దు చేయాలని.. కోరారు. ప్రజలకు కూడా ఆయన పిలుపునిచ్చారు. మ్యాచ్‌ను వీక్షించకుండా బాయికాట్ చేయాలన్నారు. ఇక, ఈ పార్టీ నేతలు మరో అడుగు ముందుకు వేసి.. క్రికెట్‌ను ప్రత్యక్ష ప్రసారంచేసే వారిని వదిలి పెట్టేది లేదని.. వారి అంతు చూస్తామని హెచ్చరించారు. మరోవైపు.. పహల్గాంలో తమ వారిని కోల్పోయిన మహిళలు కూడా మోడీపై నిశిత విమర్శలు చేస్తున్నారు.
