Begin typing your search above and press return to search.

2025లో ఆన్ లైన్ రిటైల్ మార్కెట్.. .అక్షరాల రూ.6 లక్షల కోట్లు

మన జీడీపీలో దీని వాటా 1.6 శాతమే. అదే చైనాలో 13-14 శాతం ఉండగా.. ఇండోనేషియాలో 4-4.5 శాతం ఉంది. మన దగ్గర ఇంటర్నెట్ యూజర్లలో 30 శాతమే ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు.

By:  Garuda Media   |   12 April 2026 2:00 PM IST
2025లో ఆన్ లైన్ రిటైల్ మార్కెట్.. .అక్షరాల రూ.6 లక్షల కోట్లు
X

ప్రపంచంలో మరే దేశంలో లేనంత అత్యధిక జనాభా మన సొంతం. అందుకు తగ్గట్లే భారీ మార్కెట్ మనది మాత్రమే. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లే ఎన్నో అవసరాల్ని తీర్చే వేదికలు ఉన్నాయి. అయితే.. దేశీయంగా ఆన్ లైన్ రిటైల్ మార్కెట్ అంతకంతకూ ముందుకెళుతోంది. ఎంతలా అంటే 2025లో ఏకంగా రూ.6 లక్షల కోట్ల మార్కెట్ ను క్రియేట్ చేసింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని చెప్పాలి. తాజాగా బెయిన్ అండ్ కంపెనీ.. ఫ్లిప్ కార్ట్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

విలువపరంగా గత ఏడాదిలో 19-21 శాతం వ్రద్ధిని నమోదు చేయటం ద్వారా ప్రపంచంలోనే మొదటిదిగా భారత్ నిలిచింది. క్విక్ కామర్స్ లో ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా మారటం గమనార్హం. చైనాతో సహా ప్రపంచంలోని చాలా మార్కెట్లలో నమోదైన వ్రద్ధి రేటుకు మించి భారత్ లో నమోదైనట్లుగా తాజా అధ్యయనం వెల్లడించింది. ఆన్ లైన్ షాపింగ్.. అందుకోసం చేసే ఖర్చు పెరుగుతోంది. 2030 నాటికి భారత ఈ రిటైల్ మార్కెట్ 170-180 బిలియన్ డాలర్లు (రూ.15.8వేల లక్షల కోట్లు - రూ.16.7 వేల లక్షల కోట్లు) చేరవచ్చన్న విషయాన్ని తాజా రిపోర్టు స్పష్టం చేసింది.

గడిచిన రెండేళ్లుగా క్విక్ కామర్స్ విభాగం రెట్టింపు వ్రద్ధిని నమోదు చేసింది. 2025లో ఈ సెగ్మెంట్ లో జీఎంవీ 10-11 బిలియన్ డాలర్లకు చేరగా.. రాబోయే రోజుల్లో 65-70 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. అదనంగా నమోదయయే ఈ రిటైల్ జీఎంవీలో దీని వాటా 45-50 శాతానికి చేరొచ్చు. మొత్తం ఆన్ లైన్ షాపింగ్ లో సంప్రదాయ ఈ-రిటైల్ విభాగం వాటా 60-65శాతంగా ఉండొచ్చు. వచ్చే ఐదేళ్లలో క్విక్ ఈ కామర్స్ వినియోగంలో అదనంగా వెచ్చించే ప్రతి 8 డాలర్లలో భారత్ వాటా ఒక డాలర్ ఉంటుందని చెబుతున్నారు.

గడిచిన ఐదేళ్లలో భారత్ లో ఆన్ లైన్ షాపింగ్ మార్కెట్ డబుల్ అయ్యింది. షాపింగ్ చేసే వారి సంఖ్య 2025లో రెట్టింపుగా మారి 29-30 కోట్లకు చేరింది. ఇందులో జెన్ జీలు కీలకంగా మారారు. ఈ రిటైల్ షాపర్స్ లో వీరి వాటా ఏకంగా 45్-50 శాతం ఉన్నట్లుగా గుర్తించారు. 2025లో అదనంగా వచ్చిన ఈ రిటైల్ ఆర్డర్లలో 50శాతం ఈ వర్గం నుంచి వచ్చిందేనని చెబుతున్నారు.

క్విక్ ఈ కామర్స్ పరిశ్రమగా పెద్ద ఎత్తున ఎదుగుతున్నప్పటికీ భారత్ లో మత్రం ఇప్పటికి ఈ రిటైల్ విస్తరణ చాలా తక్కువగా ఉంది. మన జీడీపీలో దీని వాటా 1.6 శాతమే. అదే చైనాలో 13-14 శాతం ఉండగా.. ఇండోనేషియాలో 4-4.5 శాతం ఉంది. మన దగ్గర ఇంటర్నెట్ యూజర్లలో 30 శాతమే ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. అదే చైనాలో 92 శాతం.. అమెరికాలో 74 శాతంగా ఉంది. ఏమైనా.. రానున్న రోజుల్లో క్విక్ ఈ కామర్స్ కు ఫ్యూచర్ భారీగా ఉందన్న విషయాన్ని తాజా అధ్యయనం స్పష్టం చేస్తుందని చెప్పాలి.