జపాన్ ను కొట్టిన భారత్.. నెక్స్ట్ టార్గెట్ జర్మనీ.. ఆల్ ది బెస్ట్!
ఈ క్రమంలోనే... 2030 కల్లా 7.3 లక్షల కోట్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థ చేరుతుందని అంచనా వేస్తున్నారు.
By: Raja Ch | 31 Dec 2025 10:50 AM ISTప్రపంచ దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ టాప్ ప్లేస్ లో ఉందనే చర్చ ఇటీవల బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఓ గుడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగమా... పరుగులు తీస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరో మైలు రాయిని చేరుకుందని.. జపాన్ ను వెనక్కి నెట్టి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి చేరిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నెక్స్ట్ టార్గెట్ ను చెప్పింది.
అవును... భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జపాన్ ను వెనక్కి నెట్టి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి చేరామని.. రాబోయే మూడేళ్లలో మూడో స్థానంలో ఉన్న జర్మనీని సైతం వెనక్కి నెట్టి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనున్నామని కేంద్రం వెల్లడించింది. ఈ సందర్భంగా... 2025 సంస్కరణల వివరాలు చర్చకు వస్తున్నాయి. కాగా.. తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్న సంగతి తెలిసిందే.
వాస్తవానికి 2024-25 చివరి త్రైమాసికంలో భారత వాస్తవ జీడీపీ 7.4% కాగా... 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8% గా ఉంది. ఇక రెండో త్రైమాసికానికి వచ్చే సరికి 8.2% వృద్ధిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే 4.18 లక్షల కోట్ల డాలర్లు (దాదాపు రూ.376.2 లక్ష కోట్లు)తో జపాన్ ను అధిగమించింది. ఫలితంగా... ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
ఈ క్రమంలోనే... 2030 కల్లా 7.3 లక్షల కోట్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థ చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా పలు అంతర్జాతీయ ఆర్థిక ఏజెన్సీలు భారతదేశ భవిష్యత్ ఆర్థిక పరిస్థితులపై తమ తమ అంచనాలను వెల్లడించాయి. ఇందులో భాగంగా... 2026లో భారత వృద్ధి 6.5% వరకూ ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేయగా.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్) వచ్చే ఏడాది భారత వృద్ధి అంచనా 6.2%గా ఉంటుందని చెబుతోంది.
ఇదే క్రమంలో... మూడిస్ (6.4%), ఎస్ అండ్ పీ (6.7%), ఫిచ్ (7.4%) తమ తమ అంచనాలను వెల్లడించాయి. ఈ సందర్భంగా స్పందించిన కేంద్రం... 2047 నాటికి.. అంటే స్వాతంత్య్రం వచ్చిన 100 ఏళ్లకు హై మిడిల్ ఇన్ కమ్ హోదా పొందాలన్న లక్ష్యంతో ఉన్నామని.. ఆర్థిక వృద్ధి, నిర్మాణాత్మక సంస్కరణలు, సామాజిక ప్రగతి అనే బలమైన పునాదులపై దేశాన్ని నిర్మిస్తున్నామని తెలిపింది. ఈ ఏడాది ద్రవ్యోల్బణం ఏవిధంగా క్రమంగా తగ్గిందో వెల్లడించింది.
ఇందులో భాగంగా... ఈ ఏడాది జనవరిలో ద్రవ్యోల్బణం 4.26 గా ఉండగా.. అది నవంబర్ నాటికి 0.71కి తగ్గిందని తెలిపింది. ఇదే సమయంలో... భారత్ లో నిరుద్యోగం తగ్గుతుందని.. ఎగుమతి పనితీరు మెరుగుపడటం కోనసాగుతుందని తాజా నివేదిక వెల్లడించింది.
